Wednesday, June 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం

- Advertisement -

– తల తాకట్టుపెట్టయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తాం
– పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే కృషి అభినందనీయం : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ-పాలకుర్తి

రాష్ట్రంలో పదేండ్లు రాచరిక పాలన కొనసాగిందని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారని, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల కన్నీళ్లు తుడవడం కోసమే రాష్ట్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి అండగా నిలుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ తల్లి విగ్రహానికి అధికారికంగా గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. పాలకుర్తిలో ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్రంలోనే రెండవదని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను అధిగమించి తల తాకట్టుపెట్టయినా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని స్పష్టంచేశారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేకనే ఇటీవలే వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ సభలో ఆ పార్టీ నాయకులు దిగజారుడు విమర్శలతో అవాకులు చవాకులు చేశారని తెలిపారు. వారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ భాగస్వామ్యం అవుతున్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచి, పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్‌, పాలకుర్తి, కొడకండ్ల మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్లు లావుడియా మంజుల, నల్ల అండాలు, కొడకండ్ల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ ఎర్రబెల్లి రాఘవరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -