విచారణ కమిటీ నివేదికపై సవాల్
కేసులో న్యాయ సూత్రాలు పాటించలేదని ఆరోపణ
నోట్ల కట్టల వ్యవహారంలో కీలక పరిణామం
న్యూఢిల్లీ : నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ కమిటీ నివేదికను, తనను అభిశంసించాలన్న ప్రతిపాదనను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేసినట్టు తెలుస్తున్నది. ఒక జడ్జిని అభిశంసించే సిఫారసును రాష్ట్రపతికి చేయటంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అధికారాన్ని కూడా ఆయన సవాల్ చేశారు. యశ్వంత్ వర్మ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు జడ్జిల విచారణ కమిటీ నివేదికను, జస్టిస్ వర్మ స్పందనను ఈ ఏడాది మే 4న అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీలకు పంపిన విషయం విదితమే. జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియను ప్రారంభించాలని ఈ నివేదిక రాష్ట్రపతికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ముగ్గురు సభ్యుల జ్యుడిషియల్ కమిటీ నివేదికను సవాల్ చేసిన ఆయన.. ఈ కేసులో న్యాయ సూత్రాలను పాటించలేదని ఆరోపించారు. సరైన ప్రక్రియను పాటించకుండానే కమిటీ నివేదికలో అంశాలను పొందుపర్చారని చెప్పారు. అయితే ఈ కేసు విచారణ వచ్చే వారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకపక్క విచారణ కమిటీ ఆయనకు వ్యతిరేకంగా నివేదికను సమర్పించటం, మరోపక్క కేంద్రం కూడా అభిశంసనకు సిద్ధమవుతున్న తరుణంలో జస్టిస్ వర్మ ఈ పిటిషన్‌ను దాఖలు చేయటంతో కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టయ్యింది. ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో కాలిన నోట్ల కట్టలు భారీ మొత్తంలో బయటపడిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం విదితమే. ఈ ఏడాది మార్చి 14న చోటు చేసుకున్న ఈ ఘటన న్యాయ వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత అదే నెల 28న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఈ అంశంపై విచారణ జరిపిన కమిటీ నివేదికను సమర్పించింది. డబ్బులు బయటపడిన విషయం వాస్తవమేననీ, దీనికి సంబంధించి బలమైన ఆధారాలున్నాయని వివరించింది. ఆయనను తొలగించాలంటూ సిఫారసు చేసింది. మరోపక్క జస్టిస్ వర్మను తొలగించేందుకు కేంద్రం కూడా చర్యలు తీసుకుంటున్నది. ఆయనపై అభిశంసన తీర్మానానికి ఇప్పటికే సిద్ధమైంది. 21 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సిద్ధమవుతున్నారు.
సుప్రీంకు జస్టిస్ యశ్వంత్ వర్మ
- Advertisement -
- Advertisement -