– పార్టీలకతీతంగా ఉపరాష్ట్రపతిగా గెలిపించుకుందాం
– ఇండియా బ్లాక్ తెలుగువాడికి అవకాశమివ్వడం మనకు గర్వకారణం
– ఎంపీలు ఆత్మప్రబోధానుసారంగా ఓటేయ్యాలి
– ఓవైపు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఎన్డీయే
– మరోవైపు రక్షించే ప్రయత్నంలో ‘ఇండియా’: సీఎం ఎ.రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఓబీసీ రిజర్వేషన్ల సాధన స్వతంత్ర కమిటీ చైర్మెన్‌గా బడుగు, బలహీన వర్గాల గొంతుకగా ఆయన పని చేస్తున్నారని కొనియాడారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్న మోడీ ప్రతినిధి సీపీ.రాధాకృష్ణన్ అని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. అందులో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు, డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఖర్గే ప్రకటించడం తెలుగు ప్రజల, తెలంగాణ గౌరవ ప్రతిష్టలను మరింత పెంచిందన్నారు. ఏ పార్టీతోనూ సంబం ధంలేని స్వతంత్ర వ్యక్తి సుదర్శన్‌రెడ్డి అని చెప్పారు. ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఓయూలో విద్యనభ్యసించారనీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో జడ్జిగా, చీఫ్ జస్టిస్‌గా, సుప్రీం కోర్టులో జడ్జిగా పనిచేశారని గుర్తుచేశారు. ప్రపంచంతో పోటీపడేలా దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన ప్రధాని పీవీ నర్సింహారావు తర్వాత తెలుగువారికి ఇలాంటి అవకాశం రావడం గొప్ప పరిణామం అని చెప్పారు. పీవీకి ప్రధానిగా అవకాశం వచ్చినప్పుడు సిద్ధాంతపరంగా ఎన్ని వైరుధ్యాలున్నప్పటికీ తెలుగువారికి దక్కిన గొప్ప అవకాశంగా భావించి ఆయన గెలుపు కోసం టీడీపీ నుంచి అభ్యర్థిని పెట్టకుండా అప్పటి సీఎం ఎన్.టి.రామారావు తన రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూరితో కేసీఆర్, చంద్రబాబునాయుడు సహకరించాలనీ, మరోమారు బీఆర్‌ఎస్, టీడీపీ, జనసేన, వైసీపీ, ఎంఐఎం, ఉభయ రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీలు ఆత్మప్రబోధానుసారంగా ఓటేసి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రక్షిం చాలంటే రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడైన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఉప రాష్ట్రపతిగా ఉంటే దేశా నికి ప్రయోజనకరమని నొక్కిచెప్పారు.
రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్న, ఎన్నికల్లో నెగ్గేందుకు ఉన్నవారిని చని పోయినట్టుగా, లేని ఓటర్లను ఉన్నట్టుగా చూపుతూ ఈసీ వంటి రాజ్యాంగ వ్యవస్థలను దుర్విని యోగం చేస్తున్న ఎన్డీయే కూటమి ఒకవైపు ఉండగా.. మహాత్మాగాంధీ స్ఫూర్తితో అంబేద్కర్ అందిం చిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను రక్షించడం వంటి లక్ష్యంతో ఇండియా బ్లాక్ మరో వైపు ఉందని చెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేయా లని కుట్రలు చేస్తున్న వారిని ఓడించాలని పిలుపుని చ్చారు. రాజకీయాలకతీతంగా సుదర్శన ్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారి పైనా ఉందని నొక్కి చెప్పారు. ఉత్తర, దక్షిణ భారతదేశం అనే తారతమ్యం లేదనీ, ఇండియా బ్లాక్ బెంగాల్, కేరళ, బీహార్, కర్నాటక, యూపీ, ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని చెప్పారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఎంపీలు కూడా అండగా ఉండాలని కోరారు. సుదర్శన్‌రెడ్డి గెలిస్తేనే రాజ్యాంగం రక్షించబడుతుందని సీఎం ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
బడుగు, బలహీనవర్గాల గొంతుక జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES