అసమాన గురితో కాంస్యం సొంతం
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్
నాన్‌జింగ్ (చైనా) : భారత స్టార్ ఆర్చర్, తెలుగు తేజం జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సష్టించింది. చైనాలోని నాన్‌జింగ్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో అసమాన రీతిలో 15 సార్లు ఫర్‌ఫెక్ట్ 10 స్కోరు చేసిన జ్యోతి సురేఖ.. ప్రపంచకప్ ఫైనల్లో తొలి పతకం సొంతం చేసుకుంది. వరల్డ్ నం.2 ఎల్లా గిబ్సన్ (గ్రేట్ బ్రిటన్)పై 150-145తో అద్భుత విజయం సాధించింది. మహిళల కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ప్రపంచకప్ ఫైనల్లో లోపరహిత గురితో 150/150 పాయింట్లు సాధించిన ఏకైక ఆర్చర్‌గా జ్యోతి సురేఖ రికార్డు సష్టించింది. ప్రపంచ మేటీ ఎనిమిది మంది ఆర్చర్లు పోటీపడే వరల్డ్‌కప్ ఫైనల్లో జ్యోతి సురేఖ 2022, 2023లోనూ పోటీపడింది.
కానీ ఆ రెండు సార్లు తొలి రౌండ్లోనే నిరాశపరిచింది. శనివారం జరిగిన మహిళల కాంపౌండ్ విభాగం పోటీల క్వార్టర్‌ఫైనల్లో అమెరికా ఆర్చర్ అలెక్సిస్ రూయిజ్ 143-140తో విజయం సాధించింది. సెమీఫైనల్లో వరల్డ్ నం.1 అండ్రీయా బెకెరా చేతిలో 143-145తో ఓటమి చవిచూసింది. తొలి రౌండ్లో 87-86తో జ్యోతి ముందంజ వేసింది. కానీ తర్వాత రౌండ్లో అండ్రీయా 116-115తో పుంజుకుంది. అదే జోరు కొనసాగించిన ఆండ్రీయా సెమీస్‌లో విజయం సాధించి పసిడి పోరుకు చేరుకుంది. మహిళల కాంపౌండ్ విభాగంలో పోటీపడిన మరో భారత ఆర్చర్ మధుర 142-145తో మెక్సికో ఆర్చర్ చేతిలో తొలి రౌండ్లో పరాజయం చవిచూసింది.