ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
‘కాకతీయం తెలంగాణ నాట్యం’ గ్రంథం ఆవిష్కరణ
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ శాస్త్రీయ నృత్య కళా సంపద ‘కాకతీయం’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పద్మజా రెడ్డి విశేష పరిశోధన చేసి రచించిన ‘కాకతీయం’ తెలంగాణ నాట్యం గ్రంథం కర దీపికగా ఉపయుక్తం అని అభినందించారు. నాట్యగురువు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ జి.పద్మజారెడ్డి పదేండ్లుగా వరంగల్ సమీప దేవాలయాల్లో, రామప్ప గుడిలో శిలా శాసనాలు, శిల్పాలు, వివిధ నృత్య గ్రంథాలు, జాయాపసేనాని రచించిన నృత్త రత్నావళిని పరిశీలించి పరిశోధించి, నృత్య మేధావులతో చర్చించి రచించిన ”కాకతీయం తెలంగాణ నాట్యం” గ్రంథావిష్కరణ గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన వేదికపై ప్రణవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి నిర్వహణలో జరిగింది. ఈ గ్రంథాన్ని ఢిల్లీలోని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించగా డిప్యూటీ సీఎం ఆవిష్కరించి మాట్లాడారు.
కాకతీయుల కాలం నాటి చరిత్రను పరిశోధించి ఒక శాస్త్రీయ నృత్య సంపదను వెలుగులోకి తీసుకురావడం గర్వకారణం అని అన్నారు. కాకతీయంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సర్వీస్ కమిషన్ చైర్మెన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. చరిత్రను పరిశోధించి తెలంగాణలో నాట్యానికి ఉన్న ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం అభినందనీయమని అన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా మాట్లాడుతూ.. పద్మజారెడ్డి గొప్ప సాహసం చేశారని, తెలంగాణలో కాకతీయుల కాలం నాటి నృత్య ప్రక్రియను వెలుగులోకి తీసుకొచ్చేందుకు పదేండ్లు శ్రమించారని అభినందించారు.
గ్రంథ రచయిత మాట్లాడుతూ.. చరణ, రసకం, గొండలి, పేరిణి, గుస్సాడి, ఘటిసాని, కోలాటం, డప్పు, కందుక తదితర నృత్యాలు కాకతీయ కాలంలో ఉన్నాయని, వాటన్నింటినీ మేళవించి తెలంగాణకు ప్రత్యేక నాట్యం ఉండాలనే సదుద్దేశంతో ‘కాకతీయం’ అని నామకరణం చేసినట్టు తెలిపారు. నటరాజ రామకృష్ణ పేరిణిని వెలుగులోకి తెచ్చారని, కానీ కాకతీయుల కాలంలో యుద్ధ కళలు, జానపదం తోపాటు శాస్త్రీయ సంప్రదాయ నృత్య కళలు అనేకం విరాజిల్లాయని చెప్పారు. అనంతరం ఆమె శిష్య బృందం ప్రదర్శించిన కాకతీయం నృత్యాంశాలు అలరించి ఆలోచనలు రేకెత్తించాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ప్రఖ్యాత గాయని డాక్టర్ శోభారాజు, పర్యాటక సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, బి.ఆచార్య మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, సీనియర్ పాత్రికేయులు సుశీల్‌రావు, డాక్టర్ మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ శాస్త్రీయ నృత్య కళా సంపద ‘కాకతీయం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



