Saturday, August 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసీఎం రేవంత్‌ రెడ్డికి 'కాళేశ్వరం' నివేదిక

సీఎం రేవంత్‌ రెడ్డికి ‘కాళేశ్వరం’ నివేదిక

- Advertisement -

– అందజేసిన భట్టి, ఉత్తమ్‌, పొంగులేటి
– బీసీ రిజర్వేషన్ల తరహాలోనే అధ్యయనానికి ప్రత్యేక కమిటీ
– 4న క్యాబినెట్‌కు ‘యాక్షన్‌’ రిపోర్టు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ నివేదికను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎంను కలిసి మంత్రులు పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికను సమర్పించారు. కాళేశ్వరం బ్యారేజీల్లో అవకతవకలు, అవినీతి, ఇతర అంశాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ న్యాయ విచారణ చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత నివేదికను గురువారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు చైర్మెన్‌ ఘోష్‌ అందజేశారు. ఆ నివేదిక శుక్రవారం సీఎంకు చేరింది. ఈ సందర్భంగా నివేదికపై సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రులు, సీఎస్‌ రామకృష్ణారావు సమగ్రంగా చర్చించారు.

అధ్యయనానికి కమిటీ
కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి చర్యలకు సిఫారసు చేసేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో నీటిపారుదల శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిని సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం ఈ నెల 4న ప్రభుత్వానికి యాక్షన్‌ రిపోర్టును సమర్పిస్తారు. క్యాబినెట్‌లో ఈ విషయమై చర్చించి సారాంశాన్ని క్యాబినెట్‌కు తెలియజేశారు. అక్కడ మంత్రుల అభిప్రాయాలు, చట్టం, నీటిపారుదల శాఖ నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ షమీమ్‌ అక్తర్‌ నివేదికపై అధ్యయనం చేసిన అనంతరమే అసెంబ్లీలో బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపారు. ఇప్పుడు కాళేశ్వరం నివేదిక విషయంలోనూ రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించిన అనంతరం అసెంబ్లీలోనూ చర్చకు పెట్టే అవకాశం ఉంది. అప్పుడు నివేదికలోని సారాంశం ఆధారంగా ఐఏఎస్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ చేసే సిఫారసులను చర్యల రూపంలోకి మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది.

అన్ని రకాల వైఫల్యాలు
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయనీ, దీనికి కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు పలువురు కారణమని పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టానుసారం ప్రాజెక్టు పనులు జరిగాయనీ, ఉన్నతస్థాయిలో వచ్చిన ఒత్తిడికి మార్గదర్శ కాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని నివేదికలో తెలిపినట్టు సమాచారం. ఆర్థిక అవకతవకలు జరిగాయనీ, ఇలా పలు అంశాలను కాళేశ్వరం న్యాయ విచారణ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డీపీఆర్‌ తయారీ మొదలుకొని మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీల వరకు ఎప్పుడు ఏం జరిగిందనే విషయాలను రికార్డుల ఆధారంగా ఎక్కడ, ఎవరు బాధ్యులన్నది వివరంగా నివేదికలో తెలియజేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఆ మేరకే చర్యలు
పీసీ ఘోష్‌ నివేదికను 650 పేజీలతో సమర్పించారు. ఇందులో ఘోష్‌ కమిషన్‌ అంశాల వారీగా బాధ్యులు ఎవరనే సంగతులను కూడా నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. ఒత్తిడికి లొంగి వ్యవస్థల నిబంధనల ప్రకారం కాకుండా వ్యక్తుల ఇష్టానుసారం కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను నిర్మించారనీ, కనీస మార్గదర్శకాలను పట్టించుకోలేదని నివేదికలో పేర్కొన్నారనే ప్రచారం జలసౌధలో జరుగుతున్నది. ఇప్పటికే దాదాపు 40 మందికి పైగా అధికారులను గుర్తించారు. వాళ్లపై చర్యలు సైతం తీసుకున్నారు. ఇప్పుడిక పూర్తిస్థాయి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఒకవేళ గత ప్రభుత్వంలోని కీలక నేతలను రేవంత్‌ సర్కారు కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తే, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం కల్పిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -