ఒక అంతస్తు వరకు నీటమునిగిన భవనాలు
చెరువులను తలపించిన కాలనీలు
పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష
గోడ కూలి వైద్యుడు మృతి
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
భారీ వర్షం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ముంచెత్తింది. బుధవారం ఉదయం ప్రారంభమైన వర్షం గురువారం సాయంత్రం వరకు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పంటలు నీటమునిగాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం రావడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. కుంభవృష్టి వర్షం కామారెడ్డిని అతలాకుతలం చేసింది. రాజంపేట్‌లో వరద ప్రవాహానికి ఇంటిగోడ కూలి డాక్టర్ మృతిచెందారు. కామారెడ్డిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్‌షెట్కార్ పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. అనంతరం సమీక్షించి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అధికారులు, పోలీసులు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రశంసించారు.
కామారెడ్డి పట్టణంలో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దేవి విహార్ కాలనీలో ఒక అంతస్తు వరకు ఇండ్లు నీట మునగడంతో స్థానికులు పై అంతస్తులకు వెళ్లి తలదాచుకున్నారు. సాయంత్రం వేళ రెస్య్కూ బృందాలు వచ్చి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కామారెడ్డి-హైదరాబాద్ వెళ్లే 44వ జాతీయ రహదారి వరద తాకిడికి పలుచోట్ల కోతకు గురైంది. దీంతో హైవేపై దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వన్ వేలో వాహనాలను పంపిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కామారెడ్డి-భిక్కనూర్ మార్గంలో పట్టాల కింద గండిపడటంతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. కామారెడ్డిలో సీపీఐ(ఎం) కార్యకర్తలు వరద ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ప్రాణాలు నిలిపిన పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరద పొంగిపొర్లింది. పలు చోట్ల వాగులు, చెరువు కట్టలు తెగిపోయి వరద ముంచెత్తింది. వరద నీటిలో చిక్కుకున్న వారిని పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా రక్షించాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లిలోని గిరిజన గురుకుల పాఠశాలలోకి నీరు చేరడంతో సుమారు 300 మంది విద్యార్థులను సురక్షితంగా తరలించారు. మనిషి లోతు వరద నీరు చుట్టుముట్టడంతో తాడు ఏర్పాటు చేసి కామారెడ్డి పోలీసులు వారిని సురక్షితంగా తరలించారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన బట్టు గణేష్, సిరిగారి రాజు వాగులో ద్విచక్ర వాహనంతో కొట్టుకుపోగా.. బోరు మోటర్ పైపులు పట్టుకొని బయటపడ్డాడు. సంగమేశ్వర్‌లో వరదకు పశువుల షెడ్డు కొట్టుకుపోగా.. మూడు పశువులు మృత్యువాత పడ్డాయి.
సీఎం ఏరియల్ సర్వే.. మంత్రి సీతక్క పర్యటన సమీక్ష
కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. హెలిక్యాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో జిల్లా అధికారులతో సమీక్ష చేయలేకపోయారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేశ్‌చంద్రతో కలిసి వరద ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, మంచినీరు, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలని, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు. ప్రతి కుటుంబానికీ అవసరమైన సాయం అందించాలన్నారు. భారీ వర్షంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరద ముంచెత్తినా ఆస్తి, ప్రాణ నష్టం రాకుండా నివారించగలిగినట్టు అభినందించారు.
కామారెడ్డి అతలాకుతలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES