– ఐకెపి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగాధర్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
కమ్మర్ పల్లి మండల కేంద్రంలో మహిళా సమాఖ్య సభ్యురాలు తయారు చేసిన పిండి వంటలు రాష్ట్ర రాజధానికి చేరాయి. తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రాష్ట్ర ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) దివ్య దేవరాజన్ ఐఏఎస్ కు కమ్మర్ పల్లి సమాఖ్య సభ్యురాలు వనజ, పెద్దమ్మ తల్లి హోమ్ ఫుడ్స్ పేరుతో తయారుచేసిన పిండి వంటలను అందజేసినట్లు ఐకెపి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుంట గంగాధర్ శుక్రవారం తెలిపారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి ఏపిఎం ల బదిలీల ప్రక్రియను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర ముఖ్య కార్య నిర్వహణాధికారి, సీఎంవో కార్యదర్శి దివ్య దేవరాజన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన వివరించారు.
ఈ క్రమంలో స్వీట్ హోమ్ లో తయారుచేసిన తీపి పదార్థాలు కాకుండా మహిళా సంఘం ద్వారా రుణం పొంది, ఉపాధి పొందుతున్న కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని సభ్యురాలు వనజ, పెద్దమ్మ తల్లి హోమ్ ఫుడ్స్ పేరుతో తయారుచేసిన నేతి రవ్వ లడ్డులను అందజేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో స్థానికంగా మహిళా సంఘ సభ్యులు సాంప్రదాయ బద్ధమైన వృత్తులు చేపడుతూ ఉపాధి పొందడం సంతోషాన్ని కలిగించిందని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు కుంట గంగాధర్ తెలిపారు. మహిళా సమాఖ్య సభ్యులు సుచి శుభ్రతతో, నియమ నిబంధనలు పాటిస్తూ పిండి వంటలు తయారు చేస్తున్నారని, బెల్లం స్వచ్ఛమైన నూనెలు నెయ్యి కాజు బాదం లతో నాణ్యమైన రవ్వతో ఈ లడ్డులు తయారు చేయడంతో పాటు అరిసెలు, గర్జలు, సకినాలు, కారప్పూస, మురుకు ఇతర పిండి వంటలను కూడా తయారు చేస్తున్నారన్నారు.
తమ మండల కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను స్వీట్ హోమ్ నుంచి తీపి పదార్థాలు తీసుకురాకుండా మహిళా సంఘాల సభ్యుల వద్దనే తెలంగాణ సాంప్రదాయ పిండి వంటలైన అరిసెలు, గర్జలు, రవ్వ లడ్డులను చేయించి అందించడం జరుగుతుందని గంగాధర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కు వివరించారు. సంబంధిత పిండి వంటలను రుచిచూసిన సీఈవో ఆనందం వ్యక్తం చేసి సంబంధిత తయారీదారులకు తన తరఫున అభినందనలు తెలిపారన్నారు.శుచి శుభ్రత, తెలంగాణ సాంప్రదాయంతో పాటు ఆరోగ్యాన్ని పంచే మహిళా సంఘ సభ్యులు తయారుచేసిన పిండి వంటలకు విస్తృత ప్రచారం లభించేలా చూడాలని సెర్ప్ సీఈఓ కు పేర్కొన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులు ఏపూరి నరసయ్య, బాణాల రాజారెడ్డి, మహేష్, జానయ్య, యాదగిరి, రాజప్ప, తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్ సీఈఓకు కమ్మర్ పల్లి సమాఖ్య పిండి వంటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES