నవతెలంగాణ – హైదరాబాద్: దాదాపుగా రెండేండ్ల తరువాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదివారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సహచర మంత్రులైన పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరిలతో కలిసి గాంధీ భవన్ లో సోమవారం మాట్లాడారు. కేసీఆర్ అసలు సమస్య పాలమూరు ప్రాజెక్టు గురించి కాదని, రాష్ర్టంలో బీఆర్ఎస్ బలహీన పడిన సంగతి ఆయనకు అర్థమైందన్నారు. అందుకే పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవడానికే కేసీఆర్ బయటకు వచ్చారని అన్నారు.
పండేండ్లు పాలించి, ఒక్క ఎకరాకు నీళ్ళివ్వలేదని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రధాన కాలువలు కూడా పూర్తిచేయలేదు. 2023 ఎన్నికల సమయంలో ఒక మోటార్ ఆన్‌చేసి పాలమూరు ప్రాజెక్టు జాతికి అంకితమన్నారు. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా ఆ పని చేశారు. ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని పూర్తిచేస్తానని, రాష్ర్టానికి రూ.8 లక్షల కోట్ల అప్పు మిగిల్చారని విమర్శించారు.
పాలమూరు ప్రాజెక్టు పూర్తికి కోర్టు అనుమతులిచ్చిందని అన్నారు. ఇరు రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీలు అని విభజన చట్టంలో ఉంది. కానీ కేసీఆర్ తెలంగాణకు 299 టీఎంసీలు చాలనీ, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలని పదేండ్లు వదిలేశారని జూపల్లి విమర్శించారు.



