నవతెలంగాణ-హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ రిపోర్టుపై మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్టే విధించాలని పిటీషన్‌లో కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, కమిషన్ నివేదిక వారికి అనుకూలంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. వారి పిటిషన్ బుధవారం విచారకు వచ్చే అవకాశం ఉంది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ పథకంగా ప్రచారం పొందింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అక్రమాలు, నాణ్యతా లోపాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మెడిగడ్డ బ్యారేజీ వద్ద పియర్లు కుంగిపోవడం, నిర్మాణంలో లోపాలు, డిజైన్ లోపాలను నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఈ ప్రాజెక్టులో పనిచేసిన అధికారులపై అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈ విషయంపై జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ విచారణ జరిపి..పలు పేజీలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే.