Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనీళ్ల ద్రోహి కేసీఆరే.. అడ్డుకున్నది బీజేపీయే..

నీళ్ల ద్రోహి కేసీఆరే.. అడ్డుకున్నది బీజేపీయే..

- Advertisement -

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌వి దొంగ నాటకాలు
కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరరు?
కల్వకుంట్ల కవితకు హ్యాట్సాప్‌ : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌


నవతెలంగాణ – కరీంనగర్‌
తెలంగాణకు నీళ్ల విషయంలో తీరని ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆరేనని, ఆనాడు అడుగడుగునా ఉద్యమాలు చేసి అడ్డుకున్నది బీజేపీయేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నేతలు అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టుకుంటూ, అబద్ధాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం సహకారంతో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ఆపాలని తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అనేకసార్లు లేఖలు రాశానని, కేంద్రంతో కొట్లాడానని చెప్పారు. నాడు ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కై కేసీఆర్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాలకు డుమ్మా కొట్టారని, కేంద్రం జోక్యంతోనే కేఆర్‌ఎంబీ ద్వారా రాయలసీమ ప్రాజెక్టు ఆగిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే.. కేవలం రూ.9వేలకోట్ల విచారణకే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పరిమితమయ్యారని ప్రశ్నించారు. తక్షణమే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆరు గ్యారంటీల అమలు, బీఆర్‌ఎస్‌ పదేండ్ల అవినీతిపై అసెంబ్లీలో చర్చ జరపాలన్నారు. కమీషన్ల కక్కుర్తిని పక్కనపెట్టి కృష్ణానది జలాల్లో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని, ఇందుకు కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అవినీతి అక్రమాలను బయటపెడుతున్న కల్వకుంట్ల కవితకు హ్యాట్సాప్‌, అవినీతి బయట పెట్టే వారికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్‌రావు, శంకర్‌, నాయకులు బోయినిపల్లి ప్రవీణ్‌కుమార్‌, బాస సత్యనారాయణ, గుగ్గిళ్ల రమేష్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -