నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తాజాగా పార్టీ అధినేత కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనను చంపుతామని వచ్చిన బెదిరింపులను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం నుంచి తాను నిర్విరామంగా పార్టీ బలోపేతం కోసం పని చేశానని తెలిపారు. 2009 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బలవంతంగా నిలబెట్టారని, 2014, 18 ఎన్నికల్లోనూ ఎంపీ బీ ఫామ్ ఇవ్వాలని చూశారని చెప్పారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన రాజయ్య, కడియం శ్రీహరికి మంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు.
అచ్చంపేటలో తనపై దాడులు జరిగినా ప్రశ్నించలేదన్నారు. భూకబ్జాలు జరుగుతున్నా ప్రశ్నించడంలో విఫలమయ్యారని విమర్శించారు. మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో పట్టించుకోలేదన్నారు. ఉమామహేశ్వర ప్రాజెక్టు గురించి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినా పురోగతి లేదని బాలరాజు ఆరోపించారు. ఈ పరిస్థితుల కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని బాలరాజు వివరించారు.