Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేసీఆర్‌ నీడలోంచి గెంటేశారు

కేసీఆర్‌ నీడలోంచి గెంటేశారు

- Advertisement -

నా దారి నాదే.. మీ ఆశీర్వాదం కోసం వచ్చా
ఎన్నో అవమానాలను భరించా : తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్‌ నుంచి ‘జాగృతి జనం బాట’ ప్రారంభం
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

‘నేను 27 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ఉద్యమంలోకి వచ్చా. 20 ఏండ్లుగా తెలంగాణ కోసం, కేసీఆర్‌ కోసం, టీఆర్‌ఎస్‌, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ కోసం పనిచేశా. బీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలే. కానీ నన్ను కుట్ర చేసి పంపించారు. నిజామాబాద్‌లో నా ఓటమి కుట్రనా? కాదా? ఆలోచించాలి. ఇక్కడ ఏం కుట్ర జరిగిందో చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. ఎన్ని అవమానాలు జరిగినా సరే నాన్నపైనా, బీఆర్‌ఎస్‌పైనా ప్రేమతో భరించా. కానీ ఇంటి గుట్టు బయటపెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇన్నాళ్లు కేసీఆర్‌ నీడలో ఉన్నా. ఇప్పుడు ఆ నీడలోంచి నన్ను బయట పడేశారు. అందుకే నా దారి నేను వెతుక్కున్నా. మీరు ఆశీర్వదిస్తారని మీ కోసం వచ్చాను.. మీరు అండగా ఉంటారని నమ్ముతున్నాను” అని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నాలుగు నెలలపాటు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో చేపట్టనున్న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమాన్ని నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి శనివారం ప్రారంభించారు. అంతకుముందు హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపానికి ఆమె నివాళి అర్పించారు. ఆ తర్వాత జిల్లాకు వచ్చిన కవితకు జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జాగృతి కార్యాలయం వద్ద మాట్లాడారు. ‘5 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా నిజామాబాద్‌ రాలేకపోయాను. నేను నిజామాబాద్‌ కోడలిని. ఇది నా గడ్డ. ఎప్పటికైనా ఈ గడ్డలోనే కలిసిపోతా..” అని అన్నారు.’10 ఏండ్లలో మనం కొంత సాధించుకున్నాం. కానీ అమర వీరుల కుటుంబాలకు గౌరవం, న్యాయం దక్కలేదు. ఆనాటి ఉద్యమకారులకు, ఈనాటి ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగింది. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు ఉద్యమం చేస్తాం. ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని నేను కోరుతున్నా’ అని కవిత అన్నారు. రాష్ట్రంలో పేద వారికి ఇండ్లు, వైద్యం, విద్య అందాల్సిన అవసరం ఉందని, నిజామాబాద్‌ గవర్నమెంట్‌ ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా మారిందని కవిత అన్నారు. కాంగ్రెస్‌కు పాలన చాతకావట్లేదని, ఈ జిల్లాకే చెందిన పీసీసీ ప్రెసిడెంట్‌ మహేశ్‌ గౌడ్‌ దీనిపై ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు.ఈ సందర్భంగా నవీపేట్‌ మండలం యంచలో పొలాలు ముంపునకు గురైన రైతులతో కవిత సమావేశం అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -