నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చరిత్రలో నిలిచిపోయే గొప్ప రోజు నవంబర్ 29 అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ స్థాయి బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఎమ్మెల్యే తలసాని అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 29వ తేదీన తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని దీక్షా దివస్ ను పండుగ వాతావరణంలో ఎంతో ఘనంగా జరపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేష్, తదితరులు పాల్గొన్నారు.



