Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేసీఆర్‌ దీక్ష ఓ నాటకం…

కేసీఆర్‌ దీక్ష ఓ నాటకం…

- Advertisement -

– మళ్లీ సెంటిమెంటును రెచ్చగొట్టే యత్నం
– బీఆర్‌ఎస్‌ది ముగిసిన కథ… వారి మాటలు నమ్మొద్దు
– బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ను నిలదీయండి :టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష చేశానని, పులి నోట్లో తలపెట్టి, చావుకు ఎదురెళ్లానంటూ మాజీ సీఎం కేసీఆర్‌ గతంలో పచ్చి అబద్ధాలు వల్లె వేశారని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ విమర్శించారు. ఆయన దీక్షంతా ఒట్టి నాటకమంటూ కొట్టిపారేశారు. అధికారం కోల్పోయి కకావికలమైన బీఆర్‌ఎస్‌ నేతలు ఏం చేయాలో అర్థంకాక ఇప్పుడు.. దీక్షా దివస్‌ అంటూ సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరస ఓటములతో ఉనికి కోల్పోతున్న బీఆర్‌ఎస్‌ మరో కొత్త డ్రామాకు తెరదీసిందని ఎద్దేవా చేశారు. దీక్షా దివస్‌ పేరిట ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైందని విమర్శించారు. 2009లో కేసీఆర్‌ చేసిన దీక్ష పూర్తిగా నాటకమన్నారు. ఆయన దీక్ష వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదనీ, సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో కొత్త రాష్ట్రం సాకారమైందని స్పష్టం చేశారు. ‘రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నా’ అని చెప్పి నిమ్స్‌లో ఫ్లూయిడ్స్‌ తీసుకున్న ఘన చరిత్ర కేసీఆర్‌ది అంటూ ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, కేటీఆర్‌ ఒక్కసారి చదవాలని సూచించారు. ఇప్పుడు కేసీఆర్‌ బయటికి వస్తే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ కథ ముగిసిందని పేర్కొన్నారు. ప్రజల సెంటిమెంట్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని కేసీఆర్‌ కుటుంబం పదేండ్లపాటు లబ్ది పొందిందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల మాటలు నమ్మొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పించాలని సూచించారు.

నిజమైన దీక్షకు మయన్మార్‌ ఐరన్‌ లేడీ ఇరోమ్‌ షర్మిలా 16 ఏండ్లపాటు నిరాహార దీక్షే ఉదాహరణని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. షర్మిల దీక్షకు కేసీఆర్‌ దీక్షకు ‘నక్కకు నాగలోకానికి ఉన్నంత’ తేడా ఉందని వ్యాఖ్యానించారు. ‘ నాలుగు లక్షల మంది చస్తే తప్ప తెలంగాణ రాదని’ కేసీఆర్‌ ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిందంటే అది సోనియా గాంధీ చలవ వల్లేనని పేర్కొన్నారు. ఆమె లేకపోతే రాష్ట్రం రాదని కేసీఆర్‌ స్వయంగా చెప్పారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకుని అనేక వర్సిటీల విద్యార్థులు ఉద్యమానికి ఊపిరులూదారని గుర్తు చేశారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు స్పందించిన సోనియా తెలంగాణ ఇచ్చారని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అప్పటి సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారని గుర్తు చేశారు. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులుగా కూడా పని చేశారని తెలిపారు. ఇది కొత్త విషయం కాదన్నారు. నల్లగొండ డీసీసీ కైలాష్‌ నేత మాట్లాడిన వీడియో మూడేండ్ల క్రితందేన్నారు. ఆయన మాటలను తాను సమర్థించబోనన్నారు. ఇప్పటికే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -