నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు కాథలిక్ నన్‌ల విడుదలలో జోక్యం చేసుకోవాలని కోరుతూ డీఎంకె ఎంపీ పి.విల్సన్ కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిరణ్ రిజిజులకు శుక్రవారం లేఖ రాశారు. మానవ అక్రమ రవాణా, బలవంతపు మతమార్పిడి ఆరోపణలతో ఇద్దరు కేరళ నన్స్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇద్దరు నన్స్ ప్రీతి మెరీ, వందన ప్రాన్సిస్‌లను బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలతో ఏకపక్షంగా అరెస్ట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరియు రాజ్యాంగ సమతుల్యతను పునరుద్ధరించేందుకు కేంద్ర మంత్రులు అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరారు. భారత రాజ్యాంగంలోని సంబంధిత సవరణను ప్రవేశపెట్టడం ద్వారా జాతీయ మైనారిటీల కమిషన్ (ఎన్‌సిఎం)కు రాజ్యాంగ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
మైనారిటీలపై దాడులను క్రిమినల్ నేరంగా పరిగణించి, మతపరంగా మైనారిటీలను రక్షించి, రాజ్యాంగం ప్రకారం వారి హక్కులను పరిరక్షించేలా చూడాలని, జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం, 1992ను సవరించాలని కోరారు. జాతీయ మైనారిటీల కమిషన్‌లో చైర్మన్ సహా ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, గుర్తింపుపొందిన ఆరు మైనారిటీ వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాలని ఎంపి విల్సన్ స్పష్టం చేశారు.