సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బృందా కరత్
తిరువనంతపురం : భారతదేశ రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తున్న ఏకైక రాష్ట్రం కేరళం అని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బృందా కరత్ అన్నారు. కొల్లాం జిల్లా కుందర, చతనూర్, పతనం తిట్ట జిల్లా కుంబనాద్, తిరువల్ల సభల్లో ఆమె ఆదివారం ప్రసంగించారు. నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీ తమతోపాటు అబద్ధాలు తయారు చేసే యంత్రాలను కేరళ తీసుకొస్తున్నారని విమర్శించారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార భద్రత వంటి కీలక రంగాల్లో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో ఉందని ఆమె స్పష్టం చేశారు.
కేంద్రం అడ్డంకులను అధిగమించి అభివృద్ధి సాధించాం
కేంద్ర ప్రభుత్వం అనేక అడ్డంకులను కల్పించినా వాటిని అధిగమించి పదేండ్లలో సాటిలేని అభివృద్ధిని సాధించామని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. పాలక్కాడ్ జిల్లాలోని పలు సభల్లో ఆదివారం ఆయన ప్రసంగించారు. మౌలిక సదుపాయాల నుండి సామాజిక సంక్షేమం వరకు అన్ని రంగాల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తూ, అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరాయని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా మహమ్మారి వంటి క్లిష్ట సమయాల్లోనూ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. ప్రతి సంక్షోభంలోనూ ఎంతో దృఢంగా, సంకల్పంతో ప్రజలకు మార్గనిర్దేశం చేసిందని ఆయన తెలిపారు.
ఈ సంక్షోభ సమయాల్లో, కేంద్ర ప్రభుత్వం కేరళకు ఎటువంటి సహాయాన్ని అందించడానికి నిరాకరించడమే కాకుండా, సహాయం చేయడానికి ముందుకు వచ్చిన విదేశాలను కూడా అడ్డుకుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ముండక్కై-చూరల్మల కొండచరియలు విరిగిపడిన విపత్తు అనంతర పరిస్థితుల్లోనూ ఇదే విధమైన ఉదాసీనత స్పష్టంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. కేరళ విఫలమవ్వాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కోరుకుంటోందని, రాష్ట్రం కోలుకుని, అభివృద్ధి చెందడానికి అనుమతించకూడదనే భావనతో అది వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి దక్కాల్సిన వనరుల వాటాను నిరాకరించడం ద్వారా, కేరళను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయడానికి కేంద్రం పథకం ప్రకారం ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో కేరళ వాటా 2.5 శాతం ఉన్నప్పటికీ, జాతీయ పన్నుల పంపిణీలో కేవలం 1.9 శాతం మాత్రమే లభిస్తోందని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రుణ పరిమితులను భారీగా తగ్గించడం ద్వారా, ఇప్పటికే మంజూరైన నిధులను నిలిపివేయడం ద్వారా రాష్ట్రంపై ‘పూర్తి స్థాయి ఆర్థిక దిగ్బంధం’ విధించిందని విమర్శించారు. రాష్ట్రంలో కులవివక్ష, మత దురభిమానం పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే ఇందుకు కారణమని అన్నారు. గత పదేండ్లుగా ఎటువంటి మత హింసకు గానీ, అల్లర్లకు గానీ తావులేని విధంగా కేరళలో లౌకిక, బహుళత్వ స్వభావాన్ని కాపాడటాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం కేరళకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలపై గళం విప్పడానికి కాంగ్రెస్ గానీ, యూడీఎఫ్ గానీ ముందుకు రాకపోవడం అత్యంత ఆందోళన కలిగించే విషయమని ఆయన తెలిపారు. అబద్ధాలను నిరంతరం పునరావృతం చేయడంలో ప్రతిపక్షాలు అనుసరిస్తున్న తీరు, సాక్షాత్తు ‘గోబెల్స్’నే సిగ్గుపడేలా చేసేంత దారుణంగా ఉందని ఆయన విమర్శించారు.
అభివృద్ధిపై ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళ్తున్నాం : విజ్జూ కృష్ణన్
ప్రజా సంక్షేమం, అభివద్ధిపై ఆత్మవిశ్వాసంతో ఎల్డీఎఫ్ ఎన్నికలను ఎదుర్కొంటోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజ్జూ కృష్ణన్ తెలిపారు. వడసెరిక్కర, థన్నితోడె, కొడుమాన్లో ఎల్డిఎఫ్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన సభల్లో ఆదివారం ఆయన ప్రసంగించారు. కార్పొరేట్, మతోన్మాద శక్తుల ఆగడాలకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందని తెలిపారు. అభివృద్ధి, ప్రజాసంక్షేమం, రోడ్లు, పెన్షన్లు తదితర అంశాలపై మాట్లాడే ధైర్యం లేకపోవడం వల్లే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. సాధించిన అపూర్వమైన అభివృద్ధి ఆధారంగానే ఎన్నిలకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.



