నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది జూలైలో థాయ్‌లాండ్, కాంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. ఐదు రోజులపాటు రెండు దేశాల ఆర్మీ బలగాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. తర్వాత ఇరుదేశాల అధినేతల చర్చలతో కాల్పుల విరమణ ఒప్పందం అమలోకి వచ్చింది. దీంతో తాత్కాలికంగా రెండు దేశాల మధ్య ఘర్షణలు సద్దుమణిగాయి. తాజాగా మలేషియా వేదికగా రెండు దేశాలు సరిహద్దు వివాదానికి ముగింపు పలికాయి. ఈమేరకు గురువారం ఇరుదేశాల అధినేతలు సుదీర్ఘ చర్చలు సాగించి..అందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే ఈ నెల 25-26న మలేషియా వేదికగా ఏషియాన్ సదస్సు జరగనుంది. ఈక్రమంలో రెండు దేశాలు సరిహద్దు వివాదంపై కీలక ఒప్పందం చేసుకోవడం గమనార్హం.
థాయ్‌లాండ్- కంబోడియా మధ్య సరిహద్దు వివాదాల కారణంగా ప్రసాత్ తా ముయెన్ థామ్ సమీపంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సరిహద్దు సమీపంలో జరిగిన ఒక ల్యాండ్ మైన్ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు. దీనికి ముందు కూడా ఒక ల్యాండ్ మైన్ పేలి, ముగ్గురు థాయ్ సైనికులు గాయపడ్డారు. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ప్రాంతంపై కంబోడియాకు సార్వభౌమాధికారాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి ఇరు రెండు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.