Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమౌలిక సదుపాయాల కల్పనపై కీలక దృష్టి

మౌలిక సదుపాయాల కల్పనపై కీలక దృష్టి

- Advertisement -

– సర్కారు పాలసీ, నిర్మాణరంగం గ్రోత్‌ ఇంజిన్స్‌
– రాజకీయ నేతల అపోహలతో నష్టపోవద్దు
– విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నోళ్లం..మిమ్మల్ని వదులుకుంటామా?
– స్థానికులకే తొలి ప్రాధాన్యత
– అభివృద్ధి పనుల అనుమతుల కోసం ఢిల్లీ వెళ్లడం కూడా తప్పేనా? : క్రెడారు ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

విద్యుత్‌, నీటి వసతి, రవాణా వంటి మౌలిక సదుపాయాలు బాగుంటేనే పెట్టుబడులు విరివిగా వస్తాయనీ, అందుకే తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనపై తమ ప్రభుత్వం కీలక దృష్టి సారించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. రాజకీయ నేతల అపోహలను నమ్మొద్దనీ, వాటికి ఊతమిచ్చి నష్టపోవద్దని క్రెడారు ప్రతినిధులకు సూచించారు. విదేశాలకెళ్లి మరీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నోళ్లం.. ఇక్కడే పుట్టి.. ఇక్కడి నేలపైనే పెట్టుబడి పెడుతున్నవారిని ఎలా విస్మరిస్తామని అన్నారు. స్థానికులకు తొలి ప్రాధాన్యమిస్తామని భరోసానిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ‘క్రెడారు హైదరాబాద్‌ ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అపోహలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నవారికి కనువిప్పు కలిగేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రెడారు ప్రతినిధులను అభినందించారు.

ప్రభుత్వ పాలసీ, నిర్మాణ రంగం రెండూ రాష్ట్రాభివృద్ధికి గ్రోత్‌ ఇంజన్స్‌ లాంటివన్నారు. నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలున్నా పాలసీపరమైన పెరాలసిస్‌ లేకుండా చూడటం వల్లనే ప్రపంచంతో హైదరాబాద్‌ నగరం పోటీపడుతోందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత కూడా తమ ప్రభుత్వంపై ఉందన్నారు. తాను సగటు మధ్యతరగతి ఆలోచనలున్న సీఎంననీ, సమాజ శ్రేయస్సు కోసమే ఎక్కువ ఆలోచిస్తానని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు అడిగిన వాటన్నింటికీ అంగీకరించకపోవచ్చు, సహకరించకపోవచ్చుగానీ ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధికి ఎల్లప్పుడు అండగా ఉంటానని భరోసానిచ్చారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చొరవతో తెలంగాణకు మెట్రో వచ్చిందనీ, కానీ, గత పాలకుల నిర్లక్ష్యంతో పదేండ్లలో విస్తరణ జరగలేదని వాపోయారు. మెట్రో విస్తరణ జరిగి ఉంటే హైదరాబాద్‌లో కొంత మేరకైనా ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించేదని అభిప్రాయపడ్డారు. జనసాంద్రత ఎక్కువున్న నగరాల్లో మల్టీ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్స్‌ పెరగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. షామీర్‌పేట్‌, మేడ్చల్‌ వరకు మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నామని తెలిపారు. మహానగరం ప్రతిష్టపెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నొక్కి చెప్పారు.

కేంద్రం అనుమతులు తెచ్చుకోవడం కూడా తప్పేనా?
తాను మాటమాటకీ ఢిల్లీ వెళ్తున్నానని టార్గెట్‌ చేసి కొందరు మాట్లాడటాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. మెట్రో, మూసీ, తదితర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి అవసరం లేదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడకు కాకుండా ఇంకెక్కడికి వెళ్తారని నిలదీశారు. ఢిల్లీలో సీఎంకు బంగళా ఇచ్చింది నెలకు నాలుగు రోజులు అక్కడకెళ్లి కేంద్రంతో కొట్లాడి అనుమతులు తెచ్చుకోవడానికేననీ, ఆ బంగళాను ఫామ్‌హౌస్‌లా వాడుకుని దావత్‌లు చేసుకోవడానికి కాదని స్పష్టం చేశారు. రూ.26 వేల కోట్లు రుణాలను 35 ఏండ్లకు 7.5 శాతం వడ్డీకి రీస్ట్రక్చర్‌ చేయించాననీ, రూ. 2 లక్షల కోట్ల రుణాలకు రీస్ట్రక్చర్‌ కోసం ప్రధానిని కోరుతున్నానని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ఐదారు ఎయిర్‌పోర్టులున్నాయనీ, తెలంగాణలో ఒక్క ఎయిర్‌పోర్టు ఉంటే సరిపోతుందా? మిగతా నగరాలకు అవసరం లేదా? తెలంగాణకు మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకోవద్దా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మెట్రో, ఎయిర్‌పోర్టులు, రీజనల్‌ రింగ్‌రోడ్డు, రీజనల్‌ రింగ్‌ రైల్‌లైన్‌ అనుమతులు అడగటం రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా అని ప్రశ్నించారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 11 కొత్త రేడియల్‌ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. హైదరాబాద్‌ అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా త్వరలోనే అనుమ తులు రాబోతున్నాయని చెప్పారు.

నీళ్లుండే చోటుకు మనమెళ్తే నీళ్లెక్కడికి వెళ్తారు?
నీళ్లుండే చోటును మనమెళ్లి ఆక్రమిస్తే మరి నీళ్లు ఎక్కడకు పోతాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అందుకే హైడ్రాతో చెరువులను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. నాలాల ఆక్రమణలను తొలగిస్తే ఓ పెద్ద మనిషి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను కోర్‌ అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్రెడారుపై ఉందన్నారు. కులీ కుతుబ్‌ షా చార్మినార్‌ కట్టారు.. ఔటర్‌ రింగ్‌ రోడ్డును వైఎస్‌ నిర్మించారు.. హైటెక్‌ సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు..వారిని గుర్తుకు చేసుకోవాల్సిందేనన్నారు. పెట్టుబడులు పెట్టి సంపాదించింది ఎవరైనా తీసుకెళతారేమోగానీ సమాజానికి ఇచ్చింది ఎవరూ తీసుకెళ్లలేరని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దడమే నా పెద్ద కోరిక అనీ, వందేండ్లు, వెయ్యేండ్లు అయినా చెప్పుకునేలా నగరాన్ని తీర్చిదిద్దుతానని నొక్కి చెప్పారు. హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాల కోసం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. భూమి ఒక సెంటిమెంట్‌ అనీ, ఆ సెంటిమెంట్‌ను ఎంత పాజిటివ్‌గా ముందుకు తీసుకెళ్తారనేదని పైనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆధారపడి ఉంటుందని క్రెడారు ప్రతినిధులకు సూచించారు.

గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌ : ఎన్‌.జయదీప్‌రెడ్డి
హైదరాబాద్‌ మహానగరం గ్లోబల్‌ సిటిగా వేగంగా ఎదుగుతున్నదని క్రెడారు హైదరాబాద్‌ అధ్యక్షులు ఎన్‌.జయదీప్‌రెడ్డి చెప్పారు. ”ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో 18 నెలల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. కీలక ఎంట్రీ పాయింట్ల అభివృద్ధి, రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు, క్రీడా విధానం రూపకల్పన, మౌలిక వసతుల విస్తరణ వంటి చర్యలు నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయి” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

రూ.లక్ష కోట్ల విలువైన గృహాల విక్రయాలు : బి.జగన్నాథ్‌రావు
”హైదరాబాద్‌ ఐటీ, మాన్యుఫాక్చరింగ్‌, ఫార్మా, ఈవీ, డిఫెన్స్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024లో లక్ష కోట్ల రూపాయల విలువైన గృహ విక్రయాలు జరిగాయి. వాణిజ్య రంగంలో అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌, గూగుల్‌ రెండో అతిపెద్ద క్యాంపస్‌ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలోనే వేగంగా 100 మిలియన్‌ చదరపు అడుగుల గ్రేడ్‌-ఏ కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ కలిగిన నగరంగా హైదరాబాద్‌ నిలిచింది” అని క్రెడారు హైదరాబాద్‌ అధ్యక్షులు- ఎలక్ట్‌ బి.జగన్నాథ్‌రావు తెలిపారు.

3 రోజుల పాటు ప్రాపర్టీ షో
క్రెడారు ప్రాపర్టీ షో ఆగస్టు 15, 16, 17 తేదిల్లో మూడు రోజుల పాటు కొనసాగనున్నది. ఈ ప్రదర్శనలో నగరవ్యాప్తంగా ఉన్న 70కి పైగా డెవలపర్లు తమ 300కు పైగా రెరా ఆమోదిత ప్రాజెక్టులను, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్సులు, విల్లాలు, ప్లాట్లు, కమర్షియల్‌ స్పేసులను ఒకే వేదికపై ప్రదర్శించారు. అగ్రశ్రేణి బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు, సంబంధిత రంగాల ప్రతినిధులు తమ సేవలను, ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. ఎంపిక మీది (ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్‌) అనే థీమ్‌ గృహ కొనుగోలు దారులను ఆకర్షిస్తోంది.

హైడ్రా జలవనరులను రక్షించే విప్లవాత్మక పథకం : కె.క్రాంతికిరణ్‌రెడ్డి
”మన జల వనరులు ఆందోళనకరంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రా కార్యక్రమం భవిష్యత్‌ తరాల కోసం నీటిని సంరక్షించే విప్లవాత్మక పథకం. అలాగే ఈగల్‌ కార్యక్రమం మాదక ద్రవ్యాల నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తోంది. స్థిరమైన అభివృద్ధి కోసం నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, పర్యావరణహిత పద్ధతులు ప్రతి ప్రాజెక్టులో అమలు చేస్తామని హామీ ఇస్తున్నాం” అని క్రెడారు హైదరాబాద్‌ అధ్యక్షులు కె.క్రాంతికిరణ్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో క్రెడారు కన్వీనర్‌ కుర్రా శ్రీనాథ్‌, కో-కన్వీనర్‌ అరవింద్‌రావు మెచినేని, క్రెడారు జాతీ అధ్యక్షులు-ఎలక్ట్‌ జి.రాంరెడ్డి, క్రెడారు తెలంగాణ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షులు మనోజ్‌ కుమార్‌ అగర్వాల్‌, కె. అనిల్‌ రెడ్డి, వై.రవిప్రసాద్‌, ఖజాంచీ నితీష్‌ రెడ్డి గూడూర్‌, సంయుక్త కార్యదర్శులు సంజరు కుమార్‌ బన్సాల్‌, శ్రీరామ్‌ ముసునూరు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad