Wednesday, October 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమావోయిస్టు కీలక నేతలు చంద్రన్న, బండిప్రకాశ్‌ సరెండర్‌

మావోయిస్టు కీలక నేతలు చంద్రన్న, బండిప్రకాశ్‌ సరెండర్‌

- Advertisement -

డీజీపీ ఎదుట లొంగుబాటు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్‌ అలియాస్‌ శంకరన్న అలియాస్‌ ప్రభాత్‌ మంగళవారం రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏండ్లుగా మావోయిస్టు పార్టీలో కొత్తగా ఎవరూ చేరలేదని అన్నారు. ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పెరిగిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు, యువత ఆలోచనా విధానంలో వచ్చిన మార్పులు వెరసి ఈ పార్టీలో రిక్రూట్‌మెంట్‌ తగ్గడానికి కారణమైందని తెలిపారు. మావోయిస్టు పార్టీలో ఉన్న వారు వెంటనే జనజీవన స్రవంతిలో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. సాయుధ పోరాటాన్ని వీడి జన జీవన స్రవంతిలోకి వచ్చిన వచ్చే మావోయిస్టు నేతలకు పూర్తి రక్షణ కల్పిస్తామని డీజీపీ భరోసా కల్పించారు.

కాగా, మావోయిస్టు పార్టీలో 40 ఏండ్లకుపైగా వివిధ స్థాయిల్లో చంద్రన్న పనిచేశారని తెలిపారు. 1980లో పుల్లూరి ప్రసాదరావు కిషన్‌జీకి అనుచరుడిగా పనిచేశారని, 1981లో పీపుల్స్‌వార్‌లో చేరారని వెల్లడించారు. అంచెలంచెలుగా ఎదిగి 1983లో కమాండర్‌ స్థాయికి వెళ్లి 1992లో ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శిగా పనిచేశారని, 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడయ్యారని తెలిపారు. దాదాపు 17 ఏండ్ల పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారనీ, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన పిలుపుతో బండి ప్రకాశ్‌తో పాటు పుల్లూరి ప్రసాదరావు లొంగిపోయారని స్పష్టం చేశారు.

ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, దీర్ఘకాలిక మోకాళ్ల వ్యాధి, భద్రతా దళాల నిరంతర ఒత్తిడి అలాగే సీపీఐ(మావోయిస్టు)లో ఏర్పడిన సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలు, అంతర్గత విభేదాలు వంటి కారణాలతో చంద్రన్న, ప్రకాశ్‌లు పార్టీతో తమ సంబంధాలను తెంచుకొని తెలంగాణ ప్రభుత్వ సహాయంతో జన జీవన స్రవంతిలో తిరిగి చేరాలని నిర్ణయించుకున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాశ్‌.. 1984 అక్టోబర్‌లో సీపీఐ నాయకుడు వి.టి అబ్రహం హత్యకు పాల్పడి 1988లో ఆదిలాబాద్‌ జైలు నుంచి పారిపోయాడనీ, 1999లో మావోయిస్టు ఉద్యమంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని డీజీపీ తెలిపారు. అబ్రహం హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష విధించగా 1992లో మల్కాజ్‌గిరిలో ప్రకాశ్‌ను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

2004 ఆగస్టులో క్షమాభిక్షపై ఇతను విడుదలయ్యాడు.2005లో ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చలు విఫలం కావడంతో ప్రకాశ్‌ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.2015 నుంచి ఇప్పటి వరకు ఇతను సింగరేణి కోల్‌ బెల్ట్‌ కమిటీ ఇన్‌చార్జితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిగా ప్రెస్‌ టీమ్‌ ఇన్‌చార్జిగా కొనసాగుతూ మావోయిస్టు పత్రికా ప్రకటనలను ప్రభాత్‌ పేరుతో విడుదల చేస్తున్నాడని డీజీపీ వివరించారు. పుల్లూరు ప్రసాద్‌రావు మీద ప్రకటించిన రూ.25 లక్షల నగదు, బండి ప్రకాశ్‌ పేరు మీద ప్రకటించిన రూ.20 లక్షల నగదు బహుమతిని డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో డీజీపీ వారికి అందించారు. వీరిద్దరికి పునరావాస విధానంలో లభించాల్సిన అన్ని ప్రయోజనాలు అందిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.

ఈ ఏడాది లొంగిపోయిన వారి సంఖ్య 427
అజ్ఞాతంలో ఉన్న 427 మంది నేతలు, సభ్యులు ఈ ఏడాది లొంగిపోయిన వారిలో ఉన్నారని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. వీరిలో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ఎనిమిది మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇద్దరు డివిజన్‌ కమిటీ కార్యదర్శులు, ఎనిమిది మంది డివిజన్‌ కమిటీ సభ్యులు, 35 మంది ఏరియా కమిటీ సభ్యులు సాయుధ పోరాటాన్ని వీడి తమ కుటుంబాలతో కలిసి శాంతియుత జీవితం గడపాలని పోలీసుల ముందు లొంగిపోయారని డీజీపీ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 64 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారన్నారు. సమావేశంలో అదనపు డీజీపీ మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజయ్ కుమార్‌, ఎస్‌ఐబీ చీఫ్‌ బి.సుమతిలతో పాటు లొంగిపోయిన మావోయిస్టు నేతలు పుల్లూరి ప్రసాద్‌రావు, బండి ప్రకాశ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -