– ఏడు రోజుల సిట్ కస్టడీకి
– మాజీ ఐజీ ప్రభాకర్‌రావు
– విచారణలో బీఆర్‌ఎస్ చీఫ్ వైపునకు సాగనున్న దర్యాప్తు
– ఏర్పాట్లు చేస్తున్న సిట్ అధికారులు
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు ముందస్తు బెయిల్‌పై ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును సిట్ ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించవచ్చని సుప్రీం ఇచ్చిన ఆదేశాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావు గత మే నెలలో సుప్రీం నుంచి ముందస్తు బెయిల్ పొందారు. ఆనాటి నుంచి ఆయన అరెస్టుకు అనుమతి కోరుతూ సిట్ అధికారులు సుప్రీంలో పిటిషన్‌లు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పు వెలువడింది. శుక్రవారం నుంచి ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అధికారులు జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సిట్ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ఏసీబీ వెంకటగిరి గురువారం ఉన్నతాధికారులతో చర్చించి, విచారణలో ఏయే అధికారి ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మరోపక్క ప్రభాకర్‌రావు విచారణలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆదేశాలిచ్చింది ఎవరనే అంశంపై దర్యాప్తు సాగనున్నట్టు సిట్ తేల్చింది. ఇందుకోసమే ఉద్యోగ విరమణ చేసిన ప్రభాకర్‌రావును ఎస్‌ఐబీ వంటి అత్యంత కీలకమైన విభాగంలో చీఫ్‌గా కొనసాగడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారని సిట్ అనుమానిస్తోంది. అందుకు తగన విధంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు నడిచాయని, దాని వల్ల బీఆర్‌ఎస్ నాయకత్వం రాజకీయ లబ్దిని కూడా పొందిందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి విచారణ సాగనున్న ప్రభాకర్‌రావు విచారణ వైపే రాజకీయ వర్గాల దృష్టి నిలిచింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



