ట్రంప్ సుంకాలపై మోడీ డైలమా
రష్యాతో అమెరికా అధ్యక్షుడి భేటీ తర్వాత మారిన పరిణామాలు
మిత్ర దేశాలతో రాయబారం
సొంత ఎజెండా లేనివైనం
వచ్చే నెలలో ట్రంప్‌తో మోడీ భేటీ?
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన వాణిజ్య సుంకాలపై ఇప్పుడేం చేయాలనే సందిగ్థత ప్రధాని నరేంద్రమోడీకి ఏర్పడింది. ఎంత మిత్రుడైనా… స్నేహం స్నేహమే…వాణిజ్యం వాణిజ్యమే అని ట్రంప్ పక్కా కార్పొరేట్ వ్యాపార సూత్రాన్ని అమల్లోకి తెచ్చి ఆప్త మిత్రుడికి షాక్ ఇచ్చారు. దీన్నుంచి ఎలా బయటపడాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ తర్వాత అంతర్జాతీయంగా అనేక మార్పులు వచ్చాయి. భారత్‌పై మరిన్ని అదనపు సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గుతున్నా రనే ప్రచారం జరుగుతుంది. అసలు అమెరికాతో వ్యాపార సంబంధాలపై భారతదేశ స్వతంత్ర వైఖరి ఏంటనే దానిపై మోడీ సర్కార్‌కు ఇప్పటికీ స్పష్టత లేదు. ట్రంప్ సుంకాల ప్రకటన చేయడానికంటే నెల రోజుల ముందు నుంచే భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నాలుగు దఫాలుగా చర్చలు జరిగాయి. వాటి ద్వారా సాధించింది ఏమీ లేదు. సుంకాల ప్రకటన తర్వాత భారతదేశంతో ఇక చర్చలు లేవని స్వయంగా ట్రంప్ ప్రకటించి, ద్వైపాక్షిక మార్గాల్ని మూసేశారు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వచ్చే నెల న్యూయార్క్‌లో జరుగుతోంది. దానికి హాజరవుతున్న ప్రధాని మోడీ అక్కడే ట్రంప్‌తో చర్చలు జరపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి ఏ మేరకు సఫలం అవుతాయో వేచిచూడాలి.
వైఫల్యం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భారత్ ఎక్కువ కాలం వాణిజ్య చర్చలు కొనసాగించలేకపోయింది. దేశీయంగా, అంతర్జాతీయంగా వినియోగం, పెట్టుబడులు మందగిస్తున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ నిరంతర అనిశ్చితిని తట్టుకోలేకపోతోంది. ప్రపంచ దేశాలను శిక్షించాలన్న లక్ష్యంతో ఏప్రిల్ ప్రారంభంలో ట్రంప్ వాటిపై సుంకాలు విధించారు. అయితే దాని కంటే ముందే…అంటే మార్చిలోనే మన అధికారులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో చర్చలు ప్రారంభించారు. నాలుగు నెలల కాలంలో ఐదు దఫాలుగా సంప్రదింపులు జరిగాయి. అయినప్పటికీ అమెరికాతో తాత్కాలిక ఒప్పందం కూడా కుదుర్చుకోలేకపోయారు.
సమీపిస్తున్న డెడ్‌లైన్
చివరికి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందనే అక్కసుతో ట్రంప్ మన దేశ వస్తువులపై మొత్తంగా యాభై శాతం సుంకాలు విధించారు. దీంతో ట్రంప్ ఆగ్రహాన్ని చల్లార్చి ఆయనను శాంతింపజేసే సత్తా ఉన్న సంధానకర్తల కోసం ఇప్పుడు మోడీ ప్రభుత్వం అన్వేషిస్తోంది. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరుగుతుంది. దానికి ప్రధాని మోడీ హాజరవుతారు. ఆ సమయంలో ఆయన ట్రంప్‌తో చర్చించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. భారత్‌పై ప్రతీకార సుంకాలు విధించిన తర్వాత అపరిష్కృత వాణిజ్య సమస్యల పరిష్కారానికి ట్రంప్ 21 రోజుల సమయం ఇచ్చారు. ఈనెల 27తో ఆ గడువు కూడా ముగుస్తోంది. భారత్‌లోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రవేశంపై ఇప్పటి వరకు మోడీ సర్కార్ కఠినంగానే ఉంది. కానీ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడం కోసం తెరవెనుక ఒప్పందాలు జరిగితే పరిస్థితి ఏంటనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
వైఖరిని సడలిస్తారా?
గడువు లోగానే భారత్ ఏదో విధంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాస్తవానికి ఇప్పుడు భారత్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి. గతంలో ఐదు దఫాలుగా చర్చలు జరిగినప్పుడు వ్యవసాయం, పాడి రంగాలలో అధిక సబ్సిడీతో కూడిన అమెరికా ఉత్పత్తులను అనుమతించే విషయంలో భారత్ తన వ్యతిరేకతను ప్రదర్శించింది. ఇప్పుడు ఆ వైఖరిని సడలించుకొని అమెరికా ఉత్పత్తులను మన మార్కెట్లలోకి అనుమతించడం ద్వారా ట్రంప్ ఆగ్రహాన్ని చల్లార్చవచ్చు. కానీ, లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న వ్యవసాయం, డెయిరీ రంగాలలోకి అమెరికా ఉత్పత్తులను అనుమతిస్తే అది ఆ రంగాలకు మరణశాసనమే అవుతుంది. ఒకవేళ మోడీ అమెరికా డిమాండ్‌కు తలవంచి భారత్ వైఖరిని నీరుకారిస్తే దానికి కారణమేమిటో ఆయన జాతికి పారదర్శకతతో తెలియజేయాల్సి ఉంటుంది. రష్యా నుంచి ఇంధనాన్ని కొనడం నిలిపివేసి, దానిని అమెరికా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆ పనిని కూడా బహిరంగంగానే చేయాల్సి ఉంటుంది. దాచేందుకు ఏమీ ఉండదు.
ఎర్రకోట ప్రసంగంలో…
ఇక మోడీ ముందున్న చివరి ప్రత్యామ్నాయం…గత వైఖరికి గట్టిగా కట్టుబడి ఉండి, దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా సుంకాల కారణంగా అనేక స్వల్పకాలిక ఇబ్బందులు తప్పవనీ, వాటిని అందరం కలసికట్టుగా భరిద్దామని ప్రజలకు నచ్చచెప్పాల్సి ఉంటుంది. ట్రంప్ విధించిన సుంకాలతో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి విధానపరంగా ఇతరత్రా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రైతులను కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా మూల్యం చెల్లించుకోవడానికి కూడా సిద్ధమేనని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై నుంచి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనకు ఎంత వరకు కట్టుబడి ఉంటారో వేచి చూడాలి.
చిన్న వ్యాపారుల సంగతేమిటి?
దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఇప్పటి వరకూ ప్రభుత్వాల అస్తవ్యస్త ఆర్థిక విధానాల కారణంగా ఎంతో మూల్యం చెల్లించారు. ట్రంప్ సుంకాలు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. దేశ ప్రజలు…అంటే కార్మికులు, వ్యాపారులు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు తమ అంచనాలను సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధపడాల్సి ఉంటుంది. మోడీ, ట్రంప్ ఆడుతున్న దాగుడుమూతల ఆట కోసం దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో కాలం వేచి చూడబోదు. ప్రస్తుత సుంకాల కారణంగా భారత్ తన జీడీపీలో 0.5 నుంచి ఒక శాతం పాయింట్లు కోల్పోయే అవకాశం ఉన్నదని అనేక స్వతంత్ర ఆర్థిక పరిశోధనా సంస్థలు అంచనా వేశాయి. అమెరికాకు మన దేశం నుంచి వస్త్రాలు, దుస్తులు, రత్నాలు-ఆభరణాలు, విలువైన రాళ్లు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. వీటిపై సుంకాల ప్రభావం అధికంగా ఉండబోతోంది. దీనివల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. సుంకాలు పెరిగితే లాభాలు పడిపోతాయి. టాటాలు, అంబానీలు, అదానీల వంటి బడా కార్పొరేట్ గ్రూపులు లాభాలు తక్కువ వచ్చినా, కొంత నష్టాలు వచ్చినా తట్టుకోగలవు. కానీ చిన్న వ్యాపారుల పరిస్థితి ఏంటీ? ముందుగా మూతపడేవి వారి యూనిట్లే.
తలకిందులైన బడ్జెట్ అంచనాలు
అధిక సుంకాల దెబ్బకు చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూతపడితే వాటిలో పనిచేసే లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి తిరిగి గ్రామాల బాట పట్టే అవకాశం ఉంది. కోవిడ్ కాలంలో కన్పించిన దృశ్యాలు మరోసారి ఆవిష్కృతం కావచ్చు. అందువల్ల కార్మికుల వలసలను నివారించేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రణాళికలు, విధానాలు రూపొందించుకోవాలి. 7 శాతం జీడీపీ వృద్ధిని తిరిగి పొందేందుకు దేశం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ పరిణామాలన్నీ చోటుచేసుకుంటున్నాయి. ఏప్రిల్‌లో ట్రంప్ విధించిన సుంకాలు కేంద్ర బడ్జెట్‌లోని సానుకూల అంశాలన్నింటినీ పూర్తిగా కనుమరుగు చేశాయి. బ్యాంక్ రుణాల వృద్ధి మందగించింది. అంటే పెట్టుబడి డిమాండ్ బలహీనపడుతోందని అర్థం. పట్టణ వినియోగ డిమాండ్ కూడా సవాళ్లను ఎదుర్కొంటోంది. యూపీఐ చెల్లింపుల డేటా కలవరపెడుతోంది. సగటు మధ్యతరగతి ప్రజల వేతనాలు, జీతాలలో ఎదుగుదల లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
కిం…కర్తవ్యం?
- Advertisement -
- Advertisement -