నానిగాడు సీరియస్‌గా హోం వర్క్ చేసుకుంటున్నాడు. మధ్య మధ్యలో అటూ ఇటూ చూస్తున్నాడు.
”ఏంట్రా అటూ, ఇటూ చూస్తున్నావ్? ముందు హోం వర్క్ కంప్లీట్ చెయ్యి!” అంటూ గదమాయించింది లక్ష్మి కొడుకును.
నానిగాడు మొహం ముడుచుకుని హోం వర్కులో తలదూర్చాడు. కాసేపటికి శేఖర్ వచ్చాడు. తండ్రిని ఏదో అడగబోయి తల్లి తిడుతుందని భయపడి హోంవర్క్ పూర్తిచేశాడు. ఈలోగా శేఖర్ ఫ్రెష్ అయివచ్చి సోఫాలో కూర్చున్నాడు. వెంటనే వెళ్లి తండ్రి మీద పడిపోయాడు నానిగాడు.
”డాడీ నీవెప్పుడు వస్తావు అని ఎదురుచూస్తున్నాను?” అన్నాడు నాని.
”ఎందుకు నాన్నా?” అడిగాడు శేఖర్.
”నాకు ఓ డౌటు వచ్చింది, అది అడుగుదామని?” అన్నాడు నాని.
”మీ అమ్మని అడగొచ్చు కదా!” అన్నాడు శేఖర్.
”మమ్మీ పేద్ద లెక్చర్ ఇస్తుంది! నీవైతే షార్ప్‌గా చెబుతావు!” అన్నాడు తల్లి వంక కొరకొరా చూస్తూ.
”సరే! నేనొచ్చానుగా అడుగు!” అన్నాడు శేఖర్ ధీమాగా లక్ష్మి వంక వేళాకోళంగా చూస్తూ.
”కింగ్ అంటే ఎవరు డాడీ!” అన్నాడు నానిగాడు.
”ఓస్! ఇంతేనా.. ఇది చాలా చిన్నప్రశ్న! దీనికి జవాబు చెప్పటానికి మీ అమ్మ సరిపోతుంది! అయినా అడిగావు కాబట్టి నేనే చెబుతాను! కింగ్ అంటే రాజు!” అన్నాడు శేఖర్.
”కింగ్ అంటే రాజు అని నాకు తెలుసు డాడీ! కాని కింగ్ అంటే ఏమిటి? అడిగాడు నాని.
శేఖర్ తికమకపడ్డాడు. నానిగాడు అడుగుతున్నదేమిటో అర్థం కాలేదు! శేఖర్ అవస్త చూసి లక్ష్మి కిసుక్కున నవ్వింది!
”నవ్వటం కాదు! చేతనైతే వాడి ప్రశ్నకు సమాధానం చెప్పు!” రోషంగా అన్నాడు శేఖర్.
”రాజు అంటే సర్వాధికారాలు గలిగినవాడు! సర్వాధికారం అంటే తాను ఏది అనుకుంటే అది చేయగలిగే అధికారం అన్నమాట. రాజు ఏమి చేసినా అడ్డు చెప్పే అవకాశం ఎవ్వరికీ లేదు! ఎవరైనా అడ్డుచెప్పినా వారిని శిక్షించే అధికారం కూడా రాజుకు ఉంటుంది! ప్రజల వద్ద ఇష్టం వచ్చినట్టు పన్నులు వసూలు చేయవచ్చు! పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తన విలాపాలకు వాడుకోవచ్చు.
అది తప్పు అన్న వారిని జైల్లో వేయవచ్చు!” అన్నది లక్ష్మి.
నానిగాడు తల్లి వివరణకు చప్పట్లు కొట్టాడు.
”ఇంతకూ ఈ కింగ్ ఎక్కడ తగిలాడ్రా నీకు?” ఉడుక్కుంటూ అన్నాడు శేఖర్.
”ఇందాక హోంవర్క్ చేస్తుంటే వచ్చింది! అంతేకాదు టీవీలో కూడా అమెరికాలో ”నో కింగ్” అంటూ స్లోగన్స్ ఇస్తూ బోలెడు జనం కనబడ్డారు!కింగ్ అంటే నాగార్జున అనే అనుకున్నాను. కాని ఇదంతా చూసి నాకు డౌటొచ్చింది!” అన్నాడు నానిగాడు.
”అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చాడు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ అందరిపై పన్నులు వేయటానికి అతనేమీ రాజు కాదని చెప్పటానికి అమెరికా ప్రజలు అట్లా చేశారు!” అన్నాడు శేఖర్.
”ఓహో అలాగా! మరి ఇండియాలో కూడా అలాంటి కింగ్ ఉన్నాడా డాడీ?” అడిగాడు నానిగాడు కుతూహలంగా.
”ఎందుకు లేడు.. గతంలో నెహ్రూ అని ఉండేవాడు. అతనే కింగ్‌లా వ్యవహరించి ఈ దేశాన్ని నాశనం చేశాడు!” అన్నాడు శేఖర్ ఠపీమని.
లక్ష్మి మళ్లీ నవ్వింది!
”ఎందుకు నవ్వుతావు? నెహ్రూ కింగ్‌లాగా వ్యవహరించలేదా?” అని కోపంగా అడిగాడు శేఖర్.
”నెహ్రూ గొప్ప ప్రజాస్వామ్యవాది! నెహ్రూ కుటుంబం సంపన్నమైనదే కాని, రాచరిక పోకడలు ఎన్నడూ ఆయనకు లేవు. అపారమైన ప్రజాభిమానం ఉన్నందున, ఆయన్ను ఎవరూ విమర్శించలేదు. అందువల్ల మారు పేరుతో వ్యాసాలు రాస్తూ తన ప్రభుత్వంపై తానే స్వయంగా విమర్శలు చేసేవాడు. తనపై కార్టూన్స్ వేయమమని కార్టూనిస్టులను ప్రోత్సహించేవాడు. తాను ఎంతబిజీగా ఉన్నా సరే పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటప్పుడు తప్పక ఉండి, నోట్సు రాసుకునేవాడు! తనను విమర్శించిన వారిని స్వయంగా భుజం తట్టి అభినందించేవాడు. తరచూ పత్రికా విలేకర్ల సమావేశాలు పెట్టి విమర్శలను, ఆహ్వానించేవాడు! ఇలాంటిది ఇప్పుడు జరుగుతుందా?” అడిగింది లక్ష్మి.
”అంటే ఏమిటి? మోడీజీ ప్రెస్‌మీట్లు పెట్టి విలేకర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం లేదనేగా! మోడీజీ కాదణజన్ముడు! అడ్డమైన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన ఖర్మ ఆయనకు లేదు!” అన్నాడు శేఖర్ ఆరమోడ్పు కన్నులతో.
”ఒకటి” అన్నాడు నానిగాడు.
”అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరితో సంప్రదించకపోవటం మోడీజీకి అలవాటు! గతంలో పెద్దనోట్లు రద్దు చేసినపుడు, జీఎస్టీ వెర్షన్ 1.00లో ఐదు స్లాబులు నిర్ణయించడం, ఇది అన్యాయమని ఎవరెంత చెప్పినా వినలేదు. అంతేకాదు ఎన్నికల కమిషనర్‌ను నియమించే కమిటీలో నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, కేంద్రమంత్రిని చేర్చటం కూడా ఏకపక్షం చేశారు! ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం!” అన్నది లక్ష్మి.
”మోడీజీ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఏదో పరమార్థం ఉంటుంది! దాని ఫలితాలు సుదీర్ఘకాలంలో కనబడతాయి! అందుకే ఆయన నిర్ణయాలు తీసుకునే ముందు ఎవర్ని సంప్రనదించవలసిన అవసరం లేదు!” అన్నాడు శేఖర్ గంభీరంగా.
”రెండు!”అన్నాడు నానిగాడు.
”చిన్నపిల్లల నుండి ముసలి ఆడవాళ్లను కూడా రేప్ చేసిన వారికి బెయిల్, పెరోల్ వస్తున్నాయి. కాని ఏ నేరమూ చేయని వారిని మాత్రం సంవత్సరాల తరబడి జైల్లో పెడుతున్నారు! మోడీజీ విధానాలను ప్రశ్నించడం మినహా వారు ఏ నేరమూ చేయలేదు కదా!” అన్నది లక్ష్మి.
మోడీజీని ప్రశ్నించటం కన్నా ఘోరమైన నేరమేమి ఉంటుంది? ఈ దేశాన్ని అభివృద్ధి చేయటానికి భగవంతుడు ఆయన్ను పంపిన విషయం నీకు తెలియకపోవచ్చు! అందుకే మోడీజీ నిందార్హుడు కాదు! మోడీజీ నిందించిన వారు శిక్షార్హులు! అందుకే వారు జైల్లోనే ఉండాలి!” అన్నాడు శేఖర్.
”మూడు!” అన్నాడు నానిగాడు.
జీఎస్టీ, సెస్సులు, టోల్‌ప్లాజా పన్నులు, ఆదాయపన్నులు, బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బులు, ప్రజల నిధులతో, కార్మికుల కష్టంతో అభివృద్ధి చేసుకున్న ప్రభుత్వరంగ సంస్థలు అన్ని ఆదానీలకు, అంబానీలకు పంచి పెడుతున్నారు! వారికి బ్యాంకులు ఇచ్చిన అప్పులు రద్దు చేస్తున్నారు? ఇలా చేయటానికి మోడీకి ఏం అధికారం ఉంది?” అన్నది లక్ష్మి.
మోడీజీని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు! ఆయన ఏం చేసినా అడిగే హక్కు ఎవరికీ లేదు!” అన్నాడు.
”నాలుగు!” అన్నాడు నానిగాడు.
”ఏమిట్రా లెక్కపెడుతున్నావ్!” అడిగాడు శేఖర్.
”రాజుకు ఉండే లక్షణాలు లెక్కపెడుతున్నాను! నాలుగూ మోడీజీకి ఉన్నాయి! అమెరికాకు ట్రంప్ రాజులాగా ఉన్నట్లే ఇండియాకు మోడీజీ కింగ్‌లా వ్యవహరిస్తున్నాడు! అందుకే మన ఇండియాలో కూడా తొందర్లోనే ‘నో కింగ్’ ప్రోగ్రాం వస్తుందన్న మాట! ఆ ప్రోగ్రాం వస్తే మా స్కూలు కూడా బంద్ చేస్తాం!” అంటూ నానిగాడు బయటకు పరిగెత్తాడు.
- ఉషాకిరణ్


