యుఎస్ ఓపెన్ విజేతగా అల్కరాస్
ఫైనల్లో జానిక్ సినర్ పరాజయం
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2025
టైటిల్‌తో పాటు వరల్డ్ నం.1 ర్యాంక్ సొంతం
చాంపియన్‌గా నిలవాలంటే.. చాంపియన్లను ఓడించాల్సిందే. స్పెయిన్ కుర్రాడు, 22 ఏండ్ల కార్లోస్ అల్కరాస్ అదే చేశాడు. వరల్డ్ నం.1, ఇటలీ స్టార్ జానిక్ సినర్ (24)ను ఓడించి యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పాటు ప్రపంచ నం.1 ర్యాంక్‌ను సైతం ఎగరేసుకుపోయాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సినర్‌పై గెలుపొందిన అల్కరాస్ కెరీర్ ఆరో గ్రాండ్‌స్లామ్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
నవతెలంగాణ-న్యూయార్క్
యుఎస్ ఓపెన్‌లో యంగ్ స్పెయిన్ బుల్ కార్లోస్ అల్కరాస్ డబుల్ ధమాకాతో దంచికొట్టాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జానిక్ సినర్ (ఇటలీ)పై 6-2, 3-6, 6-1, 6-4తో మెరుపు విజయం సాధించిన అల్కరాస్.. యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పాటు ప్రపంచ నం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. జానిక్ సినర్, కార్లోస్ అల్కరాస్ ఇటీవల పోటీపడిన ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఫైనల్స్ తరహాలో న్యూయార్క్‌లో అంతిమ సమరం ఐదు సెట్లు సాగలేదు. అయినా, ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లు అభిమానులకు మరిచిపోలేని క్రీడానుభూతిని మిగిల్చారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఫైనల్లో కార్లోస్ అల్కరాస్ మెరుగైన ప్రదర్శన చేశాడు. హార్డ్ కోర్టుపై ఎదురులేని ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ జానిక్ సినర్ టైటిల్ నిలుపుకోవటంలో విఫలమయ్యాడు. కార్లోస్ అల్కరాస్ చాకచక్యంతో కూడిన షాట్లు, తికమక పెట్టే హ్యాండ్ కదలికలు సినర్‌ను బలంగా దెబ్బతీశాయి. 36 నెలలుగా వరల్డ్ నం.1గా కొనసాగుతున్న సినర్.. యుఎస్ ఓపెన్ టైటిల్‌తో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అల్కరాస్‌కు కోల్పోయాడు.
అల్కరాస్ అదరహో
భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి తర్వాత ఆరంభమైన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో కార్లోస్ అల్కరాస్ అద్భుతంగా రాణించాడు. టైటిల్ వేట మొదలైన తొలి నాలుగు నిమిషాల్లోనే సినర్‌కు చుక్కలు చూపించాడు. తొలి సెట్లో తొలుత సర్వ్ చేసిన సినర్ బ్యాక్‌హ్యాండ్, అనవసర తప్పిదాలతో అల్కరాస్‌కు బ్రేక్ పాయింట్ కోల్పోయాడు. సినర్ తొలి సర్వ్‌ను బ్రేక్ చేసి, స్వీయ సర్వ్ నిలుపుకున్న అల్కరాస్ 2-0, 3-1తో ముందంజ వేశాడు. 2-5తో వెనుకంజ వేసిన సినర్.. మరోసారి సర్వ్‌ను చేజార్చుకున్నాడు. దీంతో 6-2తో అల్కరాస్ 32 నిమిషాల్లోనే అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో జానిక్ సినర్ బలంగా పుంజుకున్నాడు. అల్కరాస్ సర్వ్‌ను బ్రేక్ చేసిన సినర్ 4-1తో ముందంజ వేశాడు. అదే జోరులో 6-3తో రెండో సెట్‌ను గెల్చుకున్నాడు. కానీ ఇక్కడ్నుంచి మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్న అల్కరాస్.. అద్భుతమే చేశాడు. సినర్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయాడు. రెండు సార్లు సినర్ సర్వ్‌ను బ్రేక్ చేసిన అల్కరాస్ 6-1తో ఏకపక్షంగా మూడో సెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన నాల్గో సెట్లో సైతం సినర్ కీలక దశలో సర్వ్‌ను కోల్పోయాడు. దీంతో 6-4తో నాల్గో సెట్‌తో పాటు టైటిల్ సైతం అల్కరాస్ వశమైంది.
రెండేండ్లుగా చెరో రెండు!
ప్రపంచ టెన్నిస్‌లో ఫెదరర్, నాదల్, జకోవిచ్ త్రయం తర్వాత.. ఆ స్థాయిలో జానిక్ సినర్, కార్లోస్ అల్కరాస్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అద్భుత ఆటతీరు, బలమైన సర్వ్‌లు, కండ్లుచెదిరే ఫోర్‌హ్యాండ్-బ్యాక్‌హ్యాండ్ షాట్లకు తోడు ప్రత్యరికి తగినట్టుగా గేమ్ ప్రణాళికలు మార్చుకోగల సత్తా సినర్, అల్కరాస్ సొంతం. 2024, 2025 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల ఫలితాలు ఈ ఇద్దరి సత్తా, ఆధిపత్యానికి నిదర్శనం. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్‌ను సినర్ సాధించగా.. ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ అల్కరాస్ ఖాతాలో వేసుకున్నాడు. 2024లో యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సినర్ విజేతగా నిలువగా..ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో అల్కరాస్ చాంపియన్‌గా నిలిచాడు. గత ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లు సినర్, అల్కరాస్ కాకుండా మరో చాంపియన్‌ను చూడలేదు. ఆల్‌టైమ్ రికార్డు 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో అసమాన పోరాట పటిమి చూపిస్తున్న నొవాక్ జకోవిచ్.. సినర్, అల్కరాస్ ముందు తేలిపోతున్నాడు. సినర్ వయసు 24, అల్కరాస్ వయసు 22. దీంతో ప్రపంచ టెన్నిస్‌లో ఈ ఇద్దరి ఆధిపత్యం, ముఖాముఖి సవాల్‌ను ఇక ముందే ఎక్కువగా చూడబోతుందని చెప్పవచ్చు.
రూ.44కోట్లు
యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా కార్లోస్ అల్కరాస్ దక్కించుకున్న ప్రైజ్‌మనీ.
రూ.22 కోట్లు
యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ రన్నరప్‌గా జానిక్ సినర్ అందుకున్న నగదు బహుమతి
6
నయా వరల్డ్ నం.1 కార్లోస్ అల్కరాస్ సాధించిన కెరీర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఆరు. హార్డ్, పచ్చిక, మట్టి కోర్టుపై మల్టీపుల్ టైటిల్స్ నెగ్గిన జకోవిచ్, నాదల్, విలాండర్ సరసన అల్కరాస్ చేరాడు. అల్కరాస్ హార్డ్, పచ్చి, మట్టి కోర్టుపై రెండేసి టైటిల్స్ సాధించాడు.
ట్రంప్‌కు ఫ్యాన్స్ సెగ
యుఎస్‌ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌కు హాజరయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ రాకతో స్టేడియంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ప్రెసిడెంట్ రాకతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తనిఖీల పేరిట ఒకే గేట్ నుంచి ఎంట్రీ ఇవ్వటంతో మ్యాచ్ మొదలైన అభిమానులు క్యూ లైన్‌లోనే బారులు తీరారు. భద్రతా ఏర్పాట్లు, అభిమానులు స్టేడియంలోకి రావటం ఆలస్యం కారణంగా సినర్, అల్కరాస్ ఫైనల్ మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా ఆరంభమైంది. వీవీఐపీ గ్యాలరీలో కూర్చున్న ట్రంప్ పట్ల ఎక్కువ మంది అభిమానులు వ్యతిరేక స్పందనతో కనిపించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా స్పందించిన అభిమానుల దృశ్యాలను టెలివిజన్‌లో ప్రసారం చేయవద్దని యుఎస్ ఓపెన్ నిర్వాహకులు ప్రసారదారుకు సూచించారు. యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ టికెట్‌కు రూ.50-90 వేలు వెచ్చించి.. ఆట ఆరంభమైనా క్యూలైన్‌లో నిల్చోవాల్సిన రావటం ఏమిటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ను అభిమానులు గేలి చేస్తున్న వీడియోలను.. కేరింతలు కొడుతున్నారంటూ నిర్వాహకులు సోషల్ మీడియాలో పంచుకోవటంపై ట్రోల్స్ వస్తున్నాయి.