ఐదో టెస్టులో భారత్ అద్భుత విజయం
ఐదు వికెట్లతో చెలరేగిన మహ్మద్ సిరాజ్
‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీ 2-2తో సమం
35 పరుగులు, 4 వికెట్లు.. ది ఓవల్ టెస్టు ఆఖరు ఆద్యంతం ఉత్కంఠ రేపింది. ఇంగ్లాండ్ బౌండరీలతో తొలి పంచ్ సంధించినా.. భారత్ గొప్పగా పుంజుకుంది. అభిమానులతో కిక్కిరిసిన ది ఓవల్‌లో ఆఖరు రోజు ఆటలో 53 బంతుల్లో ఇంగ్లాండ్ 28 పరుగులే చేయగా.. భారత్ చివరి నాలుగు వికెట్లు పడగొట్టింది. 374 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ 367 పరుగులకు కుప్పకూంది. 6 పరుగుల తేడాతో భారత్ ఐదో టెస్టులో అద్భుత విజయం అందుకుంది. టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీని 2-2తో సమం చేసింది.
హైదరాబాద్ మియాభాయ్ మహ్మద్ సిరాజ్ (5/104) ఐదు వికెట్ల ప్రదర్శనతో విరుచుకుపడ్డాడు. ఇంగ్లాండ్ ఆఖరు నాలుగు వికెట్లలో మూడు పడగొట్టిన సిరాజ్ టీమ్ ఇండియాను గెలుపు పథాన నడిపించాడు.
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలికారు. టెస్టు జట్టుకు కొత్త సారథిగా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో అనుభవం కలిగిన ఆటగాళ్లు కొందరే. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ బజ్‌బాల్ ధాటికి ఎదురొడ్డి నిలువటం భారత్‌కు కఠిన సవాల్ అనుకున్నారు. కానీ యువసేన అదరగొట్టింది. ఇంగ్లాండ్ గడ్డపై కఠిన సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఆతిథ్య జట్టు కంటే మెరుగైన ప్రదర్శనే చేసింది. కెప్టెన్‌గా తొలి సిరీస్‌ను డ్రా చేసుకున్న శుభ్‌మన్ గిల్.. భారత టెస్టు క్రికెట్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చగల నమ్మకాన్ని కల్పించాడు.
నవతెలంగాణ-లండన్
25 రోజులు, 5 టెస్టులు.. ప్రతి సెషన్, ప్రతి రోజు, ప్రతి టెస్టులో ఆధిపత్యం కోసం అత్యుత్తమ ప్రదర్శనతో పోటీపడిన ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీ హైడ్రామా, హైటెన్షన్ నడుమ గొప్పగా ముగిసింది. ఐదో టెస్టులో విజయం ఇరు జట్లను ఊరించగా భారత బౌలర్లు అద్భుతం చేశారు. 374 పరుగుల రికార్డు ఛేదనలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 85.1 ఓవర్లలో 367 పరుగులే చేసింది. ఆఖరు రోజు ఆటలో ఇంగ్లాండ్‌కు మరో 35 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 28 పరుగులు చేసింది. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్ (5/104), ప్రసిద్ కృష్ణ (4/126) పదునైన పేస్‌తో ఇంగ్లాండ్ టెయిలెండర్ల కథ ముగించారు. మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్ ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఐదో టెస్టులో ఓవరాల్‌గా 9 వికెట్లు ఖాతాలో వేసుకున్న సిరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సిరీస్‌లో పరుగుల వరద పారించిన శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్‌లు సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు. భారత్, ఇంగ్లాండ్ కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, బెన్ స్టోక్స్ సిరీస్ విజేతగా నిలిచే కెప్టెన్‌కు అందించే దిగ్గజ క్రికెటర్ ‘పటౌడీ’ మెడల్ పంచుకున్నారు.
53 బంతుల్లో ముగించారు
ది ఓవల్‌లో ఐదో రోజు ఆట ముంగిట ఇరు జట్లు కాస్త ఒత్తిడిలోనే పడ్డాయి. ఉదయం నుంచి తుంపర్ల వర్షం పడుతుండగా.. క్యూరేటర్ ఫోర్టీస్ భారీ రోలర్‌తో పిచ్‌ను రోలింగ్ చేశాడు. శీతల పరిస్థితుల్లో గ్రౌండ్‌లోకి వచ్చిన భారత్‌కు ఇంగ్లాండ్ తొలి ఓవర్లోనే బజ్‌బాల్ జోరు చూపించింది. జెమీ ఓవర్టన్ (9, 17 బంతుల్లో 2 సిక్స్‌లు) ప్రమాదకరంగా కనిపించాడు. విధ్వంసక బ్యాటర్ జెమీ స్మిత్ (2) క్రీజులో ఉండటంతో ఇంగ్లాండ్ విజయంపై దీమాగా కనిపించింది. కానీ ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగైనా జోడించకుండానే భారత్ అతడిని సాగనంపింది. సిరాజ్ ఓవర్లో స్మిత్ క్యాచౌట్‌గా నిష్క్రమించగా ఇంగ్లాండ్ తీవ్ర ఒత్తిడిలో పడింది. గస్ అట్కిన్సన్ (17, 29 బంతుల్లో 1 సిక్స్) ఆఖరు వికెట్‌కు పది పరుగులు జోడించి ఉత్కంఠను రెట్టింపు చేసినా.. సిరాజ్ సూపర్ యార్కర్‌తో ఇంగ్లాండ్ కథ ముగించాడు. ఉదయం సెషన్లో సిరాజ్, ప్రసిద్ కృష్ణ ద్వయం 53 బంతుల్లోనే 4 వికెట్లు పడగొట్టి గొప్ప విజయాన్ని అందించారు.
ఊహించని దెబ్బ!
తొలి టెస్టులో 375 పరుగుల లక్ష్యాన్ని ఊదేసిన ఇంగ్లాండ్.. ది ఓవల్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసేలా కనిపించింది. టాప్ ఆర్డర్‌లో జాక్ క్రాలీ (14), ఒలీ పోప్ (27) విఫలమైనా.. బెన్ డకెట్ (54, 83 బంతుల్లో 6 ఫోర్లు), జో రూట్ (105, 152 బంతుల్లో 12 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (111, 98 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రయం మ్యాచ్ గతిని మలుపు తిప్పారు. రూట్, బ్రూక్ నాల్గో వికెట్‌కు 211 బంతుల్లోనే 195 పరుగులు జోడించగా ఇంగ్లాండ్ విజయం లాంఛనమే అనిపించింది. ఆశలు ఆవిరైతున్న తరుణంలో విజృంభించిన పేసర్లు.. వరుస వికెట్లతో భారత్‌ను రేసులోని తీసుకొచ్చారు. నాల్గో రోజును 339/6తో ముగించిన ఇంగ్లాండ్.. ఆఖరు రోజు సిరాజ్, ప్రసిద్ ఫైర్ స్పెల్‌ను ఊహించలేదు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 224/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 247/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : 396/10
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : జాక్ క్రాలీ (బి) సిరాజ్ 14, బెన్ డకెట్ (సి) రాహుల్ (బి) ప్రసిద్ 54, ఒలీ పోప్ (ఎల్బీ) సిరాజ్ 27, జో రూట్ (సి) జురెల్ (బి) ప్రసిద్ 105, హ్యారీ బ్రూక్ (సి) సిరాజ్ (బి) ఆకాశ్ 111, జాకబ్ బెతెల్ (బి) ప్రసిద్ 5, జేమీ స్మిత్ (సి) జురెల్ (బి) సిరాజ్ 2, జెమీ ఓవర్టన్ (ఎల్బీ) సిరాజ్ 9, గస్ అట్కిన్సన్ (బి) సిరాజ్ 17, జోశ్ టంగ్ (బి) ప్రసిద్ 0, క్రిస్ వోక్స్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 23, మొత్తం : (85.1 ఓవర్లలో ఆలౌట్) 367.
వికెట్ల పతనం : 1-50, 2-82, 3-106, 4-301, 5-332, 6-337, 7-347, 8-354, 9-357, 10-367.
బౌలింగ్ : ఆకాశ్ దీప్ 20-4-85-1, ప్రసిద్ కృష్ణ 27-3-126-4, మహ్మద్ సిరాజ్ 30.1-6-104-5, వాషింగ్టన్ సుందర్ 4-0-19-0, రవీంద్ర జడేజా 4-0-22-0.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
మహ్మద్ సిరాజ్ (4/86, 5/104)
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
శుభ్‌మన్ గిల్ (754 పరుగులు)
హ్యారీ బ్రూక్ (481 పరుగులు)
6
ది ఓవల్ టెస్టులో భారత్ గెలుపు అంతరం 6 పరుగులు. వందేండ్ల టెస్టు క్రికెట్‌లో ఇంత తక్కువ పరుగుల తేడాతో భారత్ గెలుపొందటం ఇదే ప్రథమం. గతంలో ఆసీస్‌పై 13 పరుగులతో నెగ్గిన రికార్డు ఓవల్‌లో మెరుగైంది.
క్షణ క్షణం టెన్షన్ టెన్షన్
ఐదో టెస్టులో విజయానికి ఇంగ్లాండ్ 35 పరుగుల దూరంలో, భారత్ 4 వికెట్ల దూరంలో నిలువగా.. ఆఖరు రోజు ఆట మొదలైంది. ఓ వైపు చిరు జల్లులతో కూడిన వాతావరణం, మరోవైపు పిచ్‌పై క్యూరేటర్ ఫోర్టీస్ హెవీ రోలర్ వర్క్‌తో ఫలితం ఎటు తిరుగుతుందనే ఉత్కంఠ కనిపించింది. ఉదయం ప్రసిద్ కృష్ణ తొలి ఓవర్ సంధించగా.. జెమీ ఓవర్టన్ తొలి రెండు బంతులను బౌండరీలుగా మలిచాడు. దీంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గుచూపుతుందనే భావన వచ్చేసింది. కానీ ఆ తర్వాత వరుసగా మూడు వికెట్లు పడగొట్టిన భారత్ రేసులోకి రావటమే కాదు మ్యాచ్‌పై పట్టు బిగించింది. మరో ఎండ్‌లో క్రిస్ వోక్స్ తోడుగా గస్ అట్కిన్సన్ సిరాజ్ ఓవర్లో భారీ సిక్సర్ బాదటంతో మరోసారి హైడ్రామాకు తెరలేచింది. మరో 7 పరుగులే అవసరమైన దశలో అట్కిన్సన్ బౌండరీలే లక్ష్యంగా బ్యాట్ ఝులిపించినా.. సిరాజ్ ఐదు వికెట్ల షోతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
2-2
తొలి ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీ 2-2తో సమమైంది. సిరీస్‌లో ఫలితం తేలకుంటే.. రూల్స్ ప్రకారం ఇరు జట్ల గత సిరీస్ విజేత ట్రోఫీని అట్టిపెట్టుకుంటుంది. దీంతో ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీ భారత్ దక్కించుకుంది.
25
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ 25 రోజులు సాగింది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ప్రతి టెస్టులో ఫలితం కోసం ఐదు రోజుల పాటు పోటీపడటం అత్యంత అరుదైన ఘట్టమని చెప్పవచ్చు.
ఆ 4 వికెట్లు పడగొట్టారిలా..
1. జెమీ స్మిత్ : 77.3 ఓవర్లో సిరాజ్ వేసిన లెంగ్త్ వైడ్ బాల్ స్మిత్ బ్యాట్‌ను ముద్దాడుతూ వికెట్ కీపర్ జురెల్ చేతుల్లో పడింది. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 347/7.
2. జెమీ ఓవర్టన్ : 79.5 ఓవర్లో సిరాజ్ సంధించిన బంతిని ఫ్రంట్‌ఫుట్‌తో ఆడేందుకు ప్రయత్నించిన ఓవర్టన్.. వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ధర్మసేన కాసేపు ఆలోచించినా.. ఎల్బీగా ఔటిచ్చాడు. ఇంగ్లాండ్ రివ్యూ కోరినా ఫలితం మారలేదు. అప్పటికి ఆ జట్టు స్కోరు 354/8.
3. జోశ్ టంగ్ : 82.6 ఓవర్లో ప్రసిద్ కృష్ణ బంతి టంగ్ ప్యాడ్లను ముద్దాడుతూ వికెట్లను గిరాటేసింది. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 357/9.
4. గస్ అట్కిన్సన్ : 85.1 ఓవర్లో మహ్మద్ సిరాజ్ యార్కర్‌తో అట్కిన్సన్‌ను ఊరించాడు. అట్కిన్సన్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించినా.. బ్యాట్ కింద నుంచి దూసుకెళ్లిన ఆఫ్ స్టంప్‌ను గాల్లో ఎగరేసింది. 367 పరుగుల వద్ద ఇంగ్లాండ్ కథ ముగిసింది.
పడగొట్టి..సిరీస్ సమం చేసి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES