Sunday, October 19, 2025
E-PAPER
Homeసోపతిజ్ఞానమే పరమాన్నం

జ్ఞానమే పరమాన్నం

- Advertisement -

ప్రతి మనిషిలో ఒక రకమైన ఆకలి ఉంటుంది. కొందరిది శారీరక ఆకలి, మరికొందరిది మానసిక ఆకలి. శారీరక ఆకలిని అన్నం తీరుస్తుంది, కానీ మానసిక ఆకలిని తీర్చేది మాత్రం జ్ఞానం. జ్ఞానం కోసం పరితపించే వాడే నిజమైన సంతోషాన్ని పొందుతాడు. జ్ఞానం విలువ తెలియని వాడు, వెలుగులో నిలబడి కూడా చీకటిలోనే జీవిస్తాడు. ఈ తేడా మనిషి జీవిత దిశను నిర్ణయిస్తుంది.
విద్య – ఉపాధి సాధనం కాదు, జీవన విలువ
మన సమాజంలో విద్యను చాలామంది ఉద్యోగం పొందే సాధనంగా మాత్రమే చూస్తున్నారు.
పరీక్షలు, మార్కులు, ర్యాంకులు – ఇవే విద్యకి గమ్యాలుగా మారిపోయాయి. కానీ అసలు విద్య అంటే ఉద్యోగం కోసం కాదు, జీవితం అర్థం చేసుకోవడం కోసం. విద్య మన ఆలోచనలను, విలువలను, ప్రవర్తనను తీర్చిదిద్దుతుంది. సత్యం తెలుసుకోవడానికి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, మనసును నిర్మలంగా ఉంచుకోవడానికి విద్య అవసరం.
జ్ఞానం ఉన్నచోట వినయం ఉంటుంది, అజ్ఞానం ఉన్నచోట అహంకారం పెరుగుతుంది. జ్ఞానం మనిషిని ఇతరుల పట్ల దయతో, బాధ్యతతో ప్రవర్తించడానికి ప్రేరేపిస్తుంది.
జ్ఞానం – జీవన దిక్సూచి
ప్రాచీన భారతీయ ఆలోచనలో జ్ఞానం అత్యున్నత స్థానం పొందింది. వేదాలు, ఉపనిషత్తులు చెప్పిన సారాంశం ఒక్కటే – విద్య ద్వారానే మనిషి పూర్ణత్వాన్ని పొందగలడు. జ్ఞానం మనిషిని భౌతిక పరిమితుల పైనికి తీసుకువెళ్తుంది. అది తెలివిని పెంచడం కాదు, దష్టిని విస్తరించడం. నిజమైన విద్యావంతుడు ”నాకు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది” అని గ్రహిస్తాడు. ఆ వినయమే జ్ఞానానికి అసలైన రూపం.
జ్ఞానం – సామూహిక సంపద
జ్ఞానం వ్యక్తిగత ఆస్తి మాత్రమే కాదు, అది సామాజిక సంపద. జ్ఞానం ఉన్న సమాజం ముందుకు సాగుతుంది. అజ్ఞానం ఉన్న సమాజం వెనక్కి పడిపోతుంది. జ్ఞానం ఉన్నచోట తర్కం, న్యాయం, సహకారం పెరుగుతాయి. పురాతన భారతదేశంలో గురుకుల వ్యవస్థలో విద్య కేవలం పాఠాలు నేర్పేది కాదు, విలువలను నేర్పేది. జ్ఞానదానాన్ని అత్యున్నత దానంగా పరిగణించారు. అన్నదానం శరీరానికి శక్తినిస్తే, విద్యాదానం మనసుకు వెలుగునిస్తుంది.
సమాచారం కాదు – సత్యాన్వేషణే జ్ఞానం
ఈ డిజిటల్‌ యుగంలో మనం సమాచారం సముద్రంలో తేలుతున్నాం. ఒక క్లిక్‌లో లక్షల వివరాలు లభిస్తున్నాయి. కానీ సమాచారం ఉన్నంత మాత్రాన జ్ఞానం వచ్చినట్లుకాదు. జ్ఞానం అంటే ఆ సమాచారాన్ని విశ్లేషించి సత్యాన్ని గుర్తించగల సామర్థ్యం. సాంకేతికత మనకు సమాధానాలు ఇస్తుంది కానీ ఆ సమాధానాలు సరైనవా కాదా అని తర్కించగల శక్తే నిజమైన జ్ఞానం. ప్రశ్నించడం, తర్కించడం, సత్యాన్ని తెలుసుకోవాలనే తపన – ఇవే జ్ఞానానికి మౌలిక లక్షణాలు.
జ్ఞానం – మనసుకు తప్తి, జీవితానికి వెలుగు
జ్ఞానం మనిషికి అర్థవంతమైన జీవనాన్ని అందిస్తుంది. ఆహారం శరీరాన్ని నిలబెడుతుంది. కానీ జ్ఞానం మనసును నిలబెడుతుంది. ఆహారం తాత్కాలిక తప్తిని ఇస్తుంది. జ్ఞానం శాశ్వత తప్తిని ఇస్తుంది. జ్ఞానం ఉన్నవాడు సమయాన్ని, మనుషులను, పరిసరాలను గౌరవిస్తాడు. అజ్ఞానం ఉన్నవాడు వాటిని నిర్లక్ష్యం చేస్తాడు. జ్ఞానం ఉన్నచోట చీకట్లు తొలగుతాయి, ఆత్మవిశ్వాసం వెలుగుతుంది.
జ్ఞానం మనిషిని మనిషిగా నిలబెడుతుంది. జ్ఞానం ఉన్నచోట వినయం పుడుతుంది, సహకారం పెరుగుతుంది, సత్యానికి ప్రాధాన్యం పెరుగుతుంది.
జ్ఞానం మనిషిని ఇతరుల పట్ల సున్నితంగా, స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా మలుస్తుంది.
మన సమాజం విద్యను ఉద్యోగ మార్గంగా కాకుండా జీవన విలువగా చూడడం నేర్చుకోవాలి.
పాఠశాలలు, కళాశాలలు, గురువులు విద్యార్థుల్లో ఈ భావనను పెంపొందించాలి. ఎందుకంటే చివరికి ఆహారం ఆకలిని తీర్చగలదు, కానీ జ్ఞానం మాత్రమే మనసును తప్తి పరచగలదు. అందుకే జ్ఞానమే పరమాన్నం.

  • డాక్టర్‌ మైలవరం చంద్రశేఖర్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -