నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కోటా శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో భాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు. దాదాపు 50 ఏళ్లుగా ఫిల్మ్ ఇండిస్టీలో కొనసాగిన కోటా 750 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కోట ఎప్పుడూ చెబుతూ ఉండే మాట.. ” నేను చచ్చేదాకా నటించాలి. చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి” అని చెప్పేవారు. పాత్రల విషయంలో ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్నేళ్ల కెరీర్ లో కోటా నటుడిగా మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు ఆయన జీవితంలో ఎన్నో వివాదాలు … విషాదాలున్నాయి..!
ఎలా మర్చిపోతాను ?
2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించాడు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి.. తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు. ఆ బాధ నుంచి బయటపడ్డారా ? అని యాంకర్ అడిగినప్పుడు మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా ? జీవితం.. ఎలా మర్చిపోతాను ? ఓ నిట్టూర్పు విడిచారు. కానీ నటనలో బిజీగా ఉండటం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను అని అనేవారు.
నా భార్య నన్నెవరో గుర్తుపట్టలేదు : కోటా
గతంలో ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ …. ” నాకు 1968లో రుక్మిణితో పెళ్లయింది. 1973లో నా భార్య డెలివరీ అయినప్పుడు ఓ విషాదం జరిగింది. ఆమె తల్లి చనిపోయారు. అప్పుడు నా భార్యకు చిన్నగా షాక్‌లాంటిది వచ్చింది. దాన్ని నేను గమనించలేకపోయాను. తర్వాత తను సైకియాట్రిక్ పేషెంట్‌గా మారిపోయింది. 30 ఏళ్లపాటు నేనెవరో కూడా గుర్తుపట్టలేదు. తను తిట్టినా ఓర్పుగా సహించాను. ఎందుకంటే తను నా భార్య. ఈ విషయం నాకు క్లోజ్‌గా ఉండేవారికి మాత్రమే తెలుసు. ఎవరికీ చెప్పలేదు. ”
ఎంత పేరో… అన్ని కష్టాలు : కోటా
” నా రెండో కూతురు ఎంకాం చదివింది. ఎప్పుడూ రిక్షా ఎక్కలేదు అని విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది. ఎదురుగా బ్రేకులు ఫెయిలైన లారీ వేగంగా వచ్చి ఆ రిక్షాను ఢకొీట్టింది. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా నా కూతురు కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. బ్యాంకులో ఎవరిదగ్గరైతే గుమాస్తాగా పనిచేశానో ఆయనే నాకు వియ్యంకుడయ్యాడు. నా కూతురు జీవితం బాగుపడిందని సంతోషించేలోపే నా కుమారుడు చనిపోయాడు. ఆ భగవంతుడు ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలిచ్చాడు. ఇవన్నీ గుర్తుచేసుకుని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాను ” అని కోట కన్నీరుపెట్టారు.
సినిమా కెరీర్‌లో కష్టాలు..!
ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన కోటా కెరీర్ లో మాయని మచ్చగా నిలిచిన పాత్ర కూడా ఒకటి ఉంది. ఈ పాత్ర కారణంగా ఆయన తన్నులు కూడా తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఇండిస్టీ దేవుడిలా కొలిచే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీసిన సినిమాలో పెద్దయన పాత్ర చేయడం కోటాపై కోపానికి కారణం అయ్యింది. వాస్తవానికి కోటా శ్రీనివాస్ రావు ఈ సినిమాలో నటించారు కాని.. ముందుగా తన పాత్ర ఏంటో చెప్పకుండా చివరి నిమిషంలో చెప్పారట. అప్పటికే పెద్ద నటుడు కాకపోవడంతో ఆ సినిమా నుంచి బయటకు రాలేక, కమిట్ మెంట్ ఇవ్వడంతో ఆ పాత్ర చేయాల్సి వచ్చిందని అసలు విషయాన్ని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కోటా శ్రీనివాసరావు.
ఓ ఇంటర్వ్యూలో కోటా ఆ వివరాలను వివరించారు. అప్పట్లో ఎన్టీఆర్ కు సూపర్ స్టార్ కృష్ణకు మధ్య ఏర్పడిన వివాదాలు ఓ సందర్భంలో తారా స్థాయికి చేరాయి. సినిమా వివాదాలు కాస్త రాజకీయ రంగు పులుముకున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయితే, కృష్ణ కాంగ్రెస్ లో చేరారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా, ఆయన్ను విమర్శిస్తు కొన్ని సినిమాలు చేశారు. అందులో మండలాధీశుడు ఒకటి. ఇందులో ఎన్టీఆర్‌ను పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు పోషించారు.పెద్దాయన హావభావాలు, డైలాగ్స్‌ను అనుకరిస్తూ కోట ఈ పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే ఎన్టీఆర్ ను విలన్ గా చూపించిన ఈ పాత్రను కోటా శ్రీనివాసరావు చేయడంతో ఆయన ఇబ్బందులు పడక తప్పలేదు. ఇండిస్టీలోనే కాదు బయటక కూడా కోట శ్రీనివాసరావు కొన్ని ప్రమాదాలు ఫేస్ చేశారు.
కోటాను కొట్టడానికి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు….
ఎన్టీఆర్ పై వ్యతిరేకంగా తీసిన సినిమాలో కోటా పెద్దాయన పాత్ర పోషించడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోటాపై కన్నెర్రజేశారు. ఎప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూశారు. ఓసారి తన కూతురిని చూడటానికి విజయవాడ వెళితే అప్పుడే ఎన్టీఆర్ పర్యటన కోసం విజయవాడ రావడం.. రైల్వే స్టేషన్ లో హడావిడి చూసి భయపడ్డారట కోటా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తే ఏమౌతుందో ఏంటో అని తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేశారట. కానీ ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు కోటను గుర్తుపట్టి కోటా వచ్చాడు అంటూ గట్టిగా కేకలు వేయడంతో అంతా ఆయనను చుట్టుముట్టి స్టేషన్ వెనక్కి లాక్కెళ్లి కొట్టడం మొదలు పెట్టారట. అక్కడున్నవారు పెద్దలు కల్పించుకోవడంతో ఎలాగోలా తప్పించుకున్నారట కోటా శ్రీనివాసరావు.
కోటా శ్రీనివాసరావును క్షమించి, ఆశీర్వదించిన ఎన్టీఆర్
మండలాధీశుడు సినిమా చేయడంతో కోటాకు ఆఫర్లు ఇవ్వలేదట టాలీవుడ్ లోని కొంత మంది మేకర్స్. అంతే కాదు అనధికారికంగా కోటాపై నిషేదం కూడా కొనసాగిందట. ఈక్రమంలోనే ఓ సారి ఎయిర్ పోర్ట్ లో ఉండగా అక్కడికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలుసుకున్నారు కోటా శ్రీనివాసరావు. ఎన్టీఆర్ రాగానే వెళ్లి పలకరించి క్షమాపణ అడుగుదాం, వివరణ కూడా ఇద్దాం అనుకున్నారట. ఎయిర్‌పోర్ట్‌లోకి ఎన్టీఆర్ రాగానే కోట శ్రీనివాసరావు ఎదురెళ్లి నమస్కారం పెట్టారు. చుట్టు ఉన్నవారు కోపంగా అరవడంతో పెద్దాయన వారిని వారించారట. అప్పటికే ఈ ఎపిసోడ్ గురించి తెలిసి ఉండటంతో ఎన్టీ రామారావు కొంత సీరియస్‌గానే ఉన్నారు. కానీ అన్ని పక్కనపెట్టి కోటాను నవ్వుతూ పలకరించారట. ” మీరు మంచి నటులని విన్నాను.. గాడ్ బ్లస్ యూ ఆరోగ్యం జాగ్రత్త ” అని కోటను భుజం తట్టి ఆశీర్వదించారట. వెంటనే ఎన్టీఆర్ పాదాలకు నమస్కరించి కోట వచ్చేశారు. దాంతో కోటాకు అప్పటి వరకూ ఉన్న గిల్టీ ఫీలింగ్ పోయిందట. పెద్దాయన క్షమించడంతో అభిమానులు కూడా శాంతించారు.
కోటా ముఖంపై గాండ్రించి ఉమ్మిన బాలకృష్ణ ….
ఓ సందర్భంలో రాజమండ్రి షూటింగ్‌కు వెళితే… కోటా, బాలయ్య ఒకే హోటల్ లో దిగారట . కోటా శ్రీనివాసరావు లిప్ట్ దగ్గర ఉండగా.. బాలయ్య అక్కడికి వచ్చారట. దాంతో నమస్కారం బాబు అని కోటా ఎదురువెళ్ళగా, ఆయన కోపంతో గాండ్రించి ముఖం మీదే ఉమ్మేశారట. ఇక అప్పుడు బాలయ్య సీఎం కొడుకు, పెద్ద హీరో కావడంతో.. తానేమి అనలేకపోయారట కోటా. అయితే ఆ తరువాత కాలంలో తాము చాలా సినిమాలు చేశామని. తనతో ఆయన క్లోజ్ గానే ఉంటారని బాలయ్యను గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కోటా. ఇక కోటాపై బాలయ్యకు ఎందుకు అంత కోపం అంటే.. దానికి కారణం కూడా మండలాధీశుడు సినిమానే. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీసిన మండలాధీశుడు సినిమాలో ఎన్టీఆర్ ను విలన్ గా చూపిస్తే.. అందులో పెద్దాయన పాత్ర కోటా చేయడం బాలయ్యకు కోపం తెప్పించింది.