బీఆర్‌ఎస్ హయాంలో తండ్రీ కొడుకులు వేల ఎకరాలు ధారాదత్తం చేశారు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లో సిరీస్ ఫ్యాక్టరీ భూములను రెసిడెన్షియల్ జోన్‌గా మార్చింది మాజీ మంత్రి కే తారకరమారావే అని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తండ్రి ముఖ్యమంత్రిగా, కేటీఆర్ పురపాలకశాఖ మంత్రిగా రాష్ట్రంలోని వేల ఎకరాల భూముల్ని ధారాదత్తం చేశారని విమర్శించారు. శుక్రవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హిల్ట్ పాలసీలో రెండు అంశాలు బీఆర్‌ఎస్ పాలనలో వచ్చినవేననీ, ఆ ఫైల్‌పై మంత్రిగా కేటీఆర్ సంతకం చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో కోకాపేట, నియోపోలిస్ ప్లాట్లు వేలం వేసిన విషయాల్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఔటర్ రింగ్‌రోడ్‌ను కూడా వేలం వేశారని ఆక్షేపించారు.
ఆనాడు పురపాలకశాఖ మంత్రిగా కేటీఆర్ ఎవరి దగ్గర ఎన్నెన్ని ముడుపులు తీసుకొని భూములు కన్వర్షన్ చేశారని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎల్‌బి నగర్‌లో దాదాపు 40 ఎకరాల స్ధలాన్ని పీవీ రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇచ్చిందనీ, అక్కడ కెమికల్ ఫ్యాక్టరీతో భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని ప్రజలు ఆందోళనలు చేశారని తెలిపారు. ఆ కెమికల్ ఇండిస్టీని రెసిడెన్షియల్ జోన్‌గా బీఆర్‌ఎస్ హయాంలో మార్పు చేశారని వివరించారు. దీన్ని ఏ పాలసీ ప్రకారం మార్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఐడిపిఎల్ భూముల్ని కూడా ఇదే విధంగా చేశారని గుర్తుచేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కడుపునిండా విషమేననీ, ఆయన ఆలోచనలూ విషపూరితమేనని విమర్శించారు. హిల్ట్ పాలసీపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఒకే డ్రామా అనీ, స్క్రిప్ట్ ఒకరు రాస్తే, డెలివరీ మరొకరు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
సిరీస్ ఫ్యాక్టరీ భూముల్నిరెసిడెన్షియల్ జోన్‌గా మార్చింది కేటీఆరే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



