హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది వాళ్లే
మోడీ, కేసీఆర్ వల్ల తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదు
బీఆర్‌ఎస్, బీజేపీ పాలనతో మా పరిపాలనను సరిపోల్చి ఓటెయ్యండి : జూబ్లీహిల్స్ ఓటర్లకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
కేటీఆర్‌కు కిషన్‌రెడ్డి లొంగిపోయారంటూ ఎద్దేవా
కాళేశ్వరంపై కేంద్రం ఎందుకు ముందుకు కదలటం లేదు?
ప్రతీ ఎన్నికా తమ పనితీరుకు పరీక్షేనంటూ వ్యాఖ్యలు
మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్, బీజేపీపై ఫైర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇద్దరూ బ్యాడ్ బ్రదర్స్ అంటూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదనీ, వారి వల్ల రాష్ట్రానికి ఒక్క పైసా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్ పాలనతో తమ కాంగ్రెస్ పరిపాలనను సరిపోల్చి చూసుకుని ఓటేయాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజహరుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి సీఎం రేవంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీలది ఫెవికాల్ బంధమంటూ ఎద్దేవా చేశారు.
కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించి, సీబీఐ విచారణకు తమ ప్రభుత్వం ఆదేశించినా, కేంద్రం ఎందుకు ముందుకు కదలటం లేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. కేటీఆర్‌కు పూర్తిగా లొంగిపోయారంటూ విమర్శించారు. గుజరాత్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లో నదుల ప్రక్షాళన, సుందరీకరణను బీజేపీ చేపట్టిందనీ, అదే పార్టీ నేతలు రాష్ట్రంలో మాత్రం మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని సీఎం తెలిపారు. ఆ తర్వాత పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాలూ నాశనమయ్యాయని చెప్పారు. ఔటర్ రింగు రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, మెట్రో రైల్ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో వచ్చినని కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే, పదేండ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పులను మిగిల్చి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు యూపీఏ హయాంలో రాష్ట్రానికి కేటాయించిన ఐటీఐఆర్‌ను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. వరదలొచ్చి హైదరాబాద్ మొత్తం మునిగిపోతే కేంద్రం మనకు ఒక్క పైసా ఇవ్వలేదని వాపోయారు.
ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా?
హైదరాబాద్ మెట్రో రైల్ నష్టాలకు, ఆ ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ తప్పుకోవటానికి బీఆర్‌ఎస్ సర్కారు లోప భూయిష్టమైన విధానాలే కారణమని సీఎం తూర్పారబట్టారు. తమ హయాంలో కాళేశ్వరం, నూతన సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్‌ను నిర్మించామంటూ బీఆర్‌ఎస్ నేతలు గొప్పలు చెపుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరాకు అదనంగా నీరివ్వలేదనీ, నూతన సచివాలయం వల్ల ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని చెప్పారు. ప్రతిపక్షాలపై నిఘా కోసమే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించారని, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, తలుపులతో నిర్మితమైన ప్రగతి భవన్‌లోకి సామాన్యులెవర్నీ రానివ్వలేదని విమర్శించారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే అత్యాశతో వాస్తు సరిగా లేదనే కారణంతో ఎన్నో ఏండ్లు పటిష్టంగా ఉండే పాత సచివాలయాన్ని కేసీఆర్ కూల్చివేశారని తెలిపారు.
కేటీఆర్ వల్లే హైదరాబాద్‌కు గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా వచ్చి పడ్డాయని విమర్శించారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతుందనీ, ఈ క్రమంలో ‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047’ను తమ ప్రభుత్వం రూపొందించిందని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆ డాక్యుమెంట్ అమలుకు అందరూ సహకరించాలని కోరారు. 30 ఏండ్ల పాటు పెండింగ్‌లో ఉన్న శామీర్‌పేట, మేడ్చెల్ ఎలివేటెడ్ కారిడార్‌కు తమ ప్రభుత్వ హయాంలో అప్రూవల్ తెచ్చామని చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. అదనంగా కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.
ఆ కాలేజీలవి బ్లాక్‌మెయిల్, బెదిరింపులు…
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసేదాకా కళాశాలలను తెరవబోమంటూ చెప్పిన ప్రయివేటు, కార్పొరేట్ ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా కాలేజీల యాజమాన్యాలపై సీఎం ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి ట్రాప్‌లో ఎంపీ ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ పడ్డారని విమర్శించారు. ఆయా కాలేజీల యాజమాన్యాలు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయనీ, ఎక్కడపడితే అక్కడ పర్మిషన్లు ఇవ్వాలంటూ కోరుతున్నాయని వివరించారు.
ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ, భవనాలు, మౌలిక వసతులు తదితరాల గురించి ప్రశ్నిస్తే, విచారణ చేయాలని ఆదేశిస్తే… చివరకు ప్రభుత్వాన్ని బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేస్తూ కళాశాలల బంద్ పెట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు తమ ప్రభుత్వం భయపడబోదని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఫీజు బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తామని హామీనిచ్చారు. ఒకవేళ కాదు కూడదూ అంటే.. రాష్ట్రానికి నెలకు వస్తున్న రూ.18 వేల కోట్ల ఆదాయంపై కమిటీ వేసి, ఆ కమిటీలో ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ మాదిగతోపాటు కాలేజీల యాజమాన్యాలను భాగస్వాములను చేస్తామని వ్యాఖ్యానించారు. ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో వారే చెప్పాలంటూ సీఎం చురకలంటించారు.
బండివి మతిలేని మాటలు…
జూబ్లీహిల్స్ ప్రచారంలో తాను ముస్లిం టోపీ ధరించటం గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తావించటాన్ని సీఎం ఈ సందర్భంగా తప్పుబట్టారు. ‘ఒక్కో సందర్భంలో ఒక్కో మత గురువుల వద్దకు వెళ్లినప్పుడు, వారు తమ సంప్రదాయం ప్రకారం మనల్ని గౌరవిస్తారు. ఆ రకంగానే నేను ముస్లింల టోపీ ధరించా. ఇటీవల ఒక హిందూ ఆధ్యాత్మికవేత్తను కలిసినప్పుడు పైనున్న చొక్కా తీసేసి, పంచె కట్టుకుని రావాలంటూ నాకు సూచించారు.
నేను ఆ విధంగానే చేశా. అంటే నేను హిందూ మతోన్మాదినా…?’ అంటూ రేవంత్, బండి సంజరును సూటిగా ప్రశ్నించారు. ఆయనవి మతిలేని మాటలంటూ కొట్టి పారేశారు. తాను సర్వేలు, ఛానళ్లు, పత్రికల రిపోర్టు గురించి పెద్దగా మాట్లాడబోనని వ్యాఖ్యా నించారు. వాటి పసేంటో ఈనెల 14న తేలిపోతుందని ఎద్దేవా చేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆయనతోపాటు కేటీఆర్, హరీశ్‌రావు ఆస్తులు పెరిగిపోయాయని అన్నారు. కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి అవసరమని, అది రానందువల్ల ఆయనపై చర్యలకు ఉపక్రమించలేకపోతున్నామని సీఎం ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
హైడ్రాపై అక్కసెందుకు?
హైదరాబాద్‌లోని గొలుసుకట్టు చెరువులు, కుంటలను కాపాడుతున్న హైడ్రాపై బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని సీఎం ప్రశ్నించారు. అంబర్‌పేటలో ఆ పార్టీ నేత ఎడ్ల సుధాకరరెడ్డి… బతుకమ్మ కుంటను ఆక్రమిస్తే, తమ ప్రభుత్వం, ఆయన చెర నుంచి ఆ చెరువును కాపాడి, పునరుద్ధరించిందని గుర్తు చేశారు. సున్నం చెరువుతోపాటు ఇతర చెరువులు, కుంటలను కాపాడామని తెలిపారు.



