Monday, September 15, 2025
E-PAPER
Homeఆటలుకుల్‌దీప్‌, అక్షర్‌ మాయ

కుల్‌దీప్‌, అక్షర్‌ మాయ

- Advertisement -

– పాకిస్తాన్‌పై భారత్‌ అలవోక విజయం
– పాకిస్తాన్‌ 127/9, భారత్‌ 131/3

నవతెలంగాణ-దుబాయ్‌ :
ఆసియా కప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం దుబారులో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమ్‌ ఇండియా సూపర్‌4 బెర్త్‌ ఖాయం చేసుకుంది. 128 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 15.5 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (47 నాటౌట్‌, 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (31, 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్‌ (10, 7 బంతుల్లో 2 సిక్స్‌లు) ధనాధన్‌ ఆరంభాన్ని అందించారు. అభిషేక్‌ శర్మ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో పాక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, తెలుగు తేజం తిలక్‌ వర్మ (31, 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పిచ్‌ నుంచి టర్న్‌ లభించగా.. స్పిన్నర్లపై భారీ షాట్లకు వెళ్లకుండా స్ట్రయిక్‌ రొటేషన్‌తో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఆఖర్లో తిలక్‌ వర్మ నిష్క్రమించినా..శివం దూబె (10 నాటౌట్‌, 7 బంతుల్లో 1 సిక్స్‌) తోడుగా సూర్య లాంఛనం ముగించాడు. ఛేదనలో ఏ దశలోనూ భారత్‌పై పాకిస్తాన్‌ బౌలర్లు ఒత్తిడి తీసుకురాలేకపోయారు.

పాక్‌ బౌలర్లలో సయీం అయుబ్‌ (3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు, టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులే చేసింది. భారత స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (3/18), అక్షర్‌ పటేల్‌ (2/18), వరుణ్‌ చక్రవర్తి (1/24) పాకిస్తాన్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆ జట్టులో ఓపెనర్‌ ఫర్హాన్‌ (40, 44 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), టెయిలెండర్‌ షహీన్‌ షా అఫ్రిది (33 నాటౌట్‌, 16 బంతుల్లో 4 సిక్స్‌లు) రాణించారు. ఆఖర్లో షహీన్‌ మెరుపులతో పాకిస్తాన్‌ మూడంకెల స్కోరు దాటగలిగింది. భారత పేసర్లు జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/28), హార్దిక్‌ పాండ్య (1/34) సైతం వికెట్ల వేటలో ఆకట్టుకున్నారు. తొలుత బంతితో, ఛేదనలో బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసిన భారత్‌ మరో 25 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. భారత స్పిన్‌ ద్వయం కుల్‌దీప్‌, అక్షర్‌ పటేల్‌లు 8 ఓవర్లలో 36 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టడం మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -