Friday, July 4, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికార్మికులకు మరణశాసనం లేబర్‌కోడ్స్‌

కార్మికులకు మరణశాసనం లేబర్‌కోడ్స్‌

- Advertisement -

1991లో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు, కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక వైఖరి, ప్రయివేటీకరణ పోకడల్ని నిరసిస్తూ, కార్మిక హక్కుల్ని కాపాడటం కోసం పది కేంద్ర కార్మిక సంఘాలు నాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా 21 సమ్మెలు నిర్వహించాయి. ప్రధాన రంగాల ప్రయివేటీకరణ, విదేశీ పెట్టుబడి ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తూ మొదటి దేశవ్యాప్త సమ్మె 29 నవంబర్‌ 1991లో మొదలైంది. కార్మికులకు అధిక వేతనాలు, సామాజిక భద్రత కల్పించడం, కార్మిక చట్టాల్లో సంస్క రణలకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాప్త సమ్మెల్లో కార్మికులు ప్రతియేటా పాల్గొంటు న్నారు.

అంతేకాక ఉద్యోగ భద్రత, పెన్షన్‌ హక్కును డిమాండ్‌ చేస్తూ కార్మికులు సమ్మెలు నిర్వహిస్తున్నారు. 2020 నవంబర్‌ 26న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో 25 కోట్ల మంది అనగా 250 మిలియన్ల కార్మికులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె ద్వారా తమ నిరసన తెలియజేశారు. ఇది ప్రపంచంలో జరిగిన అతిపెద్ద సమ్మెల్లో ఒకటని జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు అభివర్ణించాయి. 2019 జనవరి 8-9 తేదీల్లో జరిగిన రెండు రోజుల సమ్మె, 2022 మార్చి 28-29 తేదీల్లో జరిగిన సమ్మెలు, బ్యాంకింగ్‌, రవాణా, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభావితం చేశాయి. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక కార్మికుల హక్కుల కోసం పోరాడే శక్తివంతమైన వేదికగా నిలుస్తున్నది. జులై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె కూడా అందులో భాగం కానుంది.


ప్రస్తుతం మోడీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసత్వంలోకి నెట్టి వేసే లక్ష్యంతో 29 కార్మిక చట్టాల్ని రద్దు చేసి, వాటిస్థానంలో నాలుగు లేబర్‌ కోడ్స్‌ను అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నది. ఫ్యాక్టరీల్లో, పని ప్రదేశంలో యూనియన్లు లేకుండా చేయటమే లక్ష్యంగా, కార్మికవర్గాన్ని నిరాయుధుల్ని చేయడమే ధ్యేయంగా ఈ లేబర్‌ కోడ్స్‌ అని స్పష్టమవుతున్నది. 2002లో అప్పటి వాజ్‌పారు ప్రభుత్వం 2వ లేబర్‌ కమిషన్‌ను రవీంద్రవర్మ నేతృత్వంలో నియమించి 44 కార్మిక చట్టాల స్థానంలో లేబర్‌ కోడ్స్‌ను తీసుకురావాలని ప్రతిపాదించింది. ప్రస్తుత మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, చట్టవిరుద్ధ విధానాలు దాదాపు అన్ని కూడా 2వ లేబర్‌ కమిషన్‌ సిఫార్సులను పోలి ఉండటాన్ని గమనిస్తే అప్పటినుండి యజమానులకు అనుకూలంగా, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయ పూనుకున్నదన్న విషయం అవగతమవుతున్నది.

2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వామపక్ష పార్టీల సహకారం ఉండటం వల్లన లేబర్‌కోడ్స్‌ను తీసుకురావడానికి వెనుకడుగు వేసింది. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తీసుకొచ్చి వాటి ప్రక్రియను ప్రారంభించింది. కార్మిక సంఘాల సమ్మెలు, పోరాటాల వలన వెంటనే అమలు చేయడానికి ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. 2019లో మూడోసారి అధి కారం చేపట్టిన తర్వాత పార్లమెంట్‌లో వేతనాల కోడ్‌ను పాస్‌ చేయించుకుంది. 2020లో మిగిలిన మూడు పారిశ్రామిక సంబం ధాల కోడ్‌, సామాజిక భద్రత కోడ్‌, వత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్స్‌ను ఆమోదించుకుంది. మూడు వ్యవ సాయ నల్లచట్టాలు పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్‌ సభ్యులు వాటికి నిరసనగా వాకౌట్‌ చేసిన సమయంలో ఈ లేబర్‌ కోడ్స్‌ను దొడ్దిదారిలో ఆమోదింపజేసుకుంది.


ఈ లేబర్‌కోడ్స్‌ను సరిగ్గా పరిశీలిస్తే కార్మిక వర్గంపై ప్రత్యక్ష దాడిచేసి వారి హక్కుల్ని హరించేందుకు ఉద్దేశించిన విధంగా ఇవి రూపొందించబడ్డాయి. దేశ సహజ వనరులను, ప్రజలను దోచుకోవడానికి, కార్పొరేట్‌ యాజమా న్యాలకు లాభాలు కట్టబెట్టడానికి, కార్మికులను మరింత దోపిడీ చేసేలా ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కార్మికులు, సంఘాలు కార్మికులతో కలిసి నిరంతర పోరాటాలు, ఆందోళనలు, ప్రతిఘటనలు చేయడం వల్ల ఈ నాలుగేండ్ల నుంచి ఈ లేబర్‌కోడ్స్‌ని అమలు చేయటంలో కేంద్రం కాస్తా వెనుక్కు తగ్గింది. అయితే 2025లో ఈ లేబర్‌ కోడ్స్‌ను ఎలాగైనా అమలు చేయలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ”జన విశ్వాస్‌” అనే చట్టంలోని నిబంధనల ప్రకారం అనేక చట్టాల కింద కార్పొరేట్లకు సంబంధించి 180 నేరాలను నేరరహితం చేసింది. ఈ చట్టాలను ఉల్లంఘించినందుకు యజమానులకు జైలు శిక్షలు విధించే నిబంధనలను ఈ లేబర్‌ కోడ్స్‌లో ఉపసంహరించింది. 2025 కేంద్ర బడ్జెట్‌లో కూడా మరో 100 నేరాలను నేర రహితం చేసింది. ”శ్రమ సమాధాన్‌”, ”శ్రమ సువిధ పోర్టల్‌”లు యజమానులు కార్మిక చట్ట ఉల్లంఘనలను సులభతరం చేయడానికి, ఫిర్యాదు ఆధారిత తనిఖీలను ఈ లేబర్‌ కోడ్స్‌ ద్వారా రద్దు చేసింది.


మరోవైపు కార్మికులు పోరాడి సంపాదించు కున్న హక్కులను కాలరాస్తూ సమిష్టి బేరసారాల చర్యలను లేబర్‌కోడ్స్‌ తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నది. కార్మికులు వారి సంఘాలు సమిష్టిగా ఫిర్యాదు చేయడం లాంటి వాటిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని పేర్కొంటు న్నది. ఫలితంగా నాన్‌ బెయిలబుల్‌ శిక్షలతో సహా పోలీసు చర్యలకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. ఈ లేబర్‌ కోడ్స్‌ అమలు చేయడానికి ముందుగానే గేట్‌ మీటింగులు, డిపార్ట్‌మెంటల్‌ సమావేశాలు, కరపత్రాల పంపిణీ, మెమొరాం డాలు అందజేయటం లాంటి ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాలను, హక్కులను ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థల్లో ఇప్పటికే నిషేధించింది. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఉపాధిని తీసుకురావడం ద్వారా ఉద్యోగ భద్రతతో పాటు అనేక సౌకర్యాలు అందచేయకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. శాశ్వత ఉద్యోగి, ఉపాధి అనేది ఒకప్పటి విషయం.

ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్‌, అప్రెంటీస్‌లు, ఇంటర్న్‌షిప్‌లు మొదలైన విధానాల ద్వారా కార్మికులను కేంద్రం నియమిస్తున్నది. అంతేకాక ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలను కూడా కార్మికులకు దూరం చేసే రూల్స్‌ను ఈ లేబర్‌కోడ్స్‌లో పొందుపరిచింది. ఇది ట్రేడ్‌ యూనియన్‌లను బలహీనపరచడానికి, యూనియన్లను తొలగించడానికే అనేది స్పష్టమవుతున్నది.దీనిద్వారా కార్మికుల్లో ఒక భయానక వాతావరణాన్ని సష్టించే పథకం చాపకింద నీరులా మోడీ సర్కార్‌ అనుసరిస్తున్నది.
లేబర్‌ కోడ్స్‌ అమలు అంటే మొత్తం పరిపాలనలో కార్పొరేట్‌ పెట్టుబడిదారీ వర్గం విధానాల అమలుకు ఎలాంటి అడ్డం కులు లేకుండా కొనసాగించుకోవడానికి, యథేచ్ఛగా లాభాలు ఆర్జించటానికేనన్నది స్పష్టమవుతున్నది. యూనియన్ల రహిత పని ప్రదేశాల ఏర్పాటు, కార్మికుల సమిష్టి చర్యలను నిర్వీర్యం చేసి వారిని నిరాయుధులను చేయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది.


కార్మికుల హక్కుల్ని కాలరాసే మరణ శాసనాలుగా ఈ లేబర్‌కోడ్స్‌ పనిచేయ నున్నవి. అందుకే ఈనెల 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను గతంలో నిర్వహించిన సమ్మెల్లో ఒకటిగా చూడకూడదు. లేబర్‌ కోడ్స్‌ అమలును తీవ్రంగా తిప్పికొట్టడానికి ప్రతిఘటనా, పోరాటాల ప్రారం భంగా ఈ సమ్మెను చూడాలి. పెట్టుబడి దారీ విధానాన్ని తరిమేయడంలో కార్మిక వర్గం మరింత మెలకువతో ముందుండాలి. నయా ఉదార వాదానికి వ్యతిరేకంగా, ఐక్యపోరాటాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకుని వెళ్లాలి. ఈ సమ్మె రెండవ దశ పోరాటానికి ప్రారంభం మాత్రమేనని దేశ ప్రజానీకానికి తెలియజేయాలి.

ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌
9490300867

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -