Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంశ్రమదోపిడీకే లేబర్‌కోడ్‌లు

శ్రమదోపిడీకే లేబర్‌కోడ్‌లు

- Advertisement -

– ఆ నాలుగు సవరణ చట్టాలను రద్దు చేయాలి
– రైతు వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలి
– 500కు పైగా జిల్లాల్లో భారీ ఆందోళనలు
– గొంతెత్తిన కార్మికులు, కర్షకులు

మోడీ ప్రభుత్వం తమను తాము అధికారంలో ఉంచుకోవడానికి విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోందని కార్మికులు,కర్షకులు ధ్వజమెత్తారు. దేశ రాజ్యాంగం, లౌకిక ప్రజాస్వామ్యం, విభిన్న సంస్కృతులు, నమ్మకాలు, భాషల పట్ల గౌరవం, భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి వంటి ప్రధాన విలువలను ప్రమాదంలో పడేస్తోందని పేర్కొన్నారు. శ్రామిక ప్రజలు, సామాన్య ప్రజలు ద్వేషపూరిత రాజకీయాలను తిరస్కరించాలని, వారి రోజువారీ జీవిత సమస్యలు, నాణ్యమైన ఉచిత విద్య, ఆరోగ్యం, నివాసం, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, ఉపాధి, మంచి వేతనాలు, సామాజిక భద్రత, వృద్ధాప్య భద్రత వంటి ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉద్యమాలను బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ దోపిడీని ఆపడానికి, ప్రజలు, దేశం ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగం/ప్రజా సేవలు, జల్‌-జంగిల్‌-జమీన్‌ వంటి జాతీయ ఆస్తులుగా కాపాడుకోవడానికి ప్రజలు ఉద్యమాలను బలోపేతం చేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ నిరసనను విజయవంతం చేసిన లక్షలాది మంది కార్యకర్తలను కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతలు అభినందించారు. ఇది కార్మిక, రైతు వ్యతిరేక మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక అని, తమ డిమాండ్లపై తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్త పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని కార్మికుల శ్రమదోపిడీకి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనీ, రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు, రైతులు భారీ ఆందోళనలు చేపట్టారు. పది కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపులో భాగంగా బుధవారం దేశవ్యాప్తంగా 500కుపైగా జిల్లాల్లో ఈ ఆందోళనలు జరిగాయి. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తోన్న కార్మికులు, రైతులపై బీజేపీపాలిత రాష్ట్రాల్లో నిర్బంధం విధించారు. అరెస్టుల పర్వం, దాడుల వంటి చర్యలకు పూనుకున్నారు. ఈ అణచివేత చర్యలను అధిగమించి కార్మికులు, కర్షకులు కదం తొక్కారు. వారి నినాదాలతో ఆందోళన ప్రాంతాలు దద్దరిల్లాయి. మొద్దు నిద్రలో ఉన్న మోడీ సర్కార్‌కు వినబడేలా తమ గొంతెలను హౌరెత్తించారు. నాలుగు కార్మిక కోడ్‌లు, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రాష్ట్ర స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి వరకు నిరసనలు జరిగాయి. అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, సాధారణ ప్రజల ఇతర వర్గాల నుంచి భారీ స్పందన లభించింది. అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు, యువత భాగస్వామ్యమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, రాజస్తాన్‌, పంజాబ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, అసోం, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలు, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులు తదితర కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆందోళన జరిగాయి. పంజాబ్‌లో జరిగిన ఆందోళనలో సీఐటీయూ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.హేమలత, తపన్‌సేన్‌ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలో కార్మిక, రైతు సంఘాల జాతీయ నాయకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో స్థానిక అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. నార్త్‌ త్రిపుర జిల్లాలో బీజేపీ గూండాలు కార్మిక, రైతు ప్రదర్శనపై దాడి చేయడాన్ని కార్మిక సంఘాలు, ఎస్కేఎం తీవ్రంగా ఖండించాయి. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమితవ దత్తా, ఏఐకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు రతన్‌ రారు, మరో ఏడుగురు కార్యకర్తలపై దాడి జరిగింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న అసమానతలు, పెరిగిన క్యాజువల్‌ కార్మికులు, నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. దేశంలోని రెండు ఉత్పత్తి శక్తులైన కార్మికులు, రైతులు ఒకరికొకరు తమ సంఘీభావ మద్దతును బలోపేతం చేసుకోవడంతో పాటు ఐక్య పోరాటాలను బలోపేతం చేశారు.

మోడీ ప్రభుత్వం గత పదేండ్లుగా ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ను నిర్వహించడం లేదని, అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను ఉల్లంఘిస్తోందని కార్మిక నేతలు విమర్శించారు. కార్మిక ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందని, 2025 నవంబర్‌ 21న ‘సులభతర వ్యాపారం’ పేరుతో యజమానులకు అనుకూలంగా నాలుగు కార్మిక కోడ్‌లను నోటిఫై చేసిందని ధ్వజమెత్తారు. బ్రిటిష్‌ పాలన నుంచి 150 ఏండ్ల పోరాటం తరువాత సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసేలా ఈ కార్మిక కోడ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కోడ్‌లు సమ్మె చేసే హక్కును నిరాకరిస్తాయని, యూనియన్‌ రిజిస్ట్రేషన్‌ను సమస్యాత్మకంగా చేస్తాయని అన్నారు. యూనియన్ల గుర్తింపును రద్దు చేయడం సులభతరం చేస్తాయని, రాజీ, తీర్పు ప్రక్రియను క్లిష్టతరం చేస్తాయని పేర్కొన్నారు. లేబర్‌కోర్టులను రద్దు చేస్తాయని, కార్మికుల కోసం ట్రిబ్యునల్‌ను ప్రవేశపెడతాయని విమర్శించారు. రిజిస్ట్రార్లకు యూనియన్‌ల ను రిజిస్ట్రర్‌ చేసే అధికారాన్ని అధిగమిస్తాయని తెలిపారు. వేతనానికి సంబంధించిన నిర్వచనం మార్పు చేస్తారని, కనీస వేతనాల వర్తింపు కోసం వృత్తుల షెడ్యూల్‌ రద్దు అవుతుందని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడి భద్రతా హక్కును, కార్మికుల ఇతర హక్కులను పూర్తిగా ప్రమాదంలో పడేసేలా రూపొందించారని విమర్శించారు. యజమానులకు అవసరమైనవన్నీ సులభతరం చేయడానికి ఫెసిలిటేటర్‌లను తీసుకువస్తున్నారని దుయ్యబట్టారు. కార్మిక చట్టాల పరిధి నుంచి 70 శాతం పరిశ్రమలను ఈ కోడ్‌లు బయటకు నెట్టివేస్తాయని అన్నారు.

యజమానులను అణచివేయడానికి, దోపిడీ చేయడానికి విస్తృత విచక్షణా ధికారాలను ఇస్తున్నాయని విమర్శించారు. కార్మిక చట్ట రక్షణ లేదని, అపరిమిత అప్రెంటిస్‌షిప్‌ దోపిడీకి మరొక మార్గమని తెలిపారు. యజమానుల ఉల్లంఘనలను నేరరహితం చేస్తున్నారని, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులను నేరస్తులుగా చేయడం జరుగుతోందని ధ్వజమెత్తారు. జాన్‌ విశ్వాస్‌ బిల్లు క్రిమినల్‌ ‘జరిమానాలను’ సివిల్‌ ‘జరిమా నాలు’గా మార్చడంతో 288 నిబంధనలను క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ నుంచి అడ్మినిస్ట్రేటివ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు మారుస్తుం దని పేర్కొన్నారు.
మంజూరైన పోస్టుల నియామకం జరగక పోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందని, నిరుద్యోగ యువతకు రెగ్యులర్‌ ఉపాధికి బదులుగా పదవీ విరమణ చేసిన వారి నియామకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న మంజూరు చేయబడిన పోస్టులకు వెంటనే నియామకాలు చేపట్టాలని, పరిశ్రమలు, సేవల రంగాల్లో మరిన్ని ఉద్యోగాలను సృష్టించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ కార్మికుల వేతనాలు పెంచాలని, పట్టణ ప్రాంతాలకు ఇలాంటి చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఉపాధి, సామాజిక భద్రత నిబంధనలపై మోసపూరిత వాదనలు చేస్తోందని కార్మిక నేతలు విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -