పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన
”కార్పొరేట్ జంగిల్ రాజ్ వద్దు- కార్మికులకు న్యాయం కావాలి” అంటూ ప్రదర్శన
కార్మిక వ్యతిరేక..కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం : మల్లికార్జున ఖర్గే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ సర్కార్ తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బుధవారం పార్లమెంట్ ఆవరణలోని మకరద్వారం ఎదుట కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, డీఎంకే, టీఎంసీ, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, ఎస్‌పీ, ఐయూఎంఎల్ తదితర ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. ”కార్పొరేట్ జంగిల్ రాజ్ వద్దు- కార్మికులకు న్యాయం కావాలి” అంటూ భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్లకార్డులు చేబూని నినాదాల హౌరెత్తించారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ”కార్మిక వ్యతిరేక.. కార్పొరేట్‌కు అనుకూలం” అని విమర్శించారు.
పార్లమెంటు ప్రాంగణంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపాయని, కొత్తగా అమలు చేసిన కార్మిక కోడ్‌ల గురించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయని అన్నారు. ”కొత్త కోడ్‌లలో కొన్ని తీవ్రమైన ఆందోళన లు ఉన్నాయి. ఉద్యోగ భద్రతకు ముప్పు. లేఆఫ్ పరిమితిని 100 నుంచి 300 మందికి పెంచారు. అంటే దేశంలోని 80 శాతం కంటే ఎక్కువ పరిశ్రమ లు ఇప్పుడు ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికులను తొలగించవచ్చు. ఉద్యోగ భద్రతను తగ్గిస్తాయి. స్థిర కాల ఉపాధి (ఎఫ్‌టిఈ) విస్తరణ అనేక శాశ్వత ఉద్యోగాలకు ముగింపు పలికింది. కంపెనీలు ఇప్పుడు స్వల్పకాలిక ఒప్పందాలపై కార్మికులను నియమించుకోవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఉండవు” అని ఆయన అన్నారు. ఈ కోడ్ ఎనిమిది గంటల పని దినాన్ని కాగితంపై ఉంచినప్పటికీ, రాష్ట్రాలు సౌకర్యవంతమైన షెడ్యూలింగ్‌తో 12 గంటల షిఫ్ట్‌లను అనుమతించవచ్చని ఆయన పేర్కొన్నారు.
”రాష్ట్రాలు నిర్ణయించిన ఓవర్ టైమ్ పరిమితులతో కలిపి, ఇది సమర్థవంతంగా చాలా ఎక్కువ పనిదినాలను అనుమతిస్తుంది. ‘ఏకాభిప్రాయం’ అని లేబుల్ చేయబడినప్పటికీ అలసట, భద్రతా ప్రమాదాలను పెంచుతుంది” అని ఖర్గే అన్నారు. ”కార్మికులు సమ్మె చేయడానికి 60 రోజుల ముందు వేచి ఉండాలి. అదనంగా 14 రోజుల కూలింగ్-ఆఫ్ వ్యవధి ఉండాలి. ఇది అసురక్షిత లేదా అన్యాయమైన పరిస్థితులపై స్పష్టం చేస్తోంది. 51 శాతం సభ్యత్వం కలిగిన ఒక యూనియన్‌ను ఏకైక సంధానకర్తగా ఉంచడం చిన్న యూనియన్‌లను పక్కన పెడుతుంది. విభిన్న కార్మిక సమూహాలకు ప్రాతినిధ్యం తగ్గిస్తుంది” అని పేర్కొన్నారు. 300 కంటే తక్కువ మంది కార్మికులు ఉన్న యూనిట్లకు స్టాండింగ్ ఆర్డర్లు వర్తించవని ఆయన తెలిపారు. ”పని గంటలు, సెలవులు, తొలగింపులపై ప్రాథమిక నియమాలు తప్పనిసరి కావు. ఇది మధ్య తరహా యూనిట్లలో ఏకపక్ష ‘నియామకం, తొలగింపు’ పద్ధతులను పెంచుతుంది” అని అన్నారు. ఈ కోడ్‌లు కార్మికుల భద్రత, సంక్షేమాన్ని బలహీనపరిచాయని ఖర్గే పేర్కొన్నారు.
కార్మిక చట్టాల సరళీకృతం పేరుతో కోడ్‌లు : ప్రియాంక గాంధీ
”కార్మిక చట్టాలను సరళీకృతం చేయడం పేరుతో కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్‌లను తీసుకువచ్చింది. కానీ ఈ నెపంతో ప్రభుత్వం కార్మికుల చేతుల్లో ఉన్న అన్ని హక్కులను లాక్కుంది. గతంలో కార్మికులకు ఇచ్చిన రక్షణ తీసివేయబడింది. వారిని దోపిడీ చేసేందుకు పరిశ్రమ యజమానులకు కొత్త మార్గాలు తెరవబడ్డాయి. ఈ చట్టాలతో నరేంద్ర మోడీ జీ పెట్టుబడిదారీ అనుకూల, కార్మిక వ్యతిరేక మనస్తత్వం మరోసారి స్పష్టమైంది. దేశం ఈ చట్టాల ను అంగీకరించదు” ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) ఎంపీలు కె. రాధాకృష్ణ న్, వి. శివదాసన్, రహీమ్, ఎస్.వెంకటేషన్, డీఎంకే ఎంపీలు కనిమొళి, ఎ.రాజా, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ఎంపీ సుదామ ప్రసాద్, టీఎంసీ ఎంపీ డోలాసేన్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు లోక్‌సభలో లేబర్ కోడ్లపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు.
దోపిడీ కోసమే కోడ్‌లు
”కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోంది. కార్మిక పోరాటాల చరిత్ర తెలుసుకోకుండా, కార్మిక సంఘాల సమ్మతి తీసుకోకుండా లేబర్ కో డ్‌లను ఏకపక్షంగా మోడీసర్కార్ తీసుకొచ్చింది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న, ఉత్పత్తిని సృష్టిస్తున్న కార్మికవర్గంపై కేంద్రం దాడికి పూనుకుంది. కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కోసమే లేబర్ కోడ్లను తీసుకొచ్చామని చెబుతున్న ప్రభుత్వం, కార్మికుల గొంతెను ఎందుకు వినడం లేదు. ఈ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటాల పట్ల మొద్దు నిద్ర వహిస్తోంది.
-సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్‌బ్రిట్టాస్



