Wednesday, December 3, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిలేబర్‌కోడ్‌లు: పాశ్చాత్య దమన శాస్త్రం!

లేబర్‌కోడ్‌లు: పాశ్చాత్య దమన శాస్త్రం!

- Advertisement -

”రాక్షసుడంతటి బలం ఉండటం మంచిదేగాని, దాన్ని రాక్షసుడిలాగా ఉపయోగించడం నిరంకు శత్వం” – విలియమ్‌ షేక్స్‌పియర్‌ ఇటీవల కార్మికశాఖ ఉన్నతాధికారులు కొందరు ‘రాజును మించిన రాజ భక్తి’ ప్రదర్శిస్తున్నారు. ఇక వివిధ రంగుల పాలక రాజకీయులు ఒకేపాట, ఒకే పల్లవీ! భయానికి కొందరు, భక్తితో కొందరు, డబ్బాశతో మరికొందరు పుంఖాను పుంఖాలుగా తలాతోకా తెలియకుండా లేబర్‌ కోడ్‌లకు వంత పాడే సోషల్‌ మీడియా అవధాన్లు రంగంలోకి దిగారు. కొత్తగా ప్రారంభించిన టాల్కం పౌడర్‌ కంపెనీ యాడ్‌లాగా ”29 కార్మిక చట్టాలు ముసలివైపోయాయి, కాబట్టి వాటి స్థానంలో ఈ నాలుగు కొత్త ‘కోడ్‌’లను ముస్తాబు చేసినట్లు సర్కార్‌ వారి ప్రవచనాలను ప్రతిధ్వనిస్తున్నారు.

దాని పొట్ట విప్పి చూస్తే లోపల ఎన్ని పురుగులున్నాయో, వారి వాదన ఎంత బోలైనదో తెలుస్తుంది. ప్రధాన విషయమేమిటంటే, ”పాశ్చాత్య ఆలోచనలను” మోడీ సర్కార్‌ ప్రక్షాళన చేసిందని అధికారగణం చెప్పేది కేవలం ‘మనువు’ కోసమే! లేబర్‌ కోడ్‌లు అమలైన తర్వాతుండే మన పరిస్థితే నేడు పశ్చిమ దేశాల్లో, వాటికి పశ్చిమానున్న అమెరికాలో ఉండేది. ప్రజాస్వామ్య దేశాలని వాటికున్న ”టాగ్‌లైన్‌” వల్లా, విస్తారంగా కార్మికులు పాల్గొనేలా చేయగలగడం వల్ల కొన్ని హక్కులు సాధించుకోగలుతున్నారు. నిలబెట్టుకోగలుగుతున్నారు.

వకాలత్‌నామాలెందుకు సార్‌?!
ప్రభుత్వ అధికార్లు ప్రభుత్వం చెప్పినట్లే వినాల్సి రావచ్చు. అంత మాత్రం చేత సాష్టాంగ పడాల్సిన పనిలేదు. ఇటువంటి ఒక ‘వకాల్తాదారు’ గురించి రెండు మాటలు. పాలకులతోపాటు ఇటువంటి ఛోటా, బడా అధికారులంతా కలిసి ఎంతోమంది కార్మికులకు కుతర్కం బోధిస్తున్నారు. మను ధర్మమనేది మనందరి ధర్మంగా అర్థం చేయించాలని చూస్తున్నారు. 1980 దశకం చివరిలో ఇద్దరు, ముగ్గురు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో) ఐఏఎస్‌ అధికారులైన లేబర్‌ కమిషనర్లు తమది కార్మికశాఖే గాని యజమానులశాఖ కాదని బల్లగుద్ది చెప్పి మరీ కార్మికుల పక్షాన నిలబడ్డ తీరు ఈ రచయిత సొంత అనుభవం. ఉదారవాద విధానాల రాకతో ఈ స్థితి లేకుండా పోయింది. మోడీ సర్కార్‌ ‘పాశ్చాత్య ఆలోచనల’ను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ లేబర్‌ కోడ్‌లు తెచ్చిందట! కార్మికోద్యమాల గురించి అలాంటి నిరక్షరాశ్యులైన అధికారులకు తెలుస్తుందని అనుకోలేం! చరిత్ర గురించిగాని, కనీసం భూగోళం గురించిగాని వీరికి తెలియకపోవడం మన ప్రారబ్ధం!

పారిశ్రామిక విప్లవం తరువాత క్రమంగా ఆధునిక పరిశ్రమలు వెలిసింది ఐరోపాలోనే. అంటే మనకి పశ్చిమానే! తమ ఉపాధిని దెబ్బతీసే (కార్డింగ్‌) యంత్రాల విధ్వంచేసిన ‘లుడ్డైట్‌’ ఉద్యమం దాదాపు అర్ధశతాబ్దం పాటు కుదిపేసింది ఇంగ్లండ్‌ని! తమ సీఆర్‌పీసీని సవరించి మరీ యంత్ర విధ్వంసాన్ని కూడా ఉరిశిక్ష కేటగిరీలో చేర్చింది. డజన్ల మంది ఆ ఉపాధి పోయిన కార్మికులను ఉరేసింది. కార్మికులు సుదీర్ఘ మిలిటెంటు పోరాటాలు జరిపి రక్తమోడ్చారు. చట్టాలు సాధించారు. ఆ పశ్చిమాదినే! ఆ తర్వాత తమ ప్రధాన శత్రువులు యంత్రాలు కాదు, యంత్ర యజమానులని కార్మిక వర్గం గుర్తించింది ఆ పశ్చిమాదినే! 8 గంటల పని దినం కావాలని పోరాడితే అనేక మంది బలైంది మనకి పశ్చిమానున్న అమెరికాలోనే! ఆస్తితో సంబంధం లేకుండా సార్వత్రిక ఓటు హక్కు కావాలని దాదాపు 30 ఏండ్లు పోరాడి అమల్లోకి తెచ్చుకుంది ఇంగ్లండులోని ‘ఛార్టిస్టు’ ఉద్యమం. అందుకే లాలాలజపతి రాయైనా, బాలగంగాధర తిలక్‌ అయినా ఆ పోరాట స్ఫూర్తితోనే మన దేశంలో కార్మిక హక్కుల కోసం పోరాడారు.

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మన దేశంలో పారిశ్రామికీకరణ వేగంగా విస్తరించింది. ఏ శిక్షణాలేని వారిని నేరుగా పొలాల్నుండి తెచ్చి ఫ్యాక్టరీల్లో రిక్రూట్‌ చేసుకున్నారు. ప్రమాదాల్లో అంగ వైకల్యామో, మరణాలో సంభవించేవి. పరిహారం కోసం పెద్దఎత్తున పోరాటాలు జరిగాయి. పర్యవసానంగా వర్క్‌మెన్‌ కాంపెన్సేషన్‌ చట్టం (1923) వచ్చింది. దీనికి స్ఫూర్తి ఇదే పేరుతో ఇంగ్లండులో ఉన్న 1897 నాటి చట్టం, జర్మనీలోని సాంఘిక బీమా చట్టాలు. అందుకే భారత కార్మిక వర్గం పడమటికి చూసింది. చూసి నేర్చుకుంది. నేర్చుకుని పోరాడింది. బుడిబుడి నడకల భారత కార్మికోద్యమం సాధించిన మొదటి కార్మిక చట్టం అది. ఒక్క పడమటి కేంటి, కార్మికవర్గ పోరాటాలు విజయం సాధించిన దిక్కుకెల్లా భారతదేశ కార్మికవర్గం చూసింది. కార్మికవర్గమే అధికారంలోకి వచ్చిన సోవియట్‌ వైపు రవీంద్రనాథ్‌ టాగూర్‌ నుండి నెహ్రూ వరకూ ఆ కార్మికవర్గ రాజ్యం వైపే ఆశతో చూశారు.

1920 ఏఐటియుసి ఆవిర్భావ సభలో లాలాలజపతిరాయి ప్రారంభోపన్యాస పాఠం చదివిన వారికి ఆయన మీదా అప్పుడే పుట్టిన సోవియట్‌ కార్మికవర్గ రాజ్య ప్రభావముందని తెలుసుకోగలరు. ఆయన నిర్దిష్టంగా సోవియట్‌ పేరు ఎత్తకపోయినా, ‘ప్రాచీన భారత వర్ష’ లాంటి మాటలు వాడినా మనుధర్మం గురించో, శుక్రనీతి గురించో మాట్లాడలేదు. స్పష్టమైన వర్గభాషే లాలాజీ వాడారు. భారతీయ పెట్టుబడి కార్మికుల ప్రయోజనాలు పట్టించుకోకుండా, వారి పేదరికం పట్టించుకోకుండా, వారి పిల్లల చదువుగురించి పట్టించుకోకుండా ఉంటే ప్రజల మద్దతు దొరకదు. ‘దేశభక్తి’ గురించి చేసే ఉపన్యాసాలన్నీ నిరుపయోగ మవుతాయి అన్నారు లజపతిరాయి. అందుకని, మైడియర్‌ కార్మికశాఖాధికారీ! మీరు ‘ప్రక్షాళన’ చేయాలనుకుంటున్నది ఏ పాశ్చాత్య ఆలోచనలను? మీకు అర్థం కావాల్సింది మరో ముఖ్యమైన పాయింటుంది. మోడీ అండ్‌ కో కూడా తమ స్ఫూర్తి కోసం, పశ్చిమ దిక్కుకే చూస్తున్నారు. అయితే ఆ చూపు ‘ఫ్యూరర్‌’ జర్మనీ వద్దా, బెనిటిలో ముస్సోలినీ వద్దే ఆగిపోయాయి. మోడీకి వారిద్దరూ ఆదర్శమూర్తులు. ముస్సోలినీ ఖాకీ నిక్కర్లు, హిట్లర్‌ గ్యాస్‌ ఛాంబర్లు అనుసరణీయ నమూనాలు. అటువంటి ‘పాశ్చాత్య ఆలోచనలను’ భారత కార్మికవర్గం ప్రతిఘటిస్తుంది.

కార్మికశాఖ అధికారులు కొందరు తమ మెదళ్లను కోల్డ్‌ స్టోరేజీలో పెట్టి ప్రభుత్వ ‘కమాండ్లను’ మాత్రం ‘రిసీవ్‌’ చేసుకునే రోబోల్లాగా ప్రవర్తిస్తున్నారు. ‘ఏఐ’ కాలంలో ఉన్నాం కదా! కనీస వేతనాలను నిర్ధారించారట! అవి గౌరవప్రదమైన జీవనానికి దారితీస్తాయట! సకాలంలో వేతనాలు, బోనసులు చెల్లిస్తారట. ఆశ్చర్యకరమైన విషయమేమంటే వాళ్లే తుమ్మి, వాళ్లే శతాయిస్సు అనుకోవడం చూస్తే దేంతో నవ్వాలో తెలీడం లేదు. కేంద్రం నిర్ణయించిన జాతీయ స్థాయి కనీస వేతనం కన్నా తక్కువ ఏ రాష్ట్రంలో ఇవ్వకూడదట! నేషనల్‌ ఫ్లోర్‌ లెవెల్‌ మినిమమ్‌ వేజ్‌ రోజుకి రూ.178. అంటే నెలకు రూ.5,340. ఒక కార్మికుడి కుటుంబంలో నలుగురు సభ్యులుంటే రోడ్డు పక్కన బండి మీద రెండు పూటలా ఒక్క ప్లేటు ఇడ్లీ తిన్నా నెలకు రూ.8,400 అవుతుంది. ఇడ్లీలు మాత్రమే తినే కార్మికులు ఏమి చాకిరీ చేయగలరు? వారి పిల్లలు ఏమి చదువులు చదువగలరు.

ఏ రాష్ట్రమూ ఆ రూ.178 కంటే తక్కువియ్యకూడదంటే రూ.180 ఇచ్చినా అంతకంటే ఎక్కువే కదా?! వాస్తవానికి 15వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ (1957)లో నిర్ణయించిన వేతనానికి ఒక పునాది ఉంది. ఆ తర్వాత రాప్టకాస్‌ బ్రెట్ట్‌ కేసులో ‘సుప్రీం’ తీర్పునకు ఒక అర్థముంది. ఇపుడీ రూ.178కి పునాదేమిటో ఆ ‘బ్రహ్మ దేవుడికే’ తెలియాలి. ఇదంతా గౌరవప్రదమైన జీవితానికి ఎలా దారితీస్తుందో ఆ కార్మిక శాఖ అధికారికే తెలియాలి. ఓవర్‌టైమ్‌ వేతనం రెట్టింపు కట్టివ్వాలని ఇపుడేదో ఈ కోడ్‌లలో ఉన్నట్టు చెప్పడం మరీ ఆశర్యం. ఇప్పటికే ఉన్న ఈ రూల్‌ను ఎన్ని యాజమాన్యాలు అతిక్రమించడం లేదు? వారికేమి శిక్షలు విధించారో అటు కేంద్ర సర్కారు వద్దగాని, ఇటు భజన చేసే కేంద్ర, రాష్ట్ర కార్మికశాఖాధిపతుల వద్దగానీ వివరాలు ఉన్నాయా?
ఈ కోడ్‌లలో కీలకమైన అంశం, ఇంతకాలం ఏ ప్రభుత్వం అమలు చేయలేకపోయిన అంశం కార్మికుల ‘హైర్‌ అండ్‌ ఫైర్‌’ అమలు చేయడం, దేశ కార్పొరేట్లు మూకుమ్మడిగా ‘మోడీ నామ’ సంకీర్తన చేస్తున్నదీ, కార్మిక సంఘాలు ఈ ప్రభుత్వంపై కత్తులు దూస్తున్నదీ ఇందుకే.

దీనికి అవసరమైన అన్ని క్లాజులు ఈ కోడ్‌లలో ఉన్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఉపాధి, అప్రంటీస్‌ల వంటి దినదినగండం కార్మికులు పెరిగిపోయిన తర్వాత వారి ఉపాధి చీదితే ఊడిపోయే ముక్కులే! యూనియన్లున్నా నిరుపయోగంగా మిగుల్తున్నాయి. అంటే వేతనాలపై దాడి, ఉపాధిపై దాడి, సంఘం పెట్టుకునే హక్కులపై దాడి. వెరసి కార్మికుల జీవితాన్ని అధోగతి పాలుచేయడమే ఈ కోడ్‌ల యొక్క లక్ష్యం. తెలియక భజన చేసేవారు కొందరైతే, తెలిసి మోసపూరితమాటలు చెప్పే వారి కోవలో కొందరు కార్మిక శాఖ అధికారులు చేరారు. సోషల్‌ మీడియాలో భజన చేసే బృందాలు సమృద్ధిగానే ఉన్నాయి. దాదాపు వీళ్లంతా మచ్చికైన పెంపుడు చిలకలే! అలాంటి ఒక గండు చిలకకి విషయం ఏమీ తెలీక పోయినా ఊకదంపుడు వాదనలు ఎన్నో చేసింది.

ఆ పాచి వాదనల జోలికి పోకుండా గిగ్‌ వర్కర్ల గురించి కొత్తగా రాసిన అంశాన్ని పరిశీలిస్తే మొట్టమొదటిసారి గిగ్‌ వర్కర్లను ‘చట్టపరిధి’లోకి తెచ్చారట! ఏ చట్ట పరిధిలోకి తెచ్చారో చెప్పగలిగి ఉంటే బాగుండేది. గిగ్‌ వర్కర్లకు యజమాని ఎవరు? ఓలా, ఊబర్‌, ర్యాపిడోల్లో కార్మికులెవరు? కొంతసేపు రాపెడోకి బైక్‌ నడిపి, కొంతసేపు వేరే ఉద్యోగం చేసేవారిని ఎలా లెక్కిస్తామని? కనీసం వారికి ఇపిఎఫ్‌ ఇవ్వాలన్నా ఏ లెక్కన ఇస్తారు? ఒక రోజు కార్మికుడుగా ఉన్న వారికి సైతం పిఎఫ్‌ ఇవ్వాలని వి.పి. సింగ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డరు ఎంతమందికి అమలైందో చెప్పగలిగిన వారెవరైనా ఉన్నారా? నేడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు యజమాని వాటా, ఉద్యోగుల వాటా ఈపిఎఫ్‌ ఉద్యోగుల నుంచే వసూలు చేస్తున్న సంగతి ఈ పెద్దమనుషులకెవరికైనా తెలుసా? ప్రతి కార్మికుడికి నియామక పత్రాలు ఇస్తారట! ఇలాంటి బోలెడు రూల్స్‌ ఇప్పటికే ఉన్నాయి. అమలు చేసే యంత్రాంగం దీర్ఘ నిద్రలో ఉండటమే అసలు సమస్య. ప్రస్తుతం అధికారయుతంగా తనిఖీలు తొలగించారు. 1992-93లో ‘ఇన్స్‌పెక్టర్‌ రాజ్‌’ విధ్వంసంతో మొదలై సులభతర వ్యాపారంతో ముగిసిందీ కథ! కార్పొరేట్ల సేవకే లేబర్‌ కోడ్‌లు! కార్పొరేట్ల సేవే మాధవసేవ! వెరసి మాధవసేవంటే ”ప్రజలందరి” సేవ! అని చెప్పేస్తే సరిపోతుందిగా! ఈ డొంక తిరుగుడు ఎందుకు మోడీజీ!.

ఆర్‌.సుధాభాస్కర్‌
9490098025

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -