Friday, October 24, 2025
E-PAPER
Homeజాతీయంలడఖ్‌ చర్చలు పున:ప్రారంభం

లడఖ్‌ చర్చలు పున:ప్రారంభం

- Advertisement -

ఆర్టికల్‌ 371 కింద ప్రత్యేక నిబంధనలు
కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు
తమ డిమాండ్లపై తగ్గేది లేదంటున్న లడఖ్‌ ప్రజలు

లడఖ్‌ : అనేక నిరసనలు, అల్లర్ల అనంతరం లడఖ్‌ చర్చలు పున:ప్రారంభమయ్యాయి. ఆర్టికల్‌ 371 కింద ప్రత్యేక నిబంధనలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్రం తెలిపింది. కేంద్ర హౌం మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశం తర్వాత అపెక్స్‌ బాడీ లేహ్‌, కార్గిల్‌ డెమోక్రాటిక్‌ అలయన్స్‌ ఈ విషయాన్ని తెలిపాయి. లడఖ్‌కు రాజ్యాంగ రక్షణలు కోరుతూ ఈ రెండు పౌర సమాజ సంకీర్ణాలు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న విషయం విదితమే. లడఖ్‌కు రాజ్యాంగ రక్షణలు కోరుతూ జరిగిన నిరసనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన దాదాపు ఒక నెల తర్వాత ఈ రెండు పౌర సంఘాలు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యాయి. దీంతో తిరిగి చర్చలు ప్రారంభమయ్యాయి. గత మూడేండ్ల నుంచి కేంద్ర పాలనకు వ్యతిరేకంగా లడక్‌ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.

రాష్ట్ర హౌదా కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ భూభాగం, సంస్కృతి, వనరులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. దీంతో ఈ డిమాండ్ల విషయంలో తాజాగా నిరసనలు తీవ్ర రూపం దాల్చిన విషయం విదితమే. 2019 ఆగస్టు 5న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హౌదాను కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అందులో ఒకటి జమ్మూ కాశ్మీర్‌ కాగా.. ఇంకోటి లడఖ్‌. ఆ సమయంలో లేహ్‌లో చాలా మంది ఈ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ.. ఏడాదిలోపే కేంద్రం నేతృత్వంలోని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలనలో రాజకీయ శూన్యత ఏర్పడిందని పేర్కొంటూ ఆందోళనలు మొదలయ్యాయి. అయితే తాజా పరిణామంపై పౌర సంఘాలు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రహౌదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ కింద చేర్చాలన్న తమ డిమాండ్లను వారు పునరుద్ఘాటిస్తున్నారు.

”లడఖ్‌కు ఆర్టికల్‌ 371ని పరిగణించవచ్చని హౌం మంత్రిత్వ శాఖ అధికారులు మాకు సూచించారు. కానీ భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ కింద చేర్చడం, రాష్ట్ర హౌదా కల్పించాలన్న డిమాండ్ల పట్ల మేము దృఢంగా ఉన్నాం” అని అపెక్స్‌ బాడీ లేహ్‌ సహ-కన్వీనర్‌ చెర్రింగ్‌ డోర్ణయ్ లక్రుక్‌ తెలిపారు. కార్గిల్‌ డెమోక్రాటిక్‌ అలయన్స్‌కు చెందిన సజ్జాద్‌ కార్గిలి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. హింస తర్వాత జైలుపాలైన సామాజిక కార్యకర్త, లడఖ్‌ ఉద్యమ నేత సోనమ్‌ వాంగ్‌చుక్‌, మరో 20 మందిని విడుదల చేయాలని తాము డిమాండ్‌ చేస్తూనే ఉంటామని లక్రుక్‌ చెప్పారు. కేంద్రం చెప్తున్న ఆర్టికల్‌ 371 ‘తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేక నిబంధనల’తో పాటు కొంత వరకు పరిపాలనా స్వయంప్రతిపత్తితో వికేంద్రీకృత పాలనను అందిస్తుంది. ఇది అసోం, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, గుజరాత్‌, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, తెలంగాణ వంటి 12 రాష్ట్రాల్లో వర్తిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -