నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గట్టు మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి,భూ భారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అంశాలపై వివరణలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ సమస్యల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించడం అత్యంత ముఖ్యమని అన్నారు. భూ భారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో 22(A) సెక్షన్ కింద వచ్చే నిబంధనలను పూర్తిగా పాటించడం అత్యంత కీలకమని అన్నారు. రిజిస్ట్రేషన్‌కు నిషేధితంగా ఉన్న ప్రభుత్వ భూములు,వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, ఇతర ప్రత్యేక భూముల అక్రమ రిజిస్ట్రేషన్,విక్రయం లేదా ఏ విధమైన లావాదేవీలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూ భారతి పోర్టల్‌లో డేటా ఎంట్రీలను ఖచ్చితంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. దరఖాస్తులకు సంబంధించిన నోటీసులు సమయానికి ఆన్‌లైన్‌లో జారీ చేయాలన్నారు. సక్సేషన్,పెండింగ్ మ్యుటేషన్,మిస్సింగ్ సర్వే, పీవోపీ, డీ.ఎస్. పెండింగ్ దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలన్నారు. సాదా బైనమా అప్లికేషన్లను ముందుగానే సిద్ధం చేసి ఉంచి,ప్రభుత్వం ఆదేశాలు వచ్చే వెంటనే వాటిని తక్షణమే పూర్తి చేయగలరని కూడా తెలిపారు. అధికారులు ప్రతి దరఖాస్తును పరిశీలిస్తూ ఆధార్ కార్డులు, పట్టాదార్ పాస్‌బుక్, సాక్షుల ఆధార్ కార్డులను సక్రమంగా తనిఖీ చేయాలన్నారు.
భూ రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన దరఖాస్తులు,బయోమెట్రిక్ ప్రాసెస్, నోటీసులు,సర్వే మరియు మ్యుటేషన్ ప్రక్రియలను పూర్తిగా పరిశీలించి,నిబంధనలకు పూర్తి అనుగుణంగా ఉంటే మాత్రమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.భూ భారతి రికార్డులు స్పష్టంగా,సరిగా ఉంచాలన్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో రేషన్ కార్డుల వివరాలు,సర్టిఫికేట్లు, ఆఫీస్ రికార్డులు,ఇతర డాక్యుమెంట్లను అప్-టు-డేట్‌గా ఉంచి,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా,సేవలను సమయానికి, పారదర్శకంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్,రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.