అంతా మీ వల్లే…
గోడకున్న అద్దం పగిలిపోయింది. ఆండాళ్ళు మొగుడ్ని పట్టుకుని చితక్కొట్టింది.
ఆండాళ్ళు భర్త ‘ఆ అద్దాన్ని నేను పగలగొట్టలేదే బాబూ” అని మొత్తుకున్నాడు.
”నాకు తెల్సు. కానీ, నేను మీ మీద అప్పడాల కర్ర విసిరినప్పుడు మీరు వంగకుండా ఉంటే ఆ అద్దం పగిలేది కాదు కదా?!” అంటూ మళ్ళీ రెండిచ్చుకుంది.
సూటిగా సుత్తిలేకుండా
సతీష్ : జీతం ఎక్కువ, హోదా ఎక్కువ, పని తక్కువ ఉండే ఉద్యోగం ఏదన్నా వుంటే చెప్పు గురూ!
సంతోష్: అంత డొంక తిరుగుడుగా చెప్పకపోతే, సూటిగా రాజకీయాల్లో చేరి మంత్రినవ్వాలనుంది అని చెప్పలేవూ…
టిట్‌ఫర్ ట్యాట్
సుందర్ : కట్నంగా మీ నాన్నానడిగి నాకో కారు కొనిపించవోరు? ఎంచక్కా పెళ్ళయ్యాక మనిద్దరం ఆ కారులో తిరగొచ్చు.
సుందరి : కారేం ఖర్మ… మా నాన్ననడిగి రైలే కొనివ్వమని చెప్తాను. ముందు మీ నాన్నని రైలు పట్టాలు వేయించమని చెప్పు.
భయమా? నాకా?
భర్త : నువ్వు నాలోని జంతువుని నిద్ర లేపుతున్నావ్. నా కోపం సంగతి నీకు తెలీదు.
భార్య : మీకు కోపం వస్తే రానివ్వండి… పిల్లులకి ఎవ్వరూ భయపడరు.
మాటంటే మాటే
తండ్రి : ఉద్యోగం వచ్చేవరకు నువ్వు నా గుమ్మం తొక్కావంటే చూడు… నిన్నేం చేస్తానో!
కొడుకు : ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు రమ్మని బతిమాలినా నేను నీ గడప తొక్కను.
ఎంత ధైర్యం?
రాజేష్ : దీపావళికి మా ఆవిడ పది వేల రూపాయల పట్టుచీరకు టెండర్ పెట్టింది. అంతే… చెడామడా తిట్టిపడేశాను.
కుమార్ : ఎవరిని… మీ ఆవిడనే!
రాజేష్ : కాదు, నరకాసురుణ్ణి.
అవి తప్ప
తండ్రి : ఈ రోజు రాసిన పరీక్షలో ఎన్ని ప్రశ్నలిచ్చారు?
కొడుకు : యాభై మార్కులకి ఐదు ప్రశ్నలిచ్చారు నాన్నా.
తండ్రి : మరి నువ్వెన్ని రాశావు?
కొడుకు : కింద మూడు ప్రశ్నలు, పై రెండు ప్రశ్నలు తప్ప మిగిలినవన్నీ రాశాను.
కాలక్షేపం
ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్ : మేం అడిగిన అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పినా, నీకు మేం ఉద్యోగం ఇవ్వలేదనుకో. అప్పుడు ఏమనుకుంటావు?
అభ్యర్థి : మేధావులనుకుంటున్న ఈ పిచ్చివాళ్ళతో కాసేపు కాలక్షేపమయ్యింది అనుకుంటాను.
వంశోద్ధారకుడు
కొడుకు : నాన్నా! ఈ రోజు నేను మీ పేరు నిలబెట్టా.
తండ్రి : కొంపదీసి… క్లాసులో ఫస్ట్ గానీ వచ్చావా?
కొడుకు : కాదు, ఇంటిముందున్న మీ నేమ్‌ప్లేట్ కిందపడిపోతే తీసి నిలబెట్టా.
మరీ ఇంత పొదుపా?!
కామాక్షి : ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఒక్క అగ్గిపుల్లతో వంట చేస్తావా? నమ్మలేకపోతున్నాను. అదెలాగో చెప్పు. నేనూ పొదుపు చేస్తాను.
మీనాక్షి : అదే మరి రహస్యం. ఎవ్వరికీ చెప్పకు మరి! ఉదయం వంట పూర్తయ్యాక స్టౌ బంద్ చెయ్యను.