నవతెలంగాణ-హైదరాబాద్: నాలుగేళ్ల నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం సాగుతోంది. శనివారం న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. దీంతో ఉక్రెయిన్ వైమానిక దళం దేశవ్యాప్తంగా వైమానిక హెచ్చరికను ప్రకటించింది. రష్యా అనేక కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణులు, నాలుగు ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణులు అనేక కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను నగరంపై ప్రయోగించడంతో రాజధాని పెద్ద ఎత్తున బాలిస్టిక్ క్షిపణి దాడికి గురైంది. చుట్టుపక్కల కైవ్ ఒబ్లాస్ట్‌లో మాదిరిగానే రాజధాని అంతటా అనేక పేలుళ్లు వినిపించాయని కైవ్ ఇండిపెండెంట్ నివేదించింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం ఫ్లోరిడాలో సమావేశం కాబోతున్నారు. రష్యాతో శాంతి ఒప్పందంపై ఇరువురి చర్చించనున్నారు. 20 పాయింట్ల ప్రణాళికతో ఉక్రెయిన్ భద్రతాపై ప్రధానంగా చర్చించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ సమావేశంలో అమెరికా, ఉక్రెయిన్ కాకుండా ఐరోపా దేశాలు కూడా పాలుపంచుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇంత తక్కువ సమయంలో సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ట్రంప్ నుంచి ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు లభిస్తే గనుక రెండు దేశాల మధ్య శాంతి విరజిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.



