ఛత్ పూజ తరువాత మహాగట్ బంధన్ మ్యానిఫెస్టో
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ప్రతిపక్ష వేదిక మహాగట్ బంధన్ తన మ్యానిఫెస్టో తయారీపై దృష్టి పెట్టింది. ప్రస్తుత ఎన్‌డీఏ పాలనలో క్షీణించిన శాంతిభద్రతలను మళ్లీ గాడిలో పెట్టడానికి, బలోపేతం చేయడానికి మ్యానిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వనుంది. వచ్చే వారంలో ఛత్‌పూజ తరువాత ఈ మ్యానిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. ఛత్ పూజను ఈ నెల 25 నుంచి 28 తేదీ వరకూ బీహార్‌లో ఘనంగా నిర్వహిస్తారు. పోలీసులపై రాజకీయ ఒత్తిడి లేకుండా చేయడం, స్టేషన్ ఇన్‌చార్జీలను నియమించడానికి పారదర్శక ప్రక్రియ వంటి చర్యలను మహాగట్ బంధన్ మ్యానిఫెస్టోలో పొందుపర్చనున్నారు. మహాగట్ బంధన్ అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను కాపాడి పెట్టుబడులను సురక్షితంగా వుంచుతామని హామీ ఇవ్వనున్నారు. అలాగే, ఆరోగ్యం, విద్యతో పాటు మానవ శక్తి ఎక్కువగా అవసరమయ్యే రంగాలను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలను అరికట్టడానికి కూడా మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సామాజిక న్యాయం అనే నినాదానికి అనుగుణంగా ఇబిసి రిజర్వేష్లను 20 నుంచి 30 శాతానికి పెంచడంపై కూడా హామీ ఇవ్వనున్నారు.
అలాగే, మ్యానిఫెస్టోలో ప్రస్తుత ఎన్‌డీఏ పాలనను ‘గూండారాజ్’గా విమర్శించనున్నారు. గతంలో లాలూప్రసాద్ యాదవ్ పాలనను ‘జంగిల్‌రాజ్’గా ఎన్‌డిఎ నాయకులు ఆరోపిస్తుండటంతో గూండారాజ్ పదాన్ని హైలెట్ చేయాలని మహాగట్ బంధన్ యోచిస్తుంది.
ఎన్‌డీఏ అన్ని రికార్డులను బద్దలుకొడుతుంది : బీహార్‌లో మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభం
శుక్రవారం రెండు వరస బహిరంగ సభలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సమస్తిపూర్, బెగుసరారు సభల్లో మోడీ ప్రసంగించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎన్‌డీఏ అన్ని రికార్డులను బద్దలుకొడుతుందని అన్నారు. గత 11 ఏండ్ల నుంచి కేంద్రం అందిస్తున్న సాయంతో బీహార్ అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుందని చెప్పారు. బీహార్ ఇప్పుడు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని తెలిపారు. బీహార్ ప్రజలకు ఇప్పుడు లాంతర్ (ఆర్జేడీ గుర్తు) వెలుగు అవసరం లేదని అన్నారు. ఇండియా బ్లాక్‌లోని కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన నాయకులు ‘అత్యంత అవినీతిపరులు, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు’ అని మోడీ విమర్శించారు. ఈ సభల్లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితన్ రారు మాంఝీ, ఎంపీ ఉపేంద్ర కుష్వాహా వంటి నాయకులు కూడా పాల్గొన్నారు.
ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే రూ.500కే ఎల్పీజీ సిలిండర్ అవినీతి రహిత పాలన : తేజస్వి యాదవ్
బీహార్ ఎన్నికల తరువాత ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.500లకే అందిస్తామని ఆర్జేడీ నాయకులు తేజస్వియాదవ్ శుక్రవారం హామీ ఇచ్చారు. అలాగే వృద్ధాప్య పెన్షన్‌ను రూ.1,500కు పెంచుతామని తెలిపారు. శుక్రవారం భక్తియాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం బీహార్‌లో 20 ఏండ్ల నుంచి, కేంద్రంలో 11 ఏండ్ల నుంచి అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర తలసరి ఆదాయం అత్యల్పంగా ఉందని, రైతులు పేదలుగానే ఉన్నారని తేజిస్వ యాదవ్ విమర్శించారు. అలాగే, రాష్ట్రంలోని ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో నేరాలు, అవినీతి తీవ్రంగా పెరిగిపోయాయని తేజస్వియాదవ్ పేర్కొన్నారు. దేశంలో అత్యధిక నేరాల రేటు కలిగిన టాప్ 5 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలేనని తేజస్వియాదవ్ ఆరోపించారు. శుక్రవారం పాట్నాలో తేజస్వియాదవ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘మేము తప్పుడు వాగ్దానాలు చేయము. మేము చెప్పినట్టే చేస్తాం. తేజస్వియాదవ్ ముఖ్యమంత్రి అయితే.. బీహార్ ప్రజలు కూడా ముఖ్యమంత్రి అయినట్టే. మేము అధికారంలోకి వస్తే బీహార్‌లో నేరాలు, అవినీతి లేకుండా చేస్తాము. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి కుంభకోణాలు పెరిగిపోయాయి. ప్రధానమంత్రే స్వయంగా నితీశ్‌కుమార్ చేసిన 55 కుంభకోణాల జాబితాను రూపొందించారు. దీనిపై ఏ చర్యలు తీసుకున్నారు? కుంభకోణాలు జరుగుతున్నప్పుడు, ఎటువంటి చర్య తీసుకోనప్పుడు అది జంగిల్ రాజ్‌నే. తుపాకీ కాల్పులు, హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు లేకుండా బీహార్‌లో ఒక్కరోజు కూడా లేదు. ప్రతిరోజూ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో అత్యధిక నేర రేటు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, బీహార్ రెండవది. దేశవ్యాప్తంగా క్రైమ్ రేటు కలిగిన రాష్ట్రాలు టాప్ 5 బీజేపీ పాలిత రాష్ట్రాలే’ అని ఆయన తెలిపారు. కేంద్ర సంస్థలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ‘గుజరాత్‌లో ఫ్యాక్టరీలు స్థాపించినవారు (బీజేపీ) బీహార్‌లో విజయం సాధించాలని కోరుకుంటారు. ఇదెలా సాధ్యమవుతుంది’ అని తేజస్వియాదవ్ ప్రశ్నించారు.
బీజేపీ తిరుగుబాటు అభ్యర్థికి ప్రశాంత్ కిషోర్ మద్దతు
గోపాల్‌గంజ్ స్థానంలో బిజెపి తిరుగుబాటు అభ్యర్థి అనుప్‌కుమార్ శ్రీవాస్తవకు మద్దతు ఇస్తున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ప్రకటించారు. ఈ స్థానం నుంచి తమ పార్టీ బరిలోకి దింపిన శశిశేఖర్ సిన్హా బీజేపీ ఒత్తిడితో పోటీ నుంచి వైదొలిగారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ కిషోర్ ఈ ప్రకటన చేశారు. శ్రీవాస్తవకు మద్దతు ఇవ్వడం తాను ఏడాది నుంచి అనుసరిస్తున్న నియమాలకు మినహాయింపు అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఈ స్థానంలో శ్రీవాస్తవ, జేఎస్‌పీ ఇద్దరు కూడా బీజేపీ అన్యాయానికి బాధితులని కిషోర్ తెలిపారు.
శాంతిభద్రతలకే ప్రాధాన్యత
- Advertisement -
- Advertisement -



