Sunday, March 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిహ్యాట్రిక్‌ దిశగా ఎల్‌డిఎఫ్‌ సమరం

హ్యాట్రిక్‌ దిశగా ఎల్‌డిఎఫ్‌ సమరం

- Advertisement -

కమ్యూనిస్టుల చివరికోట కేరళను సీపీఐ(ఎం) వామపక్షాలు నిలబెట్టుకుంటాయా? అనేది ఇప్పుడు మీడియాలో ప్రతిచోటా మనకు కనిపిస్తున్న శీర్షిక. దీన్ని సరైన పద్ధతిలో చెప్పాలంటే కేరళ కమ్యూనిస్టుల చివరికోట కాదు – ఒక విధంగా మొదటి కోట. ఇంకా చెప్పాలంటే ప్రపంచస్థాయిలోనే మొదటి ఎన్నికల విజయంతో వారు ప్రభుత్వం ఏర్పరచిన మొదటి ఉదాహరణగా పేరు గాంచింది, అయితే మొదటి ముఖ్యమంత్రి ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ స్వయంగా దీన్ని సవరించి చెప్పారు. 1950లో గుయానాలో చెడ్డీ జగన్‌ ఎన్నికల ద్వారా వచ్చిన మొదటి కమ్యూనిస్టు ప్రధాని అని ఇఎంఎస్‌ వెల్లడించారు. మనం ఇప్పుడు గూగుల్‌లో వెతికితే శాన్‌మారియో పేరు కనిపిస్తుంది. యూరప్‌లోని ఈ చిన్న రిపబ్లిక్‌ను 40వ దశకంలోనే కమ్యూనిస్టులు, సోషలిస్టులు కలిసి పరిపాలించారు. సరే ఆ చరిత్ర అలా వుంచితే భారతీయులకు తొలి కాంగ్రెసేతర కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా గుర్తుండి పోయిన నాయకుడు ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ మాత్రమే.

1959లో ఆ ప్రభుత్వాన్ని కూలదోయడం తో సమాఖ్య విధానం కోసం మొదటి దశ పోరాటం మొదలైంది, 1964లో సీపీఐ(ఎం)గా ఏర్పడిన తర్వాత మళ్లీ 1967లో ఇతర పార్టీలతో కలసి ఆయన మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 1970-79 మధ్య కాలంలో కాంగ్రెస్‌ సీపీఐల కలయికలో ప్రభుత్వాలు నడిచినా మళ్లీ 1980 నుంచి సీపీఐ-సీపీఐ(ఎం) ఇతర లౌకికపార్టీలు కలిసి లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డిఎఫ్‌)గా కొనసాగుతూనే వున్నాయి. ఈ కాలమంతటా కేరళ రాజకీయాలలోనూ, ఎన్నికలలోనూ ప్రధాన పోరాటం కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కూ, ఎల్‌డిఎఫ్‌కూ మధ్యనే సాగుతున్నది. ఈ ఐక్యత రాజకీయ విభజన ఇలాగే కొనసాగడం వామపక్షాల సిద్ధాంత నిబద్దతకూ, సమైక్య కార్యాచరణ స్ఫూర్తికి ఒక సజీవ నిదర్శనంగా పరిగణించాల్సి వుంటుంది. గత ఏడు దశాబ్దాల కేరళ రాజకీయాలు తీసుకుంటే పూర్తిపదవీ కాలంలో కొనసాగి రెండవసారి కూడా మళ్లీ గెలిచి మూడో దఫా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మొదటి వ్యక్తి పినరయి విజయన్‌ కావడం చారిత్రక విశేషం.

సర్వేల సానుకూల సంకేతాలు
2016-21 మధ్య మొదటిసారి ఆ ప్రభుత్వంలో వున్నప్పుడు దారుణమైన వరదలు, కరోనా కల్లోలం, నిపా వైరస్‌ వంటి వాటితో పాటు కేంద్రంలోని నరేంద్రమోడీ బీజేపీ ప్రభుత్వ ఘోరవివక్షను కూడా తట్టుకుని పినరయి ప్రభుత్వం మహత్తర విజయాలు సాధించింది. నిలిచిపోయిన ప్రాజెక్టుల పూర్తికి అత్యధికంగా ప్రాధాన్యత నివ్వడం, విద్యావైద్య రంగాలలో ప్రత్యేక శ్రద్ధపెట్టి సేవలందించడం, పెట్టుబడులు రాబట్టడం, కేంద్రంపై పోరాడటం నవ కేరళ నిర్మాణానికి సమగ్రమైన దార్శనిక, ప్రణాళిక రూపకల్పన వల్ల ప్రజల ఆదరాభిమానాలు పొందగలిగామని ముఖ్యమంత్రి చెబుతారు. ఇప్పుడు కూడా తాము తిరిగి అధికారంలోకి వస్తామని వామపక్షాలు గట్టి విశ్వాసంతో వున్నాయి. అయితే హ్యాట్రిక్‌ తనకోసం కాదనీ, కేరళ సమగ్రాభివృద్ధికి వెనకబడిన తనం నుంచి బయటకు రావడానికి అదొక్కటే మార్గమని ఆయన బలంగా చెబుతున్నారు.తాజాగా జరుపుతున్న ఎన్నికల సర్వేలు కూడా ఎల్‌డిఎఫ్‌కు అనుకూలత వున్నట్టు చెబుతున్నాయి.

హోరాహోరి పోటీ వున్నట్టు చెబుతున్న సర్వేలు కూడా ఎల్‌డిఎఫ్‌ బలం సమానంగా చూపించడం విశేషం, ముఖ్యమంత్రి ఎవరుండాలనే ప్రశ్నకు అత్యధికులు పినరయి విజయన్‌ వుండటం గమనించదగ్గది. నెట్‌వర్క్‌ 18 జరిపిన సర్వేలోనైతే యుడిఎఫ్‌కు 68-74 స్థానాలు వస్తాయని చెబుతున్నది.కాగా ఎల్‌డిఎఫ్‌కు 64 నుంచి 70 స్థానాల వరకూ సూచించింది. ఓట్ల శాతం చూస్తే ఇరు కూటములకు సమానంగా 36శాతానికి అటూ ఇటుగా కేవలం 0.1శాతం మాత్రమే తేడా వుంటుందని చెబుతున్నది. ఎంతో ఆర్బాటం చేసిన బీజేపీ ఎన్‌డిఎలకు 14శాతం ఓట్లు ,1-3సీట్లు వస్తాయని అంచనా వేసింది. పోల్‌మంత్ర అనే మరో సర్వేనైతే ఎల్‌డిఎఫ్‌కు 33.7శాతం, యుడిఎఫ్‌కు 38.2శాతం, ఎన్‌డిఎకు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయంటున్నా ముఖ్యమంత్రిగా పినరయి విజయన్‌ కు 38.2శాతం మద్దతు తెలిపారన్నది.

మనోరమ జరిపిన ఒక చిన్న సర్వేలోనైతే అరవైశాతం మంది ఓటర్లు అభివృద్ధికోసమే ఓటేయాలని అభిప్రాయ పడటం ఎల్‌డిఎఫ్‌కు అనుకూలమని తేల్చింది. అదే సమయంలో విజయన్‌ నాయకత్వానికి 30.62శాతం ఓటర్లు మొగ్గు చూపగా కాంగ్రెస్‌ ఒక నాయకుడుగా వున్న వి.డి.సతీషన్‌కు 27శాతం మాత్రమే మద్దతు తెలిపారు. ఇక ఓట్‌వైబ్‌ సర్వేలోనైతే 53.7శాతం మంది ఓటర్లు పినరయి విజయన్‌ పట్ల స్పష్టమైన మొగ్గు కనబర్చారు. రాజకీయంగా వ్యతిరేకించేవారు కూడా కాంగ్రెస్‌లో అనైక్యతకు అవకాశమివ్వరాదని భావించినట్టు పేర్కొంది.లోక్‌పాల్‌ సర్వేలో యుడిఎఫ్‌కు ఆధిక్యత చూపించినా ఎల్‌డిఎఫ్‌కు దాదాపు నలభై శాతం ఓట్లు వస్తాయని చెప్పడం గమనించదగ్గది. ఇప్పుడు కూడా పన్నెండు నియోజకవర్గాలలో వెయ్యిఓట్లలోపునే తేడా వుండబోతున్నదని సర్వేలు అంచనా వేస్తున్నాయి.

స్థానిక ఫలితాల హెచ్చరిక
కేరళ ఓట్ల విభజన, పోటాపోటీ ఎప్పుడూ తీవ్రంగానే వుంటుంది.ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ ఒకదాని తర్వాత ఒకటి వస్తుండేవి. అయితే గత ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం గొప్ప సేవలందించి అభివృద్ధి ముద్ర వేసుకోవడం, మత సామరస్యాన్ని కాపాడటం వల్లనే రెండవసారి ఎన్నిక కాగలిగింది. ఈ కారణం వల్లనే దాన్ని మూడోసారి రానివ్వకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల కుట్రదారులు చెలరేగిపోవడం స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ జాతీయ దృష్టి లౌకిక ప్రజాస్వామ్యం కోసం పోరాటం అన్న విశాల లక్ష్యం ఏ మాత్రం చూపించకపోగా కత్తికట్టి వ్యవహరిస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో బీజేపీతో చేతులు కలిపైనా వామపక్షాలను ఓడించేందుకు తెగబడ్డారు. 2021 శాసనసభ ఎన్నికల విజయం తర్వాత వచ్చిన 2024 లోక్‌సభ ఎన్నికలలోనే ఆ ప్రభావం కనిపించింది.

శాసనసభలో ప్రాతినిధ్యమే లేని బీజేపీ త్రిసూర్‌ సీటు గెలిచి మొదటిసారి ఒక లోక్‌సభ స్థానం పొందగలిగింది. ఓట్లలో దాని వాటా 2019లో 12.9 శాతం వుంటే 2024లో ఎన్‌డిఎ వాటా 19.2 శాతానికి పెరిగింది. ఇక 2025లో జరిగిన స్థానిక ఎన్నికలలో కూడా బీజేపీ త్రివేండ్రం కార్పొరేషన్‌ను పొందగలిగింది. కానీ ఓట్ల శాతం మాత్రం 14.7కు తగ్గిపోవడం కాంగ్రెస్‌తో స్థానిక అవగాహన ఫలితమే కావచ్చు. ఎల్‌డిఎఫ్‌కు రాజకీయంగా నష్టం కలిగింది.577 గ్రామ పంచాయతీల నుంచి 340 పంచాయతీలకు తగ్గింది.సమితులలో 111 నుంచి 63కు తగ్గింది.జిల్లా పంచాయతీలలో 11 నుంచి ఏడుకు తగ్గింది. మునిసి పాలిటీలలోనూ 43 నుంచి 29కి తగ్గిపోయింది.మొత్తం ఓట్ల శాతంలో తేడా 5.4శాతం వుంది.

స్థానిక ఎన్నికలలో తగిలిన ఈ దెబ్బను సీపీఐ(ఎం) తీవ్రంగా తీసుకొని నిష్కర్షగా సమీక్షించింది. స్థానిక ఎన్నికలకు ఇతర అంశాలు వ్యక్తిగతమైన పార్టీల పరమైన అవకాశవాద కలయికల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఇదేగాక శబరిమలై ఆలయంతో మొదలుపెట్టి ఏదో విధంగా మత తగాదాలు పెంచేందుకు హోంమంత్రి అమిత్‌ షా ప్రత్యక్ష పాత్రతో పథకాలు అమలు చేశారు. స్థానిక ఎన్నికలలో కనీసం 25శాతం ఓట్లు తెచ్చుకోవాలని పాచికలు వేసినా లోక్‌సభ ఎన్నికలలో కంటే తక్కువగా 16 శాతానికి తగ్గింది. స్థానిక ఎన్నికల తర్వాత ఎల్‌డిఎఫ్‌ ముఖ్యంగా సీపీఐ(ఎం) తీసుకున్న దిద్దుబాటు చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్‌తో పోలిస్తే కేరళలో సర్‌ కుట్రలు కూడా సాగకుండా ప్రభుత్వం జాగ్రత తీసుకుంది.

యుడిఎఫ్‌పై అవిశ్వాసం
పదేళ్లుగా అధికారానికి దూరమై దేశంలోనూ దెబ్బతిన్న కాంగ్రెస్‌ యుడిఎఫ్‌లు ఎలాగోలా మళ్లీ గద్దెక్కాలని అన్ని కుయుక్తులకు పాల్పడుతుండటం విమర్శకులు ప్రత్యేకంగా గమనిస్తున్నారు. బీజేపీతో సీపీఐ(ఎం) చేతులు కలిపిందనే నిందాప్రచారంతో మైనార్టీలను దూరం చేయాలని పెద్ద ప్రయత్నమే చేసింది. మీడియా కూడా అదే ప్రచారం చేసింది. ముస్లింలీగ్‌తో పాటు జమాతే ఇస్లామీని, ఎస్‌డిపిఐని కూడా కాంగ్రెస్‌ జట్టుకట్టింది. కాని దానివల్ల నిజంగా మైనారిటీలు యుడిఎఫ్‌వైపే వున్నట్టు నమ్మించే ప్రయత్నం ఫలించలేదు. కాంగ్రెస్‌ బీజేపీతో తాము చేతులు కలిపిన ఫలితంగానే వారు గెలిచిన తిరువనంతపురంలో ఓట్లు అటు ధార పోయడమే గాక నేరుగా రంగంలోవుండి ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ విధంగా రెండు రకాల మతతత్వాలతో చేతులు కలిపిన కాంగ్రెస్‌ నిజస్వరూపాన్ని ముఖ్యమంత్రి విజయన్‌ స్పష్టంగా చెప్పగలిగారు.

కేరళలో కాంగ్రెస్‌ బీజేపీకి బి టీమ్‌ మాత్రమేనని ఆయన అన్నమాట సంచలనం కలిగించింది. దాంతో మరింత రెచ్చిపోయి దుర్భాషలాడుతున్న కాంగ్రెస్‌కు ఓటర్లే పాఠం చెబుతారని ఎల్‌డిఎఫ్‌ నేతలు గట్టిగా చెబుతున్నారు. కాంగ్రెస్‌లో విడి సతీశన్‌, కెసివేణుగోపాల్‌, శశిథరూర్‌ వంటి వివిధ నాయకుల మధ్య కుమ్ములాటలు బహిరంగ రచ్చగా సాగుతున్నాయి. ఈ విషయంలోనూ సీపీఐ(ఎం)లోనే కలహాలు సాగుతున్నట్టు బురదజల్లే ప్రచారం చేసినా ఏకోన్ముఖంగానే ఎన్నికల పోరాటంలోకి దూకడం ప్రత్యక్ష సమాధానమైంది. ఒకరిద్దరు నాయకులు పదవీలాలసతో నిష్క్రమించినా ఆ ప్రభావం ఎన్నికల పోరాటంపై పడకపోవడం గమనించదగింది.ఎల్‌డిఎఫ్‌ అభ్యర్థులలో అత్యధికులు గతం నుంచి కొనసాగుతున్నవారే కావడం యాదృచ్చికమేమీ కాదు. ప్రభుత్వంపైన లేదా స్థానిక ప్రజాప్రతినిధులపైన ఎలాంటి వ్యతిరేకత లేదని విశ్వాసంతోనే ఎల్‌డిఎఫ్‌ పోరాటానికి సిద్ధమైంది. పదేళ్ల సంక్షేమం,అభివృద్ధి పథకాలనే ప్రధానంగా ప్రచారం చేస్తున్నది.

దేశంలో ఎక్కడా లేని విధంగా కేరళలో క్రైస్తవులు ముస్లింలు కలసి 47శాతం వున్నారు. హిందూత్వ రాజకీయాలు చేసే బీజేపీ వీరిలో క్యాథలిక్కులలో కొన్ని వర్గాలను దగ్గర చేసుకోవడానికి మత పాచికలు వేయడం విడ్డూరంగా కనిపించవచ్చు. దేశంలో బీజేపీకి కాంగ్రెస్‌లే ప్రధాన ప్రత్యర్థులు గనక తమను ఎన్నుకోవాలని ప్రచారం చేసుకుంటున్నా వాస్తవంలో వారు బీజేపీతో చేతులు కలపడం దాచేస్తే దాగని సత్యంలా గోచరిస్తున్నది. బీజేపీ మూడోశక్తిగా రాబోతున్నదనే జోస్యాలు ఇప్పటికే వెనక్కుపోయాయి. మరోవైపున సాంస్కృతిక రంగంలోనూ పోరాటం కీలకమనే వైఖరితో సీపీఐ(ఎం) కేరళను లౌకిక భారతానికి వేదికగా మార్చింది. దక్షిణాదిన స్టాలిన్‌ వంటి ముఖ్యమంత్రులే గాక కమల్‌హాసన్‌, ప్రకాశ్‌రాజ్‌ వంటి లౌకిక కళాకారులు రచయితలు కూడా కేరళలో ఎల్‌డిఎఫ్‌ పునరాగమనాన్ని ఆకాంక్షిస్తున్నారు.దేశంలో వామపక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశం గల ఒకే రాష్ట్రంగా కేరళను కాపాడు కోవాలనే ఆసక్తి దేశమంతటా వుంది. ఇరుగుపొరుగు దేశాల్లోనేగాక ప్రపంచమంతటా సాగుతున్న పరిణామాలు కూడా కేరళను ఆసక్తిగా చూస్తున్నాయి. తుది ఫలితం మే నాలుగో తేదీ స్పష్టమవుతుంది.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -