వైద్య సేవలతో ఆయనకు ఘన నివాళి
మల్లు వెంకటనర్సింహారెడ్డి స్మారక వైద్యశాల 15వ వార్షికోత్సవంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘మల్లు వెంకటనర్సింహారెడ్డి(ఎంవీఎన్) గొప్ప లెజండరీ లీడర్. ఆరోగ్యం మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం నిరంతరం పరితపించిన గొప్ప దార్శినికుడు ఎంవీఎన్’ అని వక్తలు కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నవతెలంగాణ కార్యాలయంలో నవతెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో మల్లు వెంకటనర్సింహారెడ్డి స్మారక ప్రజావైద్యశాల 15వ వార్షికోత్సవాన్ని ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్, బుకహేౌస్ ఎడిటర్ కె ఆనందాచారి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఎంవీఎన్ కూతరు పాతూరి కరుణ, మనవడు మల్లు వంశీ, నవతెలంగాణ జీఎం కె భరత్, డాక్టర్ లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ ప్రజావైద్యశాల ప్రాముఖ్యతను మరింత విస్తృతం చేయాలని సూచించారు.
ఏడుగురు డాక్టర్లతో నాలుగు లక్షల మందికి వైద్యసేవలు అందించటం చిన్నవిషయం కాదన్నారు. వైద్యం ఖరీదైన నేటి స్థితిలో ఉచిత వైద్యం అందించటం గొప్ప విషయం అన్నారు. డాక్టర్లు లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. పేదల కోసం పనిచేయటంలోనే ఆనందముందని చెప్పారు. ప్రజావైద్య సేవలకు కుటుంబ సభ్యుల సహకారాన్ని కోరారు. ఈ నేపథ్యంలో పాతూరి కరుణ రూ. రెండు లక్షలు, మల్లు వంశీ రూ.లక్ష, చెక్కులు అందించగా, మల్లు ఆధిత్య రూ.20వేలు ఇవ్వనున్నట్టు లక్ష్మి ప్రకిటించారు. రాంపల్లి రమేష్ మాట్లాడుతూ వీఎన్ స్ఫూర్తితో ప్రజావైద్యశాల నిర్వఘ్నంగా కొనసాగుతున్నదని తెలిపారు. ఆయన జీవించినంత కాలం పేదల పక్షపాతిగా ఉన్నారనీ, ఈ సందర్భంగా ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఒకటొకటిగా గుర్తు చేశారు. పేదలందిరికీ మెరుగైన ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం, స్వచ్ఛమైన తాగునీరు అందలానీ, అట్లాంటి సౌకర్యాలు కల్పించే సమాజం కోసం, హెల్త్ కల్చర్ కోసం నిత్యశ్రామికుడుగా వీఎన్ పనిచేశారని తెలిపారు.
ప్రజల్లో ఉన్న వెనుకబాటు తనం, అసమానతలు, దీనికి కారణమైన పాలక విధానాలపై ప్రజాఉద్యమాలను నిర్మించారని చెప్పారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మిన్ను విరిగి మీదపడ్డా వెన్నుచూపని ధైర్యశాలి వీఎన్ అని తెలిపారు. విచ్ఛిన్నాలకు వెరవకుండా ప్రజాఉద్యమాన్ని రక్షించుకోవటంలో క్యాడర్‌లో ధైర్యాన్ని నింపటంలో ఆయనకు ఆయనే సాటని కొనియాడారు. ప్రజల బాధల్ని మరిచి, అదానీ, అంబానీలకు సేవచేసే పాలకులు ఇప్పుడున్నారని విమర్శించారు. వైద్యం వ్యాపారంగా మారటంతో సామాన్యుడికి వైద్య సేవలు అందుబాటులో లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో చూపినట్టుగానే యదార్థజీవితంలో కూడా డెడ్‌బాడీకి చికిత్స చేసి డబ్బు గుంజుతున్న స్థితిని చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి లాభాపేక్ష కలిగిన సమాజంలో ఉచిత వైద్య సేవలను అందించటమనేది ప్రజాపక్షపాతులకు తప్ప మరోకరికి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఆనందాచారి మాట్లాడుతూ కార్పొరేట్ల లాభాపేక్ష కోసం విసర్జిస్తున్న విషపుగాలితో ఆరోగ్యం డేంజర్‌లో పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గాలి ఇప్పుడు ఢిల్లీని చుట్టుముట్టిందనీ, దీంతో పాలకులకు పాలుపోవటం లేదని తెలిపారు. ఆరోగ్యం కోసమే ఉద్యమాలను నిర్మించాల్సిన అవశ్యకత పెరిగిందని పేర్కొన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చే ఉచితాలకంటే విద్య, వైద్యాన్ని ఉచితం చేయాలని డిమాండ్ చేశారు. మల్లు లక్ష్మి మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్య సేవలందించేవారే నిజమైన దేవుళ్లని చెప్పారు. ప్రజల బాగోగుల కోసం పనిచేయటమే నిజమైన ప్రజాసేవ అనీ, అందులో మహిళల పాత్ర కీలకం కావాలని వీఎన్ కోరుకునే వారనీ గుర్తు చేశారు. ఆ స్పూర్తితోనే తన కుమారులు ఆధిత్య ప్రతి ఏడాది రూ.20వేలు ఆర్థిక సహాకారం ప్రకటించాడనీ, పెద్ద కుమారుడు అరుణ్‌రెడ్డి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.
భరత్ మాట్లాడుతూ బస్తీ దవాఖానాలు పెరిగినప్పటికీ వీఎన్ ప్రజావైద్యశాల ప్రాముఖ్యత తగ్గలేదని చెప్పారు. ఇక్కడ ప్రజాసేవే లక్ష్యంగా వైద్యులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు.పేషెంట్‌కు వైద్యాన్ని అందించటం, మానసిక స్థైర్యం నింపటంతో పాటు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటం ఇక్కడ ప్రత్యేకతని చెప్పారు. పాతూరి కరుణ మాట్లాడుతూ విద్య, వైద్యం పేదలకు దరి చేరాలని నాన్న(ఎంవీఎన్) కలలుకన్నాడని గుర్తు చేశారు. అట్లాంటి సేవా దృక్ఫదాన్ని కుటుంబంలో పెంపొందించారని తెలిపారు. ప్రజావైద్యశాల విస్తృతికి తగిన తోడ్పాటును అందిస్తామని చెప్పారు. వంశీ మాట్లాడుతూ వైద్య సేవల పట్ల ఎంవీఎన్‌కు మక్కువ ఎక్కువ అని చెప్పారు. అందుకే కుటుంబ సభ్యులను సైతం వైద్య వృత్తిలోకి పోవాలని ప్రొత్సహించారని గుర్తు చేశారు. ఏ వ్యాపారాల్లో ఉన్నా..ప్రజావైద్యశాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని తెలిపారు. వందన సమర్పణ విజయకుమార్ చేయగా కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్‌రావు, ఆస్పత్రి సిబ్బంది సురేఖ పాల్గొన్నారు.



