– సభ్యుల సందేహాలు నివృత్తి చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ
– ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యమని స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్(డీఎస్‌హెచ్)గా మారుస్తూ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుతం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు మేలు చేకూరడంతో పాటు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు. అదనపు ఖర్చు లేకుండా అధిక ప్రయోజనం అందించే నిర్ణయమని అభివర్ణించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ను రద్దు చేసి, దాని స్థానంలో సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా(డీఎస్‌హెచ్)గా మారుస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఎన్‌టీఆర్ హయాంలో ఏపీవీవీపీ ప్రారంభమైందనీ, తెలంగాణ వచ్చిన తర్వాత టీవీవీపీగా మారిందని చెప్పారు. టీవీవీపీ పరిధిలో ప్రస్తుతం 184 ఆస్పత్రులున్నాయనీ, వాటిలో 12 వేల వరకు బెడ్ల ద్వారా 1.2 కోట్ల మందికి ఔట్‌పేషెంట్ సేవలు, 12 లక్షల మందికి ఇన్‌పేషెంట్ సేవలు, 50 వేల మందికి శస్త్రచికిత్సలు, లక్షకుపైగా ప్రసవాలు జరుగుతున్నాయని వివరించారు. టీవీవీపీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థగా ఉండటం వల్ల పరిపాలనా పరిమితులు, ఉద్యోగుల వేతనాల చెల్లింపులో జాప్యం, రోగులకు సేవలు అందించడంలో కొన్ని లోపాలున్నాయని తెలిపారు. డీఎస్‌హెచ్‌గా మార్చడం వల్ల ట్రెజరీ ద్వారా సమయానికి జీతాల చెల్లింపు, ఎంప్లాయి హెల్త్ స్కీమ్ కింద క్యాష్‌లెస్ వైద్యం, రూ.1.2 కోట్ల ప్రమాద బీమా, పూర్తి ప్రభుత్వ ఉద్యోగ హోదా లభిస్తుందని వివరించారు. దీంతో ఉద్యోగుల భద్రత, గౌరవం పెరుగుతుందన్నారు. ఈ నిర్ణయంతో జిల్లా స్థాయిలోనే 80 శాతం వైద్య సేవలు అందించే విధంగా సెకండరీ స్థాయి ఆస్పత్రులు బలోపేతమవుతాయని చెప్పారు. ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఉన్న 16 స్పెషాలిటీ విభాగాల్లో 8 కీలక విభాగాలను బలోపేతం చేస్తామని ప్రకటించారు. గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పిల్లల వైద్యం, ఆర్థోపెడిక్స్, పాలీ ట్రామా, కంటి వైద్యం, ఊపిరితిత్తుల విభాగాల్లో సేవలను విస్తరించి, పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవకు అందిస్తామన్నారు. ప్రస్తుతం ఆరు ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ సేవలను విస్తరించనున్నామన్నారు. 200 పడకలకు పైగా ఉన్న 11 ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రెండేండ్లలో టీవీవీపీలో 757 నర్సింగ్ ఆఫీసర్లు, 180 ల్యాబ్ టెక్నీషియన్లు, 48 ఫిజియోథెరపిస్ట్ పోస్టులు భర్తీ చేశామనీ, మరో 2,075 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.
ఐదు జిల్లా ఆస్పత్రుల్లో పీజీ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచి ప్రతి రోగి 20-25 నిమిషాల్లో సేవలు పొందేలా చూస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మొత్తం 109 ట్రామా కేంద్రాల్లో 74 కేంద్రాలు డీఎస్‌హెచ్ పరిధిలో ఏర్పాటు చేస్తామన్నారు. టీవీవీపీ ఆస్పత్రులకు సంబంధించిన ఆస్తులన్నీ డీఎస్‌హెచ్‌కే ఉంటాయని స్పష్టం చేశారు. బిల్లుపై చర్చలో సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు, బీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేతలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీఆర్‌ఎస్ సభ్యులు కల్వకుంట్ల సంజరు, సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజీవ్‌రెడ్డి, వంశీకృష్ణ, మురళీనాయక్, మట్టా రాగమయి, బీజేపీ సభ్యులు పాల్వాయి హరీశ్‌బాబు, కె.వెంకటరమణారెడ్డి, ఎంఐఎం సభ్యులు జాఫర్ హుస్సేన్, తదితరులు మాట్లాడుతూ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
డీఎస్‌హెచ్‌గా వైద్యవిధాన పరిషత్ బిల్లుకు శాసనసభ ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



