– కృష్ణ, గోదావరి జలాల వినియోగంలో గత పాలకుల వైఫల్యం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
– 10 వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ- ముదిగొండ
కృష్ణా, గోదావరి నదుల్లో ఉన్న తెలంగాణ వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీతో కలిసి కమలాపురం గ్రామంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో 5.91 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ సామర్థ్యం ఉన్నాయని, మరో 10.75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గిడ్డంగుల కోసం గిడ్డంగుల సంస్థ ద్వారా నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సకాలంలో సాగు నీటి సరఫరా, రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక కార్యక్రమాలు అమలు చేయడం వల్ల దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి మన రైతులు సాధించారన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం వల్ల నాగార్జునసాగర్ నిండదని, దీని వల్ల ఖమ్మం జిల్లా రైతాంగం నష్టపోతుందన్నారు. కృష్ణానదిపై జూరాల, కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి చేశాయని తెలిపారు. ప్రతి రోజూ 13 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ పై భాగం నుంచి రాయలసీమకు లిఫ్ట్ చేసేలా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ తీసుకునేలా చేస్తుందని, ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే 30 రోజుల్లో శ్రీశైలం ఖాళీ అవుతుందని అన్నారు. రాజకీయ విమర్శలకు తావు లేకుండా బనకచర్ల ప్రాజెక్టును అందరం వ్యతిరేకించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయటకు రాకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సమర్థవంతంగా వాదనలు వినిపించడం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడిందని చెప్పారు. కమలాపురం గ్రామంలో చేపట్టిన గోదాముల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పెద్దమండవ గ్రామ ఎస్సీ కాలనీలో రూ 58.50 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, తెలంగాణ హస్తకళల చైర్మెన్ నాయుడు సత్యనారాయణ, డీసీసీబీ చైర్మెన్ దొండపాటి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అబ్దుల్ ఆలీమ్, ముదిగొండ సొసైటీ చైర్మెన్ తుపాకుల యలగొండ స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
మన వాటాలో ఒక్క నీటి చుక్కనూ వదులుకోం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES