Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్థిక అంతరాలు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం

ఆర్థిక అంతరాలు లేని భారతదేశాన్ని నిర్మిద్దాం

- Advertisement -

మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపు
ఎం.ఏ.కె.దత్‌ 2వ వర్థంతి సందర్భంగా స్మారకోపన్యాసం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వర్తమాన భారతదేశం ఆర్థిక, సామాజిక అంతరాలతో కూడుకొని ఉన్నదనీ, ప్రజల మధ్య ఐక్యతకు విఘాతంగా ఉన్న ఈ అంతరాలను తగ్గించేందుకు అభ్యుదయ శక్తులు ఏకం కావాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. టీఎస్‌యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు అక్షయకుమార్‌ దత్‌ (ఎం.ఎ.కె.దత్‌) ద్వితీయ వర్ధంతి సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్‌్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆహుతులతో కలిసి దత్‌ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ‘వర్తమాన భారతదేశం – సామాజిక, ఆర్థిక పరిస్థితులు’ అనే అంశంపై స్మారకోపన్యాసం ఇచ్చారు.

అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ దేశంలో స్వాతంత్రం వచ్చే నాటికి ఆహార కొరత, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో సమాజంలో వెనుకబాటుతనం ఉండేదని తెలిపారు. విద్యారంగం అందరికీ అందుబాటులో లేకపోవడం కూడా వెనుకబాటుకు కారణంగా ఆనాడు పాలకులు భావించారని గుర్తుచేశారు. దీంతో విద్య, వైద్య రంగాలతో పాటు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ నాటి పాలకులు కొన్ని సంస్కరణలు తెచ్చారని తెలిపారు. దీంతో 25 ఏండ్ల క్రితం వరకు దేశంలో ప్రగతిశీల శక్తులు కోరుకుంటున్న దిశగా కొంత ఆశాజనకంగా పరిస్థితులు కనిపించేవని తెలిపారు. అయితే నేటి పాలకులు ప్రజల మధ్య సామాజిక, ఆర్థిక అంతరాలను పెంచి ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నారనీ, ముఖ్యంగా కార్పొరేట్‌ శక్తుల అనుకూల ఆర్థిక విధానాలను అవలంబిస్తూ పేదలు, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణ స్థాయిని మరింత దిగజారుస్తున్నారని విమర్శించారు. ఇద్దరు, ముగ్గురు పెట్టుబడిదారుల కోసం ఇచ్చే రాయితీలు బడ్జెట్లో 40 శాతానికి మించి ఉన్నాయని అదే సందర్భంలో 70 శాతంగా ఉన్న జనాభా కోసం 10 శాతం బడ్జెట్‌ కూడా ఖర్చు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యారంగంలో కార్పొరేట్‌ శక్తుల జోక్యం పెరిగి పేద, మధ్యతరగతికి చదువు అందని ద్రాక్షగా మారిందన్నారు. విద్యలో అంతరాలను రూపుమాపడం ద్వారా సామాజిక ఐక్యతను సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దత్‌ ఆశయాల సాధన కోసం కార్యకర్తలందరూ పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చావ రవి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సిందేననీ, జాతీయ స్థాయిలో ఎన్‌ఈపీ-2020 ద్వారా విద్యారంగాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తుందని విమర్శించారు. రాష్ట్ర జాబితాలో నుంచి కేంద్రం పెత్తనం పెరుగుతున్నప్పుడు పేదలకు విద్య అందకుండా పోతుందనీ, అలాగే రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింభించవని తెలిపారు. అందుకోసం విద్యను రాష్ట్ర జాబితాలో ఉంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట్‌ మాట్లాడుతూ దత్‌ ఆదర్శ ఉపాధ్యాయునిగా, సంఘ నాయకునిగా తన చివరి శ్వాస వరకు సంఘం కోసం పనిచేశారని తెలిపారు. 76 ఏండ్ల వయస్సులో కూడా అలసట లేకుండా సంఘ కార్యక్రమాల్లో, పోరాటాలలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆ ఆదర్శ నేతను స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు సభ్యురాలు టి.జ్యోతి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌, టీఎస్‌యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకులు సంయుక్త, నరహరి, మస్తాన్‌ రావు, రాష్ట్ర కార్యదర్శులు సింహాచలం, వెంకటప్ప, పౌరస్పందన వేదిక ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం, పద్మశ్రీ, దత్‌ సతీమణి లలితమ్మ, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -