వామపక్ష పార్టీల పిలుపు
పాట్నా : బీహార్‌లో లౌకిక ప్రజాస్వామ్యశక్తులను గెలిపిద్దామని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. పాట్నాలోని సీపీఐ బీహార్ రాష్ట్ర కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ్ నరేశ్ పాండే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి లాలన్ చౌదరి ఓ ప్రకటన విడుదల చేశారు. సీపీఐ, సీపీఐ(ఎం) ఇండియా బ్లాక్ ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరమున్నదన్నారు. అన్ని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకమై రాజ్యాంగ పరిరక్షణ కోసం నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. డబుల్ ఇంజిన్ పేరిట మోడీ, నితీశ్ సర్కార్లు అనుసరిస్తున్న నిరంకుశ, నియంతృత విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓట్ చోరీతో బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం పరోక్షంగా సహకరిస్తున్నదని ఆరోపించారు.
బీహార్‌లో అవినీతి, ప్రజావ్యతిరేక చట్ట వ్యవస్థ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిరుద్యోగం, విద్యా వ్యవస్థ పతనం మినహా నితీశ్ సర్కార్ ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదన్నారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి.. ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించటానికి.. నేటి నుంచి ఈ నెల 8 (బుధవారం) వరకు అన్ని అసెంబ్లీ ప్రాంతాల్లో ఉమ్మడి కార్యకర్తల సమావేశాలను నిర్వహించాలని వామపక్షపార్టీలు నిర్ణయించాయి. సీపీఐ, సీపీఐ(ఎం)లకు ఇండియా బ్లాక్‌లో సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. బీహార్‌లో బీజేపీ విభజన రాజకీయాలను ఓడించడానికి 2020లో లౌకిక ప్రజాస్వామ్య పార్టీలను ఏకం చేయడంలో సీపీఐ, సీపీఐ(ఎం) ముఖ్య పాత్ర పోషించాయని ఈ సందర్భంగా నేతలు గుర్తుచేశారు.