ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సాయిలు
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రజల హక్కుల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోరాడాలని ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవరాయ సాయిలు అన్నారు. రాజ్యాంగం ఆమోదించబడిన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చెరిపెల్లి యాదగిరి స్వామితో కలిసి పూలమాలవేశారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ మనువాద సిద్ధాంతం పేరుతో రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు.
అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడంలో రాజ్యాంగం దోహదపడుతుందని తెలిపారు. ఉన్నత వర్గాలకు ప్రాధాన్యత కల్పించేందుకే మనువాద సిద్ధాంతం పేరుతో రాజ్యాంగాన్ని రూపుమాపేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, దళిత బహుజనులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేందుకు దోహదపడుతుందని తెలిపారు. పేదల పక్షపాతిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దండు రామచంద్రు, జలగం నరేష్, ఎడవెల్లి ధర్మేందర్, గ్యార నాగార్జున తదితరులు పాల్గొన్నారు.



