సభ్యులకు, రాజకీయ పార్టీలకు స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి
క్షీణిస్తున్న గౌరవ మర్యాదల ధోరణి పట్ల ఆందోళన
న్యూఢిల్లీ : చట్టసభల గౌరవం క్షీణించడం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అందరూ ఆలోచించి వ్యవహరించాల్సిన అవసరం వుందంటూ ఉభయ సభల సభ్యులతో పాటూ రాజకీయ పార్టీలను ఆయన కోరారు. ఢిల్లీ అసెంబ్లీ ఆతిథ్యమిచ్చిన అఖిల భారత స్పీకర్ల మహాసభలో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. ప్రిసైడింగ్ అధికారులు సమావేశాలకు అధ్యక్షత వహించే సమయాల్లో వివాదరహితంగా, స్వతంత్రంగా, న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం వుందని అన్నారు.
”సభలో ఏదైనా చివరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగానైనా మాట్లాడే హక్కును మన రాజ్యాంగ నిర్మాతలు హామీ కల్పించారు. అయితే, ఈ స్వేచ్ఛ వెనుక గల ఉద్దేశ్యం క్షీణిస్తోంది. అది మనందరికీ ఆందోళన కలిగించే అంశం.” అని ఆయన అన్నారు. అర్ధవంతమైన చర్చలు జరగాలని, ప్రజా ప్రయోజనాలు కలిగిన అంశాలను పరిశీలించాలన్న లక్ష్యంతో సభలు నిర్వహించబడేలా చూడడం ఎంత అవసరమూ, అనివార్యమో స్పీకర్ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. పక్షపాత ప్రయోజనాలకు అతీతంగా వ్యవహరించాల్సిందిగా ఆయన పార్లమెంట్ సభ్యులను కోరారు. తమను ఎన్నుకున్న ప్రజల అంచనాలు, ఆకాంక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన అంశాలను సభల్లో సభ్యులు లేవనెత్తాల్సి వుంటుంది. సభలు ప్రజల వాణిగా మారాలని, వారి సూచనలను, అభిప్రాయాలను అర్ధవంతంగా ప్రతిబింబించాలని ఓం బిర్లా కోరారు. సభ లోపల, వెలుపల మర్యాదను కాపాడుకోవడం, గౌరవప్రదమైన భాషను ఉపయోగించడం యొక్క ప్రాధాన్యతను బిర్లా నొక్కి చెప్పారు.
”విభేదించడం ప్రజాస్వామ్యం యొక్క బలం. కానీ, సభ్యులు సభలో, వెలుపల ప్రవర్తనా నియమావళిని కొనసాగించాలి. మన మాటలను, చర్యలను ప్రజలు గమనిస్తూ వుంటారు.” అని ఆయన పేర్కొన్నారు. చట్టసభల హుందాతనాన్ని, గౌరవాన్ని పరిరక్షిస్తూనే భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.