కొంతమందికి ఏ విషయం గురించి అయినా లోతుగా ఆలోచించే అలవాటు ఉంటుంది. దీంతో పదే పదే అవే ఆలోచనల్లో మునిగిపోయి బాధపడుతుంటారు. ఒకానొక దశలో ఈ మానసిక వేదన మనల్ని ఒత్తిడి, ఆందోళనల్లోకి నెట్టేస్తుంది. అయితే ఇలాంటి మానసిక సమస్య బారిన పడుతోన్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలు, ఇంటినీ ఉద్యోగాన్ని బ్యాలన్స్ చేసుకోలేకపోవడం, సామాజిక ఒత్తిళ్లు, వివక్ష, హింస, పని ప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలు వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.
కీడెంచి మేలెంచమంటారు పెద్దలు. కొంత మంది ప్రతి విషయానికీ ఈ సూత్రాన్ని ఆపాదించుకుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా పదే పదే దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటారు. ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారు. ఈ నెగెటివిటీ కొన్నాళ్లకు కట్టలు తెంచుకొని మన భావోద్వేగాలు అదుపు తప్పేలా చేస్తుంది. వర్రీ బర్నౌట్ అని పిలిచే ఈ పరిస్థితికి మనలోని అనవసర భయాలు, చుట్టూ ఉన్న ప్రతి కూల పరిస్థితులు, హార్మోన్లలో మార్పులు, శారీరక అలసట వంటివీ కారణాలుగా ఉండే అవకాశం ఉంది.
చాలా వరకు మానసిక సమస్యలు తీవ్రరూపం దాల్చే దాకా బయటపడవు. వర్రీ బర్నౌట్ కూడా ఇదే కోవలోకొస్తుంది. అయినప్పటికీ శారీరక, మానసిక ప్రవర్తన ద్వారా ఈ సమస్యకు సంబంధించిన ప్రాథమిక లక్షణాల్ని గుర్తించవచ్చు. చిన్న విషయాలకే ఒత్తిడికి గురవడంతో పాటు ఒక రకమైన ఆతృత మనలో కనిపిస్తుంది. అది సామాజిక అంశమైనా తమకు ఒక్కరికే సమస్య వచ్చినట్లుగా అధైర్యపడుతుంటారు. ఒంటరిగా ఫీలవుతుంటారు. దాంతో నలుగురిలో కలవడానికి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడరు.
మరీ ముఖ్యంగా ఉత్సాహాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతుంటారు. తద్వారా వారి జీవనశైలిలో మార్పులొస్తుంటాయి. నిద్ర లేవడం దగ్గర నుంచి ఇంటి పనులు, ఆఫీసు పనులు… ఇలా ప్రతిదీ భారంగా పూర్తి చేస్తుంటారు. చిన్న విషయానికే చిరాకు పడడం వర్రీ బర్నౌట్ ఉన్న వారిలో కనిపిస్తుంది. దాంతో ఇంటా, బయట అనే తేడా లేకుండా తమను మాట్లాడించిన వారిపై చీటికీ మాటికీ చిరాకు పడుతుంటారు. ఇలా ప్రతి విషయానికీ అతిగా ఆలోచిస్తూ, బాధపడడం వల్ల వారి మనసు సున్నితంగా మారిపోతుంది. తద్వారా అనవసర విషయాలకే భయపడడం, ఏడవడం వంటి లక్షణాల్ని వీరిలో మనం గుర్తించవచ్చు.
మానసికంగానే కాదు శారీరక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మన జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవడంతో పాటు కొన్ని అలవాట్లు పాటించాల్సి వుంటుంది. వ్యాయామానికి ఎలాంటి సమస్యనైనా దూరం చేసే శక్తి ఉంది. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా ఇది చాలా బాగా పని చేస్తుంది. దీని వల్ల ఒత్తిడి హార్మోన్లు సమతులమై ప్రశాంతత దరిచేరుతుంది.
ఈ రకం ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మనసులోని ఆలోచనల్ని పేపర్‌పై పెట్టడం, వాటిని విశ్లేషించుకోవడం చక్కటి మార్గం. ఫలితంగా మనసులో ఒత్తిళ్లు, ఆందోళనలు, యాంగ్జైటీ.. వంటి సమస్యలు దూరమై సానుకూల ఆలోచనలు పెరిగినట్లు ఓ అధ్యయనంలో తేలింది. అలాగే మనసులోని బాధను మరొకరితో పంచుకుంటే తగ్గుతుంటారు చాలా మంది. ఒత్తిడితో బాధపడేవారు సమస్య చిన్నదైనా పెద్దదైన్నా మీకు నచ్చిన వారితో పంచుకుంటే మనసుకు ఉపశమనం కలుగుతుంది. అలాగే సమస్యకు తగిన పరిష్కారం దొరుకుతుంది.
నలుగురితో పంచుకుందాం
- Advertisement -
- Advertisement -