– వామపక్షాలు ఐక్యతే ప్రజాస్వామ్యానికి రక్షణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ(ఎం) ప్రభావం ఉన్నా పంచాయితీల్లో స్థానిక కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కష్టపడి పోటీలో ఉన్న పార్టీ అభ్యర్ధులను గెలిపించి మన సత్తా చాటాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే. పుల్లయ్య పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపధ్యంలో పార్టీ మండల కమిటీ సభ్యులు,శాఖా కార్యదర్శుల అత్యవసర సమావేశాన్ని బుధవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం లో మండల కార్యదర్శివర్గ సభ్యులు ముళ్ళగిరి గంగరాజు అద్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మోడీ భారతీయ లౌకిక విధానానికి వ్యతిరేకంగా మత ప్రాతిపదిక రాజరిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతిపక్షాలను, ముఖ్యంగా వామపక్షాలు ను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని,వారికి ప్రత్యామ్నాయంగా వామపక్షాలు ఐక్యతే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం అని అభిప్రాయపడ్డారు.స్థానిక కమ్యూనిస్ట్ పార్టీలను కలుపుకుని పంచాయితీ ఎన్నికల్లో ఎర్రజెండా సత్తాను చాటాలని తెలిపారు.
జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి మాట్లాడుతూ ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తామో అందులో పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేసి పార్టీ విజయానికి దోహద పడాలని అన్నారు. మరో జిల్లా కమిటీ సభ్యులు అర్జున్ మాట్లాడుతు పార్టీ అనుబంధ సంఘాలను,రంగాలను కలుపుకుని పార్టీ నిలబెట్టిన అభ్యర్ధుల విజయానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు మడకం గోవిందు,మడిపల్లి వెంకటేశ్వరరావు,గడ్డం సత్యనారాయణ,నారం అప్పారావు,కేసుపాక నరసింహారావు లు పాల్గొన్నారు.


