Wednesday, November 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎర్రజెండాతో కలిసి నడుస్తాం

ఎర్రజెండాతో కలిసి నడుస్తాం

- Advertisement -

– సీపీఐ(ఎం) నేత సామినేని హత్య దారుణం
– త్వరలో రామారావు కుటుంబ సభ్యులతో డీజీపీని కలుస్తా
– డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో మూడు రాజకీయ హత్యలు జరిగినా నిందితులపై చర్యలు లేకపోవడం శోచనీయం
– నేను మార్కెట్‌ సందర్శించిన రోజే బీఆర్‌ఎస్‌ వాళ్లు రావడం విచిత్రం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి


ఎర్ర జెండాతో కలిసి నడుస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సీపీఐ(ఎం) నేత సామినేని రామారావు హత్య దారుణమని తెలిపారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలో మూడు రాజకీయ హత్యలు జరిగినా ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలూ లేకపోవడం శోచనీయమన్నారు. త్వరలో రామారావు కుటుంబ సభ్యులతో కలిసి డీజీపీని కలుస్తానని తెలిపారు. ఖమ్మంలోని ఓ ప్రయివేటు రెస్టారెంట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉందని, తొలి ఉద్యమానికి ఊపిరిలూదిన జిల్లా ఇదని అన్నారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. జలగం వెంగళరావు లాంటి మహానీయులను అందించిన జిల్లా అని, ఆయన తర్వాత జిల్లా అభివృద్ధి తుమ్మల నాగేశ్వరరావు వల్లే జరిగిందని తెలిపారు. తుమ్మల లాంటి నేతలు బయటకు వెళ్లడం వల్లనే బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందన్నారు. 20 ఏండ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని తెలిపారు. అలాంటి వారి గురించి కచ్చితంగా మాట్లాడుతానని చెప్పారు. ఇప్పుడే రాజకీయ పార్టీ గురించి ఆలోచన చేయటం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ మూడోసారి ఓడిపోవటానికి కారణాల్లో తుమ్మలని వదులుకోవటం కూడా ఒక కారణమన్నారు. గతంలో తనను నిజామాబాద్‌కు మాత్రమే పరిమితం చేశారన్నారు. మళ్లీ తాము జాగృతిని బలోపేతం చేసుకుంటామని, ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు. దేశంలో కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా విఫలమైందన్నారు. బీహార్‌లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఎలా గెలిచిందని, అంటే ప్రజల తరపున పోరాటం చేయాల్సినంత ప్రతిపక్షాలు చేయటం లేదని తెలిపారు. అందుకే జాగృతి సంస్థగా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఖమ్మంలో తాము మార్కెట్‌ సందర్శనకు వెళ్తామన్న రోజే బీఆర్‌ఎస్‌ వాళ్లు వెళ్లేందుకు కార్యక్రమం పెట్టుకున్నారని, ఇన్ని రోజులు ఏమైంది? మేము రాగానే గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ఎంతో చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలు తనకు మద్దతివ్వాలని కోరుతున్నానని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఏ పోరాటం వచ్చిన ఎర్రజెండా పార్టీలతో తాము కలిసి పనిచేస్తామని ప్రకటిస్తున్నానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -